ప్రగతిభవన్ సాక్షిగా మోసం.. కేసు నమోదు

by  |
ప్రగతిభవన్ సాక్షిగా మోసం.. కేసు నమోదు
X

దిశ, క్రైమ్ బ్యూరో : హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ సాక్షిగా జరిగిన ఓ మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సబ్ ఇన్‌స్పెక్టర్(SI) ఉద్యోగం ఇప్పిస్తానంటూ.. ఓ నిరుద్యోగిని బురిడీ కొట్టించిన వ్యక్తి రూ. 25 లక్షలు కొట్టేశాడు. మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా పోచారం గ్రామానికి చెందిన బద్రినారాయణ ఓ పనిమీద ఇటీవల సీఎం క్యాంపు కార్యాలయం వద్దకు వచ్చాడు. ఇదే సమయంలో అక్కడ సుధాకర్ అనే వ్యక్తి పరిచయమన్నాడు. బద్రి నారాయణ నిరుద్యోగాన్ని ఆసరాగా చేసుకున్న సుధాకర్.. ‘నేను ప్రగతి భవన్‌లో పని చేస్తాను.. నీకు పోలీస్‌గా ఉద్యోగం ఇప్పిస్తాను’ అంటూ నమ్మించాడు.

అందుకు కొద్దిగా డబ్బులు ఖర్చు అవుతోంది.. కానీ, ఉద్యోగం వచ్చాకా.. నీకు డబ్బులే.. డబ్బులు అంటూ మాయ మాటలు చెప్పాడు. దీంతో సుధాకర్‌ను పూర్తిగా నమ్మిన బద్రి నారాయణ అతడి వద్ద ఉన్న డబ్బులతో పాటు.. అప్పులు చేసి మరీ.. మూడు విడతల్లో రూ. 25 లక్షలు అప్పగించాడు. ఆ తర్వాత కూడా బాధితుడిని నమ్మించేందుకు సుధాకర్ ప్రగతి భవన్ పక్కనే ఉన్న టూరిజం ప్లాజాలో కొన్ని రోజుల పాటు అద్దెకు ఉన్నాడు. అప్పుడు.. ఇప్పుడు ఉద్యోగం వస్తుంది అంటూ కాలక్షేపం చేశాడు. ఆ తర్వాత ఉన్నట్టుండి సుధాకర్ పరారీ అయ్యాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న బద్రి నారాయణ దిక్కుతోచని స్థితిలో పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. నిందితుడు మరికొంతమందిని కూడా ఇదే విధంగా మోసం చేసినట్టు గుర్తించారు.



Next Story

Most Viewed