సవాళ్ల దారిలోనే ఆమె ప్రయాణం.. సీఎంగా నేడు ప్రమాణం

by  |
సవాళ్ల దారిలోనే ఆమె ప్రయాణం.. సీఎంగా నేడు ప్రమాణం
X

కోల్‌కతా: తాజా అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. కానీ, పార్టీ సారథి మమతా బెనర్జీ నందిగ్రామ్ నుంచి స్వల్పతేడాతో పరాజయం పాలయ్యారు. కొత్తగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలు ఆమెను సోమవారం ఏకగ్రీవంగా శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. బుధవారం ఉదయం 10.45 గంటలకు రాజ్‌భవన్‌లో సీఎంగా దీదీ ప్రమాణం తీసుకోనున్నారు.

అభిమానులు ప్రేమగా దీదీ అని పిలుచుకునే మమతా బెనర్జీకి సవాళ్లను స్వీకరించడం ఇష్టమైన పని. నలుగురు భయపడుతుంటే, ముందుకెళ్లి దాన్ని తేలికగా తీసిపారేయడం ఆమెకు అలవాటు. తొణుకుబెణుకు లేకుండా అనూహ్యవేగంతో నిర్ణయాలు తీసుకోవడం ఆమె సొంతం. అదురుబెదురు లేకుండా ఎంతటి ప్రత్యర్థినైనా ముచ్చెమటలు పట్టించే ఆత్మస్థైర్యం, విజయాన్ని తన వెంట పరుగులు పెట్టించుకోవడం ఆమె నైజం. తెగువకు చిరునామా. బెంగాల్ టైగర్ మమతా బెనర్జీ రాజకీయ ప్రస్థానాన్ని చూచాయగా పరిశీలించినా మనకు అర్థమయ్యే విషయాలివి.

1970వ దశకంలో కాంగ్రెస్ కార్యకర్తగా రాజకీయంలోకి ప్రవేశించిన మమతా బెనర్జీ సోషలిస్ట్ నేత జయప్రకాశ్ నారాయణ్ కారుపై డ్యాన్స్ చేసి తొలిసారిగా మీడియాలో దృష్టిలో పడ్డారు. అనతికాలంలోనే మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీగా ప్రమోట్ అయ్యారు. చురుకైన కార్యకర్త మమతకు టికెట్ ఇవ్వడంపై వెనుకాముందాడిన రాజీవ్ గాంధీ, అరుణ్ నెహ్రూలు గెలవడం దాదాపు అసాధ్యమనుకునే జగదేవ్‌పూర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి 1984లో టికెట్ ఇచ్చారు. అది కమ్యూనిస్టుల కోట. మరెవ్వరైనా ఆ ఆఫర్‌ను తిరస్కరించేవారే. కానీ, దీదీ మాత్రం సవాల్ స్వీకరించి సీపీఎం దిగ్గజ నేత సోమనాథ్ ఛటర్జీని ఓడించారు. 1984లో పిన్నవయస్సులోనే పార్లమెంటరీలోకి ప్రవేశించారు.

తర్వాత 1991, 96, 98,99,2004 జనరల్ ఎలక్షన్స్‌లో విజయం సాధించారు. బొగ్గు గనులు, రైల్వే శాఖల బాధ్యతలు చేపట్టారు. 1997లో బెంగాల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోమేంద్ర నాథ్ మిత్రతో అభిప్రాయబేధాలు ఏర్పడి, పార్టీ వీడి ముకుల్ రాయ్‌తో కలిసి 1998 జనవరిలో ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీని నెలకొల్పారు. పార్టీని నెలకొల్పిన వెంటనే రాష్ట్రంలో ప్రధానప్రతిపక్షంగా అవతరించడం, సింగూర్, నందిగ్రామ్, ఇతర ఉద్యమాలను చురుకుగా చేపట్టి 2011లో పార్టీని అధికారంలోకి తెచ్చారు. ప్రజా పోరాటాల్లో చురుకుగా పాల్గొని 2011 మే 13న బెంగాల్ సీఎం అయ్యారు. అప్పటి నుంచి ఆమె వెనుదిరిగి చూసుకోలేరు. మరో కీలక మైలురాయిగా ఈ ఏడాది మే 2ను పేర్కొనవచ్చు. బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు, ఉద్ధండలు, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులందరూ కలిసి బెంగాల్‌లో ప్రచారం చేసినా, దీదీ సింగిల్ హ్యాండ్‌తో హ్యాండిల్ చేశారు. ప్రతి సీట్‌లో తానే పోటీ చేస్తున్నట్టు భావించాలని, తన అభ్యర్థులందరినీ తనపేరుపై గెలిపించాలని ఆమె అప్పీల్ చేయడం ప్రజల్లో ఆమెకున్న పట్టును తెలియపరుస్తుంది.

మూడు దశాబ్దాల లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వానికి దీదీ చుక్కలు చూపించారు. ఆర్గనైజ్డ్‌గా పోటీ చేసే సీపీఎంనూ రాష్ట్రంలో మట్టికరిపించి అధికారాన్ని కైవసం చేసుకున్నారు. దశాబ్దకాలం తర్వాత ఆ పార్టీని రాష్ట్రంలో దాదాపుగా తుడిచేసినంత పనిచేశారు. కాంగ్రెస్, సీపీఎం, బీజేపీలనూ దీటుగా ఎదుర్కొని తనకు సవాలే కాదన్న పరిస్థితికి నెట్టేశారు. దీదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షాలన్నీ కలిసి కూడా రాష్ట్రంలో డబుల్ డిజిట్ సీట్లను సాధించుకోలేకపోవడం గమనార్హం.

దీదీ ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా, ఎంత ఎదిగినా ఆ దర్బం, డాబు ఆమెలో కనిపించవు. కాన్వాయ్‌లో ప్రయాణిస్తూ హఠాత్తుగా కారు దిగి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లగలరు. టీ స్టాల్ దగ్గర అధికారుల కోసం వెయిట్ చేస్తూ చాయ్ చేసుకుని తాగగలరు. తన ఆఫీసు డోర్ దగ్గరుండే కానిస్టేబుల్‌తో స్నాక్స్ షేర్ చేసుకుని సాదాసీదాగా మాట్లాడగలరు. తన వ్యక్తిగత వివరాలు వెల్లడించడంలో ఎదుటివ్యక్తి హోదాలు, ఇతర సంశయాలను ఖాతరుచేయకుండా వెల్లడించే విధానం ప్రజలకు నచ్చుతుంది. సాధారణ ప్రజల ఆరోగ్యం కోసం స్వాస్త్య సతి, మహిళకు విద్య, స్వేచ్ఛ కోసం కన్యశ్రీ, అందరికీ ఆహారం అందించే ఖాద్య సతి లాంటి పథకాలు ఆమెను మరింత దగ్గరికి చేర్చాయి. నేల విడిచి సాము చేయకపోవడం ఆమె ధైర్యానికి, విజయానికి మరో కారణం కావొచ్చు.

Next Story