అతనికిచ్చిన పరిహారం రికవరీ చేయండి

by  |

దిశ, కరీంనగర్:
కాళేశ్వరం ఎత్తిపోతల ఫథకంలో భాగంగా భూములు కోల్పోయిన వారికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించింది. అయితే ఓ వ్యక్తి మాత్రం ముంపునకు గురైన ప్రాంతంలో తనకు స్థలం లేకున్నా నకిలీ పత్రాలు సమర్పించి ప్రభుత్వం నుంచి పరిహారం పొందాడు. విషయం తెలుసుకున్న మాలమహానాడు నాయకులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం అతని నుంచి పరిహారం వసూలు చేయాలని తహశీల్దార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ ఘటన భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రంలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే..మండల కేంద్రానికి చెందిన వెన్నపురెడ్డి బాపురెడ్డికి ఎలాంటి భూమి లేదని ఆర్టీఐ చట్టం వెల్లడైంది. అయితే అతనికి భూ సేకరణ విభాగం అధికారులు పరిహారం చెల్లించారని మాల మహానాడు నాయకులు ఆరోపించడంతో పాటు, మహదేవపూర్ తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో బాపురెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కింద భూమి కోసం చెల్లించిన రూ.4.37లక్షలను రికవరీ చేయాలని తహశీల్దార్ ఆదేశించారు. దీనిపై స్పందించిన మాలమహానాడు నాయకులు రెవెన్యూ రికార్డుల్లో లేని వ్యక్తికి పరిహారం ఇవ్వడం తగదని మేరుగు లక్ష్మణ్, శేఖర్, లింగాల రామయ్యలు తెలిపారు.

Next Story

Most Viewed