చెప్పుల సెలక్షన్స్‌లో జాగ్రత్తలు తప్పనిసరి.. లేదంటే.?

by  |
చెప్పుల సెలక్షన్స్‌లో జాగ్రత్తలు తప్పనిసరి.. లేదంటే.?
X

చాలామంది కాళ్లకు చెప్పులు లేకుండా అడుగుతీసి అడుగు బయట పెట్టలేరు. ఎక్కడికి వెళ్లాలన్నా చెప్పులు లేదా షూస్ తప్పనిసరి. మన నిత్య జీవితంలో అంతగా భాగమయ్యాయి. ఆరు బయటే కాదు.. ఇంట్లో తిరిగే సమయంలో కూడా చెప్పులు వేసుకుని తిరుగుతుంటారు కొందరు. మన పాదాలకు రక్షణ మాత్రమే కాదు.. వాటిని స్టేటస్ సింబల్ గా కూడా చెప్పుకుంటారు కొందరు. చెప్పులే కదా అని తేలికగా తీసుకోవద్దు. సరైన సైజు సెలెక్ట్ ​చేసుకోవాలని, లేకుంటే దీర్ఘకాలిక సమస్యలు తప్పవంటున్నారు వైద్య నిపుణులు

దిశ, శేరిలింగంపల్లి: చిన్నాపెద్ద, ధనిక, పేద అనే తేడాలేకుండా అందరూ చెప్పులు లేదా షూస్ వాడుతుంటారు. ఎవరి స్థోమతను బట్టి వారు కొనుగోలు చేస్తుంటారు. కానీ చాలామంది ఈ విషయంలో ప్రాథమిక సూత్రాలను పాటించడం లేదని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దుస్తుల విషయంలో ఖచ్చితత్వం పాటిస్తుంటారు కానీ, చెప్పులు, షూస్ విషయంలో పెద్దగా పట్టింపులేమీ ఉండవు. సైజ్ కాస్త అటుఇటూ అయినా లైట్ తీసుకుంటారు. దీంతో దీర్ఘకాలికంగా అనేక ఇబ్బందులు ఎదురవుతాయని చెబుతున్నారు డాక్టర్లు. వీటిని కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, సరైన సైజు సెలక్ట్ చేసుకోవాలని సలహా ఇస్తున్నారు.

సెలబ్రెటీల ప్రచారం..

పాదరక్షల అమ్మకాలకు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా చెప్పులు, షూస్ మోడల్స్ మారిపోతుంటాయి. ఫలానా కంపెనీ చెప్పులు, షూస్ కొనండి అంటూ సెలబ్రెటీలతో ప్రచారం నిర్వహిస్తారు. ప్రతీయేటా చెప్పుల కంపెనీలు రూ.వేల కోట్ల టర్నోవర్ చేస్తున్నాయి. చెప్పులు, షూస్ ఆయా బ్రాండ్​ను బట్టి రూ.వంద నుంచి రూ.వేలల్లో ధర పలుకుతున్నాయి. కార్పొరేట్ కంపెనీలు ఈ రంగంలో పెట్టుబడులు పెట్టి లాభాలు గడిస్తున్నాయి. అడిడాస్, నైకీ, పూమా, బాటా, మోచీ లాంటి పెద్దపెద్ద కంపెనీల బ్రాండ్స్ కు సెలబ్రెటీలు, స్పోర్ట్స్ పర్సన్స్ మోడల్స్ గా వ్యవహరిస్తున్నారు. సల్మాన్ ఖాన్, అజయ్ దేవ్ గన్, అక్షయ్ కుమార్ లాంటి బాలీవుడ్ స్టార్స్ కూడా ఫలా నా బ్రాండ్ చెప్పులు, షూస్ కొనాలంటూ టీవీల్లో ఊదరగొట్టేస్తున్నారు.

చెప్పులతో తిప్పలు..

మహిళలు ఎక్కువగా హై హీల్స్, లేదా లో హీల్స్ చెప్పులు వాడుతుంటారు. వీటితో హైట్ విషయంలో తేడాలు కనిపించినా కాలి మడిమల్లో ఇబ్బందులు తలెత్తుతాయని, వెన్నుపూస సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. కాలి సైజు కంటే చిన్నగా, బిగుతుగా ఉండేవి ధరిస్తే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. పాదాలకు పగుళ్లు వస్తాయి. కాళ్లకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు సైతం ఎదురవుతాయి. బిగుతైన బూట్లు వేసుకుంటే గోర్ల పెరుగుదల మందగిస్తుంది. గోటి చివర్లు వేళ్లలోనికి గుచ్చుకోవడంతో ఇన్ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. పెద్ద సైజు చెప్పులు, షూస్​వేసుకోవడంతో మడమల సమస్యలు ఎదురవుతాయి. అలాగే తరుచూ కాళ్లు బెణకడంతో పాటు నడకలో కూడా తేడా వచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

చెప్పుల సెలక్షన్ ఎలా..?

ఏ కంపెనీ బ్రాండ్ చెప్పులు, షూస్ సెలెక్ట్ చేసుకున్నా వాటిని కొనేముందు రెండు కాళ్లకూ వేసుకుని చూడాలి. చాలావరకు పాదరక్షలు కొనుగోలు చేసేటప్పుడు ఒక కాలికి మాత్రమే ట్రయల్‌ చేస్తుంటారు. చెప్పులను రెండు కాళ్లకు వేసుకుని కాస్త ముందు, వెనక్కి నడిచిన తర్వాత సౌకర్యవంతంగా అనిపిస్తేనే కొనుగోలు చేయాలి. బూట్లు కొనుగోలు చేసేటప్పుడు సాక్స్‌ ధరించి ట్రయల్‌ చేయాలి. బూట్లకు ముందు కనీసం అర అంగుళం ఖాళీగా ఉండేలా చూసుకోవాలి. పాదరక్షలు ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవడం తప్పనిసరి. లేకుంటే కొత్తకొత్త రోగాలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు స్కిన్ ఎక్స్ పర్ట్స్.

చెప్పులు లేకపోతే అదో హాయి..

చెప్పులు వేసుకోవడంతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నా యో, అవి వేసుకోకపోవడంతో కూడా అన్నే లాభాలు ఉన్నాయంటున్నారు పరిశోధకులు. ఇంట్లో ఉన్నప్పుడు చెప్పులు లేకుండా తిరగడంతో రక్తప్రసరణ బాగా జరుగుతుందని, నడక , శరీర భంగిమ కూడా కరెక్ట్‌ గా ఉంటుందని అంటున్నారు. అందుకే ఇంట్లో, ఆఫీసు లో, ఆరుబయట చెప్పుల్లేకుండా హాయిగా తిరగమంటున్నారు. దీనివల్ల రక్తప్రసరణ బాగా జరిగి మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

Next Story

Most Viewed