గృహమే కదా..స్వర్గసీమ!

by  |
గృహమే కదా..స్వర్గసీమ!
X

దిశ, వరంగల్: గృహమే కదా.. స్వర్గసీమ.. మహనీయమౌ ప్రేమ మహిమ.. వెలసిన గృహమే కదా.. స్వర్గసీమ అని పాట రాశారు ఓ కవి. నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) కట్టడికి విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో ఆ కవి రాసిన పాటల పంక్తులు అక్షరాల నిజమయ్యాయి. లాక్ డౌన్‌తో ప్రజలు ఎక్కడికక్కడే ఇళ్లకు పరిమితమయ్యారు. కేవలం అత్యవసర పనులకు మాత్రమే బయటకు వస్తున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మే 7 వరకు లాక్ డౌన్ పొడిగించింది. ఆ తర్వాత పరిస్థితులను బట్టి సడలింపు‌పై నిర్ణయాలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. దీంతో ప్రజలు మరి కొంతకాలం ఇంటికి పరిమితం కావాల్సిన అనివార్యత ఏర్పడింది. ఈ క్రమంలో జనం కుటుంబ సభ్యులతో ఇళ్లల్లో గడపడాన్ని ఆస్వాదిస్తూ ఆనందంగా గడుపుతున్నారు. ఇంతకాలం తాము కోల్పోయిన అనుబంధాలను గుర్తు చేసుకుంటూ రకరకాల పిండి వంటలు చేసుకుంటూ, పాత తరం ఆటలు ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారు.

అంచనాలు తారుమారు..

లాక్ డౌన్‌తో ప్రజల అంచనాలు ఈసారి తారుమారు అయ్యాయి. వేసవి కాలం వస్తుందంటే జనం పలు రకాల అంచనాలతో ఉండేవారు. విద్యా సంస్థలకు సెలవులు ఉండటం, ఇక్కడ ఎండల తీవ్రత కారణంగా చల్లటి ప్రదేశాలకు వెళ్లాలనుకునేవారు. పలు ట్రావెల్ ఏజెన్సీలు రాయితీలూ ప్రకటించేవి. కొందరైతే వేసవి కాలానికి ముందే విదేశాల్లోని ప్రాఖ్యత గాంచిన పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకునేవారు. మరికొందరు వారి ఇష్టమైన దేవుళ్లను దర్శించుకునే నిమిత్తం టికెట్లు రిజర్వ్ చేయించేవారు. కుటుంబ సభ్యులతో కలిసి ఇష్టమైన ప్రాంతాలకు వెళ్లి సంతోషంగా గడపాలని నిశ్చయించుకునేవారు. కాని ఈ సారి ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఎవరూ ఊహించని విధంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ప్రపంచ దేశాలను కుదిపేసింది. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడే రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి. దీంతో ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్లడమే కష్ట సాధ్యంగా మారింది. ఈ క్రమంలో జనం పక్క రాష్ట్రం, దేశం వెళ్లాలనే ఆలోచనే చేయడమే మూర్ఖత్వంగా భావిస్తున్నారు. అంతకు ముందు ప్రణాళికలు సిద్ధం చేసుకుని టికెట్లు రిజర్వ్ చేసుకున్న వారు రద్దు చేసుకున్నారు. మరో ఏడాది వరకు ఎలాంటి టూర్లకు వెళ్లొద్దని నిశ్చయించుకుని ఎంచక్కా ఇంటికే పరిమితమయ్యారు. అన్ని పనులు పక్కనబెట్టి ప్రజలు కుటుంబీకులతో గడపడం ఒక్కటే పనిగా పెట్టుకున్నారు.

రిలాక్స్ అవుతున్న జనం..

మెజార్టీ ప్రజలు ఉదయం లేచింది మొదలు టీవీలు, సెల్ ఫోన్లు, ట్యాబ్‌లతో కాలక్షేపం చేస్తున్నారు. ఇంకొందరు క్యారమ్స్, చెస్, చైనీస్ చెక్కర్, స్నేక్ అండ్ లాడర్, లూడో లాంటి ఆటలతో గడుపుతున్నారు. రోజువారీ కార్యక్రమాలు పూర్తయినంతరం ఇంటిల్లిపాది ఆటపాటలతో ఎంజాయ్ చేస్తున్నారు. లాక్ డౌన్ కు ముందు వారి వారి ఉద్యోగ బాధ్యతల్లో బిజీగా ఉండేవారు. కనీసం పిల్లలను వారానికి ఒకసారి బయటకు తీసుకెళ్లాలనంతా బిజీగా ఉన్న వారిని సైతం చూశాం. కానీ, ఇప్పుడు వీలు చిక్కినప్పటికీ బయటకు తీసుకెళ్లే పరిస్థితి లేదు. సినిమా థియేటర్లు, పార్క్‌లు మూతపడ్డాయి. ఏదైనా హోటల్, రెస్టారెంట్‌కు వెళ్లి కుటుంబ సభ్యులతో భోజనం చేసే అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటికే పరిమితమైన జనం గతంలో తాము కోల్పోయిన సంతోషాలను గుర్తు చేసుకుంటున్నారు. ఆ సంగతులన్నీ తమ సన్నిహితులు, మిత్రులతో పంచుకుంటున్నారు. భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితులు రాకుండా చూసుకోవాలని చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా కరోనా వైరస్ జనాలను ఇంటికి పరిమితం చేసిన కుటుంబ సభ్యుల మధ్య దూరమైన ప్రేమ, ఆప్యాయత, అనురాగాలను దగ్గర చేసింది.

Tags: covid 19 affect, lockdown, majority people, relaxing, at home, love, affection

Next Story

Most Viewed