ఉద్యోగులతో పాటు వారి కుటుంబానికి అండగా మహీంద్రా!

by  |
ఉద్యోగులతో పాటు వారి కుటుంబానికి అండగా మహీంద్రా!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ మరో దిగ్గజ వాహన తయారీ సంస్థ మహీంద్రా తమ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా సహాయాన్ని సోమవారం ప్రకటించింది. కరోనా మహమ్మారి కారణంగా కంపెనీలోని ఉద్యోగి మరణిస్తే రాబోయే ఐదేళ్ల వేతనాన్ని కుటుంబానికి అందజేయడంతో పాటు ఆ కుటుంబానికి సహాయం కింద పరిహారాన్ని చెల్లిస్తుందని తెలిపింది. మహీంద్రా గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ అనీష్ షా ఉద్యోగులకు రాసిన లేఖలో ఈ విషయాన్ని తెలిపారు.

అలాగే, కంపెనీ ఉద్యోగులెవరైనా కరోనాతో మరణిస్తే కుటుంబ సహాయ విధానం ద్వారా ఉద్యోగి పిల్లలకు ఏడాదికి రూ. 2 లక్షల వరకు 12వ తరగతి పూర్తయ్యేందుకు సహకరిస్తుందని కంపెనీ లేఖలో పేర్కొంది. ‘కంపెనీలో మొత్తం 25 వేల మంది వరకు ఉద్యోగులున్నారు. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో కరోనా ప్రభావానికి గురైన ఉద్యోగి కుటుంబ భారాన్ని పంచుకునేందుకు కంపెనీ సిద్ధంగా ఉంది. ఎవరైన కరోనాతో మరణిస్తే గనక వారి కుటుంబానికి కంపెనీ అండగా ఉంటుంది. అవసరమైన మేరకు పూర్తి మద్దతు కంపెనీ నుంచి లభిస్తుందని’ ఎంఅండ్ఎం తెలిపింది.

మరో వాహన తయారీ సంస్థ కరోనా నియంత్రణలో భాగంగా ఇప్పటివరకు 45 ఏళ్లు పైబడ్డ ఉద్యోగుల్లో 75 శాతం మందికి టీకాలు వేసినట్టు తెలిపింది. ఉద్యోగుల శారీరక, మానసిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని 24 గంటలూ పనిచేసే ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(ఈఆర్‌టీ)ని ఏర్పాటు చేసినట్టు కంపెనీ స్పష్టం చేసింది. ఎవరికైనా అవసరమైన సహాయం కావాల్సిన సమయంలో ఈఆర్‌టీ సభ్యులు అందుబాటులో ఉంటారని కంపెనీ వివరించింది. ఉద్యోగులు, వారి కుటుంబాల వారు డిజిటల్ విధానంలో కంపెనీ బోర్డులోని వైద్యులతో సంప్రదించవచ్చని, దీనికోసం టొల్ ఫ్రీ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసినట్టు కంపెనీ వెల్లడించింది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !Next Story

Most Viewed