పెళ్లికి ఒప్పుకోలేదని ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

by  |
Died-1
X

దిశ, శేరిలింగంపల్లి: ఓయో రూమ్ లో గదిని అద్దెకు తీసుకున్న ఓ ప్రేమజంటలో ప్రియురాలు మృతి చెందగా ప్రియుడు గాయాలతో బయటపడ్డాడు. చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఒంగోలుకు చెందిన నాగచైతన్య, గుంటూరు నివాసి కోటిరెడ్డి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అమ్మానాన్న లేని నాగచైతన్య ఇటీవల నగరానికి వచ్చి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్స్ గా పనిచేస్తుండగా, కోటిరెడ్డి గుంటూరులో సేల్స్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నాడు. వీరిద్దరి కులాలు వేరు కావడంతో వీరి పెళ్లికి పెద్దలు నిరాకరించారు. ఈ నేపథ్యంలో నగరానికి వచ్చిన కోటిరెడ్డి గచ్చిబౌలి డివిజన్ నలగండ్లలోని ఓయో రూమ్ లో గది అద్దెకు తీసుకున్నారు. ఆ తర్వాత గదిలో ప్రియురాలు నాగచైతన్యను కత్తితో హత్య చేసిన కోటిరెడ్డి అనంతరం ఒంగోలులో ప్రత్యక్షమయ్యాడు. ఒంటినిండా గాయాలతో ప్రస్తుతం ఒంగోలులోని కేజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని ఈ క్రమంలోనే కత్తితో పొడుచుకుని ఆత్మహత్యకు యత్నించామని కోటిరెడ్డి చెబుతుండగా, నాగచైతన్య మృతికి ఎవరు కారణమన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఆ రాత్రి ఏం జరిగింది అనేదానిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Next Story