పారిపోయిన ప్రేమ జంట.. తలలు పట్టుకుంటున్న పోలీసులు 

by  |
lovers
X

దిశ, ఏపీ బ్యూరో : ఆ ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. ఈ విషయాన్ని ప్రేమికులు తమ ఇంట్లోని పెద్దలకు తెలిపారు. అయితే ప్రేమ పెళ్లికి యువకుడు పేరెంట్స్ అంగీకరించినా ప్రేమికురాలి తల్లిదండ్రులు మాత్రం రిజెక్ట్ చేశారు. దీంతో ఆ యువతి యువకుడు ఇంట్లో నుంచి పారిపోయారు. ఇదేదో సినిమా కథలా ఉందని అనుకుంటే బొక్క బోర్లా పడినట్లే. ఇది రియల్‌గా జరిగిన ఓ సీన్. సినిమాల్లో యువతి తల్లిదండ్రులకు ప్రేమ జంట వరుస షాక్‌లు ఇస్తే.. ఈ రియల్ సీన్‌లో ప్రేమ జంట పోలీసులకు చుక్కలు చూపించారు. వివరాల్లోకి వెళ్తే… వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన నిఖిల్ రెడ్డి.. నెల్లూరు జిల్లా కోటకు చెందిన సాయి లక్ష్మిలు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కొన్నేళ్లుగా సాగుతున్న తమ ప్రేమను పెళ్లి బంధంతో ఒక్కటి చేయాలని భావించారు.

తమ ప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలపగా సాయిలక్ష్మి తల్లిదండ్రులు పెళ్లికి రెడ్ సిగ్నల్ వేశారు. కానీ నిఖిల్ రెడ్డి తల్లిదండ్రులు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతేకాదు ఈ ప్రేమ జంటను ఒక్కటి చేసేందుకు తమ వంతు సాయం కూడా చేశారనుకోండి. ఈ ప్రేమ జంట పెళ్లి చేసుకోవాలనుకున్న విషయం తెలుసుకున్న సాయిలక్ష్మి తల్లిదండ్రులు ఆమెను ఇంట్లో బంధించారు. అయితే నిఖిల్ రెడ్డి ఆదివారం తన ప్రియురాలిని ఇంట్లో నుంచి తీసుకు వెళ్లేందుకు స్కెచ్ వేశాడు. అందుకు నలుగురు స్నేహితులను రెడీ చేసుకున్నాడు. అలాగే కారు కూడా బుక్ చేశాడు. ఇక అమ్మాయిని తీసుకుని వెళ్లిపోయేందుకు అన్ని వనరులు సమకూర్చుకున్న నిఖిల్ ఇక సీన్‌లోకి ఎంటరయ్యాడు. ప్రియురాలు సాయిలక్ష్మికి హింట్ ఇచ్చాడు.

lovers

ఆ అమ్మాయి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. ఈ విషయం తెలుసుకున్న తండ్రి వారిని చేజ్ చేద్దామనుకుని ప్రయత్నించి విఫలమయ్యాడు. ఇక తమ వల్ల కాదనుకున్న తండ్రి కోట పోలీసులను ఆశ్రయించి తమ కుమార్తెను నలుగురు యువకులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతున్నారంటూ ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారి మెుబైల్‌ను ట్రేస్ చేశారు. అయితే వారు వెళ్తున్న కారు గూడూరు వద్ద ఉందని తెలియడంతో ఆగమేఘాల మీద పోలీసులు అక్కడకు వెళ్లారు. అయితే అప్పటికే ఈ ప్రేమ జంట వారి కళ్లుకప్పి కారులో నుంచి పరారైంది.

దీంతో చేసేది లేక పోలీసులు వారి స్నేహితులను పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. ప్రేమ జంట వివరాలపై ఆరా తీస్తున్నారు. మరోవైపు ప్రొద్దుటూరు పోలీసులు సైతం నిఖిల్ రెడ్డి కోసం గాలిస్తున్నారు. అయితే నిఖిల్ రెడ్డి ఫోన్, అతడి తల్లిదండ్రలు ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకోవడంతో పోలీసులు ఏం చేయాలో తోచక తలలు పట్టుకుంటున్నారు. ఒకవైపు ప్రొద్దుటూరు పోలీసులు.. మరోవైపు కోట పోలీసులు ప్రేమ జంట కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Next Story