షికారు వద్దు.. బేకార్‌గా రావొద్దు!

by  |
షికారు వద్దు.. బేకార్‌గా రావొద్దు!
X

దిశ, మహబూబ్‌నగర్: నోవెల్ కరోనా వైరస్(కొవిడ్ 19) రోజురోజుకూ మరింత ప్రబలుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ పెద్దలు, అధికారులు చెబుతున్నారు. ‘‘షికారు కోసం తిరగొద్దు.. బేకార్‌గా బయటికి రావొద్దు’’ అంటూ యువకులను పోలీసులు, అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇంతగా చెబుతున్నా జిల్లాలో కొంతమంది ఇవేవీ పట్టించుకోకుండా షికారుకు బయల్దేరుతున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్నవారి‌పై నిఘా పెంచారు. సిటిజన్ ట్రాకింగ్ యాప్, డ్రోన్ కెమెరాల సహాయంతో పోలీసు అధికారులు వాహనదారుల‌పై కొరడా ఝుళిపిస్తున్నారు. నెలరోజులుగా తీసుకున్న చర్యల గురించి పోలీసు శాఖ వారు వివరిస్తున్నారు.

1,372 మందిపై కేసులు..

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిబంధనలు ఉల్లంఘించిన సుమారు 1,372 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసి 6 వేలకు పైచిలుకు వాహనాలను జప్తు చేశారు. ట్రాఫిక్ పోలీసులు సుమారు 19 వేలకు పైచిలుకు వాహనాలపై కొరడా ఝుళిపించారు. రూ. కోటి 18 లక్షల జరిమానాలు విధించారు. అయితే, ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నా కొంత మందిలో మార్పు రాకపోవడం‌పై పోలీసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘‘చేతులెత్తి మొక్కినా’’ కొందరు బైక్‌లపై ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారని, వారిపై కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు అంటున్నారు. నిబంధనల ఉల్లం‘ఘనుల’కు మూల్యం భారీగా ఉంటుందనీ, ఇప్పటికైనా ప్రజలకు ఇళ్లకే పరిమితం కావాలని పోలీసులు సూచిస్తున్నారు. మరి పోలీసుల హెచ్చరికలను వాహనదారులు ఏ మేరకు పాటిస్తారో చూడాలి.

Tags: lockdown , violation, covid 19, corona virus, bike, police dept

Next Story

Most Viewed