మూడు కిలోమీటర్లు దాటితే అరెస్టు

by  |
మూడు కిలోమీటర్లు దాటితే అరెస్టు
X

– ఏఎన్పీఆర్‌ టెక్నాలజీతో గుర్తింపు

– కరోనా నివారణకు కట్టుదిట్ట చర్యలు

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా నివారణకు ప్రభుత్వం విధిస్తున్న నిబంధనలను కొందరు పాటించడం లేదు. అత్యవసరాల కోసం వెళ్లేవారిని మినహాయించడంతో అవే కారణాలు చెబుతూ ఇష్టారీతిగా తిరుగుతున్న వారికి ఇక కళ్లెం పడనుంది. ఇంటి నుంచి మూడు కిలోమీటర్ల పరిధి దాటితే వెంటనే గుర్తించి కేసు నమోదు చేయనున్నారు. ఇందుకోసం ఆటోమెటిక్‌ నంబర్‌ ప్లేట్‌ రికగ్నైజేషన్‌ (ఏఎన్‌పీఆర్‌) విధానాన్ని ఉపయోగిస్తున్నారు. గల్ఫ్‌ తరహాలోనే ఈ టెక్నాలజీని రాష్ట్రవ్యాప్తంగా వినియోగించనున్నారు. ఇప్పటికే అన్ని కూడళ్లు, ప్రధాన మార్గాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటికి నూతన టెక్నాలజీని అనుసంధానం చేస్తున్నారు. ఆటోమేటిక్‌ నంబర్‌ ప్లేట్‌ రికగ్నిషన్‌ (ఏఎన్పీఆర్‌) సాంకేతికతతో రోడ్లపైకి వచ్చిన వాహనం నంబరు గుర్తిస్తున్నారు. ఈ సాంకేతికత ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్ (ఏఐ) ఆధారంగా పనిచేసే ఈ టెక్నాలజీ ద్వారా ఎలాంటి కారు నంబరునైనా, వాహనం ఎంత వేగంలో ఉన్నా సరే ఇది సులభంగా గుర్తిస్తుంది. వాహన యజమాని వివరాలు ప్రత్యక్షమవుతాయి.

కేసుల్లో ఇరుక్కోవద్దు:

లాక్‌డౌన్ నిబంధనల ప్రకారం ప్రతీ వాహనం రెండు కి.మీ.లోపే పరిమి తం కావాలి. అయితే తెలిసినా కూడా పలువురు ఇష్టారీతిగా ప్రయాణిస్తున్నారు. ఈ కెమెరాతో నంబరును గుర్తించి, వాహనదారుడి చిరునామాకు, అతను వాహనం కెమెరాకు చిక్కిన ప్రాంతానికి మధ్య దూరం చూసి కేసు నమోదు చేస్తారు. అన్ని జిల్లాల్లో ప్రతీ కెమెరాకు ఈ సాఫ్ట్‌వేర్‌ను అనుసంధానించారు. దీంతో సదరు వాహనం యజమానిపై ఐపీసీ 188, 269, 270, 271 సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు. గరిష్టంగా రెండేళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని హెచ్చరిస్తున్నారు. అకారణంగా ఇళ్ల నుంచి బయటకు వచ్చి కేసుల్లో ఇరుక్కోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. అయితే ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి విషయంలో పోలీసులు ఎలా చర్యలు తీసుకుంటారో స్ఫష్టత రావాల్సి ఉంది.

Tags : fine, vehicle, corona

Next Story