సింఘు, టిక్రిలలో ‘లోకల్’ హైడ్రామా

by  |
సింఘు, టిక్రిలలో ‘లోకల్’ హైడ్రామా
X

న్యూఢిల్లీ: రైతులు ఆందోళన చేస్తున్న సింఘు, టిక్రి సరిహద్దు ప్రాంతాల్లో ‘లోకల్’ ఘర్షణలు మరింత తీవ్రమయ్యాయి. ‘స్థానికులు’ అని చెప్పుకుంటున్న కొందరు సింఘులోని రైతు నిరసన వేదిక సమీపానికి వెళ్లారు. రైతులతో ఘర్షణలకు దిగారు. ఈ ఘర్షణలు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పరిస్థితులను అదుపులోకి తేవడానికి లాఠీచార్జ్ చేశారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘర్షణల్లో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు.

ఓ ఆందోళనకారుడు తల్వార్‌తో ఢిల్లీ పోలీసు ఎస్‌హెచ్‌వో ప్రదీప్ పలివాల్‌పై దాడి చేశారు. గతరెండు నెలలుగా రైతులు రోడ్లను దిగ్బంధించి చేస్తున్న ఆందోళనలతో తమ పనులకు ఆటంకం వాటిల్లుతోందని, వారు వెంటనే అక్కడి నుంచి తరలివెళ్లిపోవాలని డిమాండ్ చేస్తూ కొందరు గురువారం నిరసనలు చేశారు. శుక్రవారం సింఘు నిరసన ప్రాంతానికి సుమారు 150 మంది వెళ్లి ఘర్షణలకు దిగారు. ఆందోళనల కారణంగా పోలీసుల పహారాతో సాధారణంగా ఈ ప్రాంతానికి వెళ్లడం కష్టసాధ్యం. కానీ, ఈ ‘స్థానికులు’ వాహనాలతోనూ అక్కడికి చేరడం గమనార్హం. ఇదే రీతిలో టిక్రి ప్రాంతంలోనూ రైతులతో స్థానికులు ఘర్షణలకు దిగారు. కొంతసేపటికి పోలీసులు, వాలంటీర్ల సహాయంతో ఇరువురిని వేరుగా చేసి నిరసనలు కొనసాగించే వీలు కల్పించారు.

‘స్థానిక’ సమస్య కారణంగా రైతులు వెంటనే ఆందోళన స్థలాలను ఖాళీ చేయాలని యూపీ ప్రభుత్వం, హర్యానా ప్రభుత్వం అల్టిమేటం విధించాయి. కానీ, రైతులు వెనుకడుగువేయలేదు. ‘అవసరమైతే చావనైనా చస్తాం కానీ వెనుదిరగబోం’ అని రైతులు స్పష్టం చేశారు. రైతులు అధైర్యపడవద్దని, శాంతియుతంగా నిరసన కొనసాగించాలని కిసాన్ సంయుక్త మోర్చా పిలుపుతో ఆందోళన కొనసాగుతున్నది. అంతేకాదు, యూపీ, హర్యానాల నుంచి పెద్దమొత్తంలో రైతులు ఢిల్లీ సరిహద్దుకు బయల్దేరారు. రాకేశ్ తికాయత్ పిలుపుతో వేలాది మంది రైతులు యూపీ నుంచి ఢిల్లీకి కదిలారు. రాకేశ్ తికాయత్‌కు మద్దతుగా యూపీలో జరిగిన కిసాన్ మహాపంచాయత్‌కు వేలాదిగా తరలివచ్చారు. కిసాన్ నేత తికాయత్‌కు మద్దతుపలికారు.

మహాత్ముడి జయంతి సందర్భంగా సద్భావన దివస్

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా శనివారం సద్భావన దివస్ పేరిట ఉపవాసం పాటించాలని కిసాన్ ఏక్తా మోర్చా రైతులకు పిలుపునిచ్చింది. తమ నాయకులు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉపవాసాన్ని పాటిస్తారని రైతు నేత అమర్జీత్ సింగ్ రాధా తెలిపారు. దేశవ్యాప్తంగా రైతులందరూ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అలాగే, ఇంటర్నెట్ సేవలను వెంటనే పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed