కర్ణాటక ఫలితం చెప్పే గుణపాఠం!

by Ravi |
కర్ణాటక ఫలితం చెప్పే గుణపాఠం!
X

క రాష్ట్రంలోని సామాజిక పరిస్థితి, రాజకీయ వాతావరణం అచ్చుగుద్దినట్టు మరో రాష్ట్రంలో ఉండదు. అందుకే, ఒకచోట‌ ఎన్నికల ఫలితాలు అద్దంలో ప్రతిబింబంలా మరో రాష్ట్రంలో ఎందుకుంటాయి? ఉండవు. కర్ణాటకలో నిన్న వచ్చిన ఎన్నికల ఫలితాల ప్రభావం ఇరుగుపొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల పైన ఉంటుందా అంటే, ఉంటుందనీ చెప్పొచ్చు కొంత మేర, ఉండదనీ చెప్పొచ్చు ఇంకో రకంగా! నేర్చుకోడానికి పాఠాలు, విర్రవీగే వారికి గుణపాఠాలు మాత్రం ఉంటాయి. గెలిచిన పార్టీకి ఇతర చోట్ల కొంత నైతిక స్థయిర్యం, చేరికలు, నిధుల సహాయం అందొచ్చు!

కర్ణాటకలో పోటీ పడ్డది రెండు జాతీయ ప్రధాన స్రవంతి పార్టీలు. పాలక బీజేపీని గద్దె దించి, విపక్ష కాంగ్రెస్‌ ఇక్కడ పీఠమెక్కుతోంది. కానీ, రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలైన వైసీపీ, బీఆర్‌ఎస్‌లను పై రెండు పార్టీలు ఎదుర్కొంటున్నాయి. ఏపీలో ఈ రెండు పార్టీల ప్రస్తుత ఉనికి నామమాత్రమే! ఇక తెలంగాణలో పాలక బీఆర్‌ఎస్‌కి నేనంటే, నేనే ప్రత్యామ్నాయమని కాంగ్రెస్‌, బీజేపీలు పోటీపడుతున్నాయి. అధికారం నిలబెట్టుకోవాలనుకునే, ఎలాగైనా అధికారంలోకి రావాలనుకునే పార్టీలకు మాత్రం ఖచ్చితమైన పాఠాలు, గుణపాఠాలు కర్ణాటక రాజకీయ పరిణామాల్లో, ఎన్నికల ఫలితాల్లో ఉన్నాయి, గ్రహిస్తే!

కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీది ఏ కోణంలో చూసినా గొప్ప విజయం. ఇటీవలి కాలంలో అటువంటి విజయం కాంగ్రెస్‌ పార్టీకి అరుదైందే! పోల్‌ సర్వేల సరళిలోనే తుది ఫలితాలు ఉన్నా... అంచనాలకు మించిన గెలుపు వారి ఖాతాలో జమయింది. బీజేపీకి ఓ రకంగా ఇది పెద్ద దెబ్బ! ఈ యేడు చివరి పాదంలో రాజస్తాన్‌, ఛత్తీస్‌ఘడ్‌, మధ్యప్రదేశ్‌, మిజోరాం కొంత ఎడంతో తెలంగాణ, అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలున్నాయి. ఆపై ఆరేడు మాసాల్లో జరగాల్సిన 2024 సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా... తాజా రాజకీయ పరిణామం, దేశ రాజకీయాల్లో పునరేకీకరణల దిశలో వీచిన ఓ కొత్తగాలి.

సంబరాలు సహజమే... కానీ

కర్ణాటక గెలుపుతో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తల శ్రేణులు దేశమంతా సంతోషించారు. ముఖ్యంగా పొరుగునే ఉన్న తెలంగాణ, ఏపీల్లో కాంగ్రెస్‌ సంబరాలే జరుపుకుంది. దక్షిణాది రాష్ట్రాలు కావడం, కర్ణాటకతో సరిహద్దులుండటం ఇందుకో కారణం. కర్ణాటక ఫలితం చూసి, సంతోషించడానికైనా, బాధపడటానికైనా కాంగ్రెస్‌, బీజేపీలకు ఏపీలో ఉన్నదేంది, పోయేదేంది ‘నోటా’ (పై అభ్యర్థులెవరికీ ఓటేయను) కన్నా మెరుగైన ఓట్లకోసం కాంగ్రెస్‌, తమకొచ్చే ఓట్లు నోటా కన్నా తగ్గకుండా బీజేపీ చూసుకోవాలి. ఇక ఉన్నదల్లా తెలంగాణలోనే! కర్ణాటకలో లాగే ఇక్కడా కాంగ్రెస్‌కి రాష్ట్రవ్యాప్త వ్యవస్థ, కార్యకర్తలు, సానుభూతిపరులున్నారు. అంత స్థిరం కాకపోయినా... ఊగిసలాడే ఓటు బ్యాంకులున్నాయి. నాయకుల నడుమ పీతల పంచాయితీ ఇక్కడ అదనం! అదే వారి కొంప ముంచుతోంది. పేదల పక్షపాతిగా అయిదేళ్ల పాలనానుభవం కలిగిన ఓ సిద్దిరామయ్యో, కష్టకాలంలో పార్టీని మోసిన దూకుడు నేత డీకే శివకుమారో కర్ణాటకలో ఉన్నారు. వారి మధ్య ఎన్నికల ముందైనా ఓ సయోధ్య కుదిరింది. వ్యతిరేకతను కడుపులో దాచుకొని ఐక్యత చాటారు. కన్నడిగులు బీజేపీ ప్రభుత్వాన్ని వద్దనుకున్నపుడు, ఓ బలమైన ప్రత్యామ్నాయం వారికి కాంగ్రెస్‌ రూపంలో కనిపించింది. కాంగ్రెస్‌ (ఐదు) నిర్దిష్ట హామీలు కూడా ప్రజల్లోకి వెళ్లాయి. ప్రభుత్వ వైఫల్యాలను, ముఖ్యంగా అవినీతిని బలంగా జనంలోకి తీసుకువెళ్లటం పార్టీకి సాధ్యపడింది. స్థానికాంశాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం లాభించింది. రాష్ట్రమంతా ఏకరీతి ఫలితాల్ని బట్టి బీజేపీ లేవనెత్తిన కుల సమీకరణ, ప్రాంతీయ, మతవాద, జాతీయ అంశాలు ఓటరు నిర్ణయాన్ని ప్రభావితం చేయలేకపోయాయని స్పష్టమైంది. ఇది టీపీసీసీ గ్రహించాల్సిన పాఠం. ఇక్కడ ఓ సిద్దిరామయ్యో, ఓ డీకే. శివకుమారో లేరు. పోలికలో డీకేకి, టీపీసీసీ నేత రేవంత్‌రెడ్డికి కొంత సారూప్యత ఉన్నా.... ‘సీనియర్ల’తో ఆయనకు సయోధ్య లేదు. కాంగ్రెస్‌లోకి వచ్చి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అయి, ఓ ఎన్నిక గెలిచి, చివరకు టీపీసీసీ అధ్యక్షుడైనా... పురిటి(టీడీపీ) కంపు పోలేదనే విమర్శలున్నాయి. జిల్లా దాటి పార్టీ శ్రేణుల్నో, ఓటర్లనో ప్రభావితం చేయగల ‘సీనియర్లు’ కూడా కాంగ్రెస్‌లో లేరు. ఇంకా చెప్పాలంటే, అత్యధికులు నియోజకవర్గానికో, ఒకటి, రెండు అదనపు నియోజకవర్గాలకో పరిమితమైన నాయకులే! ఐక్యత, నిబద్దత, ప్రజా ఉద్యమాలతో పాటు కన్నడ కాంగ్రెస్‌ నుంచి టీపీసీసీ నేర్చుకోవాల్సింది చాలానే ఉంది.

తొలుత భ్రమలు తొలగితేనే....

తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా నిలవటానికి, మొదట భ్రమలు తొలగాలన్నదే బీజేపీకి కన్నడ ఫలితం చెప్పే పాఠం. ఒకటి కాలేనప్పుడు, రెండైనా, ఇరవై రెండైనా ఒక్కలానే ఉండే రాజకీయాల్లో ‘మేమే నెంబర్‌ టూ’ అనే భ్రమ నుంచి నాయకత్వం బయటపడాలి. ప్రధాని మోదీ, ముఖ్యనేత అమిత్‌ షా, పార్టీ అధినేత నడ్డాలు పదే పదే వచ్చి, రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తెస్తారనుకోవడం మరో భ్రమ! కర్ణాటకలో వారిద్దరు 47 నియోజకవర్గాల ప్రచారంలో పాల్గొంటే, అందులో గెలిచింది 15 మాత్రమే! ప్రజలెదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలు, తాము అధికారంలోకి వస్తే ‘ఏం చేస్తాం’ అన్న కోణంలో ప్రజలకు భరోసా... ఇలా స్థానికాంశాలకే ప్రాధాన్యత ఇవ్వాలన్నది పార్టీ ఇకనైనా గుర్తించాలి. రైతాంగ సాయుధ పోరాటం, నక్సలైట్‌ ఉద్యమం, లౌకికజీవన సరళి నేపథ్యంగా ఉన్న తెలంగాణలో.... తాము ఎంత పైకి ఎత్తినా... హిందుత్వ ఎజెండా, ముస్లీం బూచి, జాతీయాంశాలు స్థానిక ఓటర్లను పెద్దగా ప్రభావితం చేయలేవనీ, కన్నడ చేదు అనుభవంతోనైనా బీజేపీ గ్రహించాలి. సంస్థాగతంగా మెరుగుపడేందుకు నిర్మాణాత్మక కృషి, ఐక్యతా యత్నాలు చేయాలి.

కాంగ్రెస్‌ గురించి మీడియా చాలా రాస్తుందే కానీ, అంతర్గత పోరు తెలంగాణ బీజేపీలో తక్కువేం కాదు. ఎన్నికైన నాటి నుంచి నలుగురు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేలు కలిసి మీడియాతో ముచ్చటించింది, ప్రజలకు నమ్మకం కలిగించింది చాలా అరుదు. అసెంబ్లీ నుంచి జిల్లాస్థాయి కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ వరకు... పార్టీ ఫ్లోర్‌లీడర్‌ నియామకం కూడా దుర్లభమే! ఉప ఎన్నికల్లో గెలుపో, గట్టి పోటీనో... బయటి నుంచి వచ్చిన రఘునందన్‌రావు, ఈటల రాజేందర్‌, రాజ్‌గోపాల్‌రెడ్డిల వ్యక్తిగత బలమెంత, అది తీసేస్తే పార్టీ బలమెంత బీజేపీ నిజాయితీగా లెక్కవేసుకోవాలి. 2019 లో లభించిన 4 ఎంపీ స్థానాలు వాపా, బలుపా... ఇంకా నిర్ధారణ కాలేదు. ‘రేపు మా ఇంటిలో లడ్డూల భోజనం’ అని ఇంటిముందు చెరగని బోర్డు తగిలించినట్టు ‘చేరికలు’ ఒక తీరని ఆశ! ఇప్పుడిక పేరాశే! అగ్రనాయకుల రాష్ట్ర సందర్శనల్లో తరచూ మాట్లాడే ‘బూత్‌ కమిటీలు’ ఎంత ఆలస్యమైనా...పోలింగ్‌కు ముందే జరగాలని మరచిపోతున్నట్టున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సొంత రాష్ట్రం హిమాచల్‌ ప్రదేశ్‌, కీలకమైన పార్టీ సంస్థాగత ప్రధానకార్యదర్శి పీఎల్‌.సంతోష్‌ స్వరాష్ట్రం కర్ణాటక చేజారిపోయింది.... ఈ పరిస్థితుల్లో తెలంగాణలో అధికారం అంత తేలిక అనుకోవడం అతి పెద్ద భ్రమ అవుతుంది.

పరాకుగా ఉంటే, పాలకులకూ...

కాలం కలిసి రానప్పుడు తాడే పామై కరుస్తుందంటారు. సంక్షేమ పథకాలో, కుల సమీకరణాలో, సంస్థాగత బలమో, బలహీన ప్రతిపక్షాలో తమను గట్టెక్కిస్తాయని పాలకపక్షాలు నిశ్చింతగా నిదరోతే.... ఫలితం పగటి కలే అన్నది వారికి కన్నడ సారం! జనం హృదయాలను గెలవాలి, అక్కడ స్థిరంగా నిలవాలి తప్ప చౌకబారు ఎత్తుగడలు ప్రజాక్షేత్రంలో పనిచేయవని తెలుగునాట పాలకపక్షాలు పాఠంగా గ్రహించాలి. తెలంగాణలో, ఏపీలో పాలకపక్షాలు నాయకత్వ పరంగా, సంస్థాగతంగా బలపడి ఉన్న మాట నిజమే! గట్టి నాయకత్వం ఉంది. జనవాహినిలోకి చొచ్చుకుపోయిన సంక్షేమ పథకాలున్నాయి. కానీ, ప్రజాక్షేత్రంలో సమస్యలున్నాయి. వాటిని లెక్కచేయక ‘మాకు వ్యతిరేకంగా బలమైన రాజకీయ ప్రత్యామ్నాయమే లేదు’ అనుకోవడం పాలకపక్షాల భ్రమ! ప్రభుత్వాలు విఫలమైనపుడు... విపక్షాలు ఏ కొంచెం శ్రద్ధ పెట్టి, ఐక్యంగా ఉండి, నమ్మకం కలిగించినా..... ప్రత్యామ్నాయాలను ప్రజలే ఎంపిక చేసుకొని, ఎన్నుకుంటారన్నది కర్ణాటక ఫలితం చెప్పే గుణపాఠం!

బీజేపీది కూడా, దేశంలో కాంగ్రెస్‌ చతికిలపడిన చోట విస్తరిస్తూ బలపడుతోంది తప్ప ప్రాంతీయ శక్తులు బలంగా ఉన్న చోట అంతగా చొచ్చుకుపోలేని స్థితి! పార్టీలేవైనా.... సర్కార్లు తమను పట్టించుకుంటున్నాయా లేదా అన్నదే ప్రజల నిర్ణయాలకు ప్రాతిపాదిక. అవినీతి విషయంలోనూ జనాలది స్పష్టమైన పంథా! సాధారణ పరిస్థితుల్లో పెద్దగా అవినీతిని లెక్కపెట్టినట్టు కనబడదు. అందుకే, ‘అవినీతా ఎప్పుడు లేదు ఎవరు చేయలేదు దాన్ని జనం పట్టించుకోరు....’ వంటి మాటలు ప్రచారంలోకి వస్తాయి. కానీ, ప్రజలు తీవ్రమైన కష్టాల్లో ఉన్నపుడు, సమస్యలు చుట్టుముట్టినప్పుడు, సర్కార్లు తమను ఆదుకోనపుడు.... బలమైన స్వరంతో అవినీతిని ఎత్తిచూపితే, విశ్వసనీయమైన గొంతుతో అరిస్తే ఖచ్చితంగా ‘అవినీతి’ అంశాన్ని ప్రజలు తీవ్రంగా పరిగణిస్తారని పొరుగు రాష్ట్ర ఫలితం చెబుతోంది. తమ సమస్యలకు సర్కారు ‘అవినీతి’ని, ఆ విషయంలో వచ్చే ఆరోపణల్ని జనం అన్వయించి చూస్తారు. కాలం రాగానే కర్రు కాల్చి వాత పెడతారు. ఓటు రూపంలో మౌనంగా వ్యక్తమయ్యే జనం మనోగతాన్ని పార్టీలు గ్రహిస్తే ఒక ఫలితం, లేదంటే మరో ఫలితం, అనుభవంలోకి రావడం ఖాయం!!

దిలీప్‌రెడ్డి

పొలిటికల్‌ అనలిస్ట్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌సంస్థ,

[email protected].

99490 99802

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672

Next Story

Most Viewed