గోవా సాహిత్య అకాడమీలో వారాల ఆనంద్ ‘సొంతఊరు’ ఆవిష్కరణ

by Disha Web Desk 2 |
గోవా సాహిత్య అకాడమీలో వారాల ఆనంద్ ‘సొంతఊరు’ ఆవిష్కరణ
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ తెలుగు కవి, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత వారాల ఆనంద్ రచించిన ‘సొంత ఊరు’ పుస్తకాన్ని కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ ఆదివారం గోవాలో ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి సాహిత్య అకాడమీ ఉపాధ్యక్షురాలు ఆచార్య కుముద్ శర్మ అధ్యక్షత వహించారు. మనిషి లోపల, అక్షరాల చెలిమె తర్వాత వెలువడుతున్న స్వీయ కవితాసంకలనం 'సొంతఊరు' అని అకాడమీ కార్యదర్శి డాక్టర్ కే.శ్రీనివాసరావు అన్నారు. పుస్తక ఆవిష్కరణ అనంతరం మాధవ్ కౌశిక్ మాట్లాడుతూ.. వారాల ఆనంద్ ఒక చేత పెన్ను.. మరో చేత కెమెరా పట్టుకున్న సృజన శీలి అన్నారు. ఉత్తమ సాహిత్యం, సమాంతర సినిమాల పైన ఆయన రాసిన పుస్తకాల వివరాలు చూస్తే చాలా సంతోషం కలిగిందన్నారు.


ఆనంద్ ఎంతో అభినందనీయమయిన కృషి చేశారన్నారు. కుముద్ శర్మ మాట్లాడుతూ.. వారాల ఆనంద్ జీవితం స్ఫూర్తి దాయకమైందని కొనియాడారు. ఆ తర్వాత రచయిత వారాల ఆనంద్ మాట్లాడుతూ.. 2018 నుండి 2020 వరకు తాను రాసిన కవితల్లోంచి ఎంపికచేసిన కవితా సంకలనం ఈ ‘సొంతఊరు’ అన్నారు. మాయమై పోతున్న ఊరు నేపథ్యంలో రాసిన కవిత్వమిది అన్నారు. దేశం నలుమూలల్నించి రచయితలు అనువాదకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు జరిగిన సమావేశంలో 24 భాషల అనువాదకులు తమ అనుభవాలను ప్రసంగంలో పంచుకున్నారు.


Next Story

Most Viewed