కవిమాట: సంచారి స్వప్నం!

by Disha edit |
కవిమాట: సంచారి స్వప్నం!
X

ఏ యుగంలోనో

ఒకానొక ఒంటరి సంచారి

దేశాలు పట్టుకొని పోయాడు

దేనినో వెతుక్కుంటూ

మరి దేన్నో అన్వేషించుకుంటూ

సూర్యుడితో పోటీ పడి

చందమామతో భేటీ వేశాడు

చుక్కల్ని లెక్కించి

పర్వతాలను అధిగమించి

నదుల్ని ఈది

సముద్రాలను స్పృశించి

వనాలలో నివసించాడు

మంచు లోయలను

ఎడారి భూములను

గడ్డి మైదానాలను

సతత హరిత అరణ్యాలను దాటేసి

భూమండలాన్ని చుట్టేసాడు

ఎప్పట్లాగే ఓ రాత్రి

ఒకానొక అనామక దేశంలో

ఆకాశం వంక అంతరిక్షంలోకి చూసి

తన దైవాన్ని తలుచుకుంటూ పడుకున్నాడు

ఈ సారి మాత్రం అతని అన్వేషణ ఫలించిందేమో

అతను వెదుకుతున్నది దొరికింది

కలలో దైవం ప్రత్యక్షమయింది

ఏం వరం కావాలని అడిగింది

దైవాన్ని తన సహచరిగా రమ్మని

అతను వేడుకున్నాడు..

దేవత తథాస్తు అంది..

నిద్ర భంగం అయింది.

మెలుకువ వచ్చింది.

దైవం కళ్ళ ముందు ఊహగా మెదిలి

లీలగా గుర్తుకు వచ్చింది

కానీ దేహం పరిధిలో

కరములకు అందలేదు

దిగంతాల దాకా చూసినా

కనుపాపకు చిక్కలేదు..

అప్పుడు అతను మళ్లీ పడుకున్నాడు

కనీసం కలలోనైనా తన దైవం

మళ్లీ ప్రత్యక్షమై

తనతో ఉంటుంది కదా...

ఆ రోజు నుండి ఆ దేశ దిమ్మరి

కళ్ళు తెరవలేదు

నిద్ర లేవలేదు..!


డా. మామిడి హరికృష్ణ

హైదరాబాద్

Next Story