కవిమాట:క'న్నీటి'చెలిమె

by Disha edit |
కవిమాట:కన్నీటిచెలిమె
X

బతుకమ్మ అంటే

బతుకును నేర్పిన ఉద్యమం

దొరల పెత్తనాన్ని

దునిమాడిన జానపదం

నీళ్లులేని తెలంగాణలో

క 'న్నీటి 'చెలిమె బతుకమ్మ

కాయ కష్టంలో

ఆత్మీయ చెలిమి బతుకమ్మ

పని పాటల జమిలి

బ్రతుకు పాటల బలిమి

చైతన్యపు కలిమి బతుకమ్మ

బతుకమ్మ అంటే

తనను తాను తవ్వి పోసుకున్న ఊట

తనకు తానై ఉవ్విళ్లూరిన పాట

ఒక తలపోత, ఒక వలపోత

విజయగాథల పూలపోత

పరిపరి విధాల

పరివ్యాప్తమైన పల్లె పాట

బ్రతుకు పోరును పరిచిన

సామూహిక జీవన బాట

చిమ్మని చీకట్లలో

పూల వెలుగు బతుకమ్మ

కమ్మని ఆటలలో

స్వేచ్ఛా పులుగు బతుకమ్మ

ప్రకృతి పులకింతలతో

పురివిప్పుకునే

విజయగాథల ఆస్తి

సంస్కృతికి తొలి కిస్తీ

ఆడపడుచుల దోస్తీ

ఉద్యమాల ఊపిరి

ఊయల పాటల ఝరి బతుకమ్మ

కోలాటాల సవ్వడిలో

సమైక్య సాధనా గీతిక

సమిష్టి భావనా పతాక

ప్రకృతి ఒడిలో పూదోట

వేల పాటల ఊట

ఆడపడుచుల సయ్యాట

కోటి గొంతుల బావుట బతుకమ్మ


డా. కటుకోఝ్వల రమేశ్

99490 83327



Next Story

Most Viewed