కవి మాట:డెబ్బై ఐదవ (75) మేకప్

by Disha edit |
కవి మాట:డెబ్బై ఐదవ (75) మేకప్
X

ఐదేళ్లకోమారు మారే

విటుల విడిదీ క్షేత్రం

ఈ దేశ రాజధాని

వచ్చినోడల్లా వాడికి నచ్చినట్టు

దే (శ) హ మంతా చెరచి చెరచి

పచ్చి పుండును చేసి

పండుగనాడు కొత్త గుడ్డ చుట్టిచ్చి

సానికింత సానుభూతి చూపినట్టు

దొంగ భక్తిని ఒలక బోస్తారు

తూరుపు రేఖలపై పడమటి మేఘం కమ్ముకుని

మా బతుకులన్ని మసకభారిపోతున్నపుడు

ఎల్ ఈ డి వెలుగుల ధగధగలనే

ఈ దేశపు వెలుగులని

భ్రమింపచేస్తారు మీరు

కడుపుకింత భుక్తి కూడా భారమైనపుడు

మా అవ్వయ్యకు దేశభక్తెట్లా యాదికొస్తది

నీ దేశభక్త పరీక్షా పత్రంలో మా బతుకులన్నీ

నీవే సమాధానమివ్వలేనీ

ఐచ్చికం కానీ నిత్య నూతన ప్రశ్నలే?

ఓటేశేటప్పుడే...

మా తలలు నింగికెగిరే జాతీయ జెండాలు

ఓటేశిన మాపటికే...

మా బతుకులు అవనతమై కనిపించని పతాకాలు

జెండా పండుగొత్తనే ఎగిరే జెండాళ్ళా

మళ్ళా ఎన్నికలొత్తనే మా తలలు పైకెగురుతై

అప్పటిదాకా మా తలలపై

ఉక్కు పాదాల అధికారమొకటి కవాతు చేస్తుంది

ప్రజాస్వామ్య ముసుగు తొడిగి

పాలించే తోడేల్లున్నంత కాలం

ఈ దేశ స్వాతంత్ర్య దినం

ఏ యేటి కాయేడు గాయాలను కప్పే

కొత్త మేకప్ మాత్రమే.

దిలీప్. వి

జిల్లా కార్యదర్శి

మానవ హక్కుల వేదిక

ఉమ్మడి వరంగల్ జిల్లా

8464030808



Next Story

Most Viewed