నేల మురిసి పోయే సంబురం

by Disha Web Desk |
నేల మురిసి పోయే సంబురం
X

లింగ.. ఓ..లింగా..అంటూ

గొల్ల బోయిల గొంతులన్నీ

ఒక్కటై మోగుతుంటే..

శెవుల్ల దమ్ములువడి

దిక్కులు ఉక్కిరిబిక్కిరి అయితయి

డిళ్ళెం బళ్ళెం మేళాలతో

అడుగులన్నీ అలుపెరగక ఆడుతుంటే.. దద్దరిల్లిన నేల మద్దెల దరువేస్తది

గూడేలకు గూడేలు

పూనకం పట్టి ఊగుతుంటే..

గుండెలన్నీ లింగని

గుట్టలై మురుస్తయి

గజ్జెలు లాగులు గండ దీపాలు

బేరీల మోతలు శివసత్తులాటలు

వీర గంధాలు

వీర గోల సరుపులు

జమ్డీక సప్పుళ్ళు

పోతురాజు కేకలతో

పచ్చి కుండ బోనాలు

పాపిట్లపెట్టుకుని

సల్లని సూపుల సౌడమ్మ దేవిలా

ఆ గొల్ల తల్లులు కదులుతుంటే

తొవ్వలన్నీ తీరొక్క రంగుల

తిర్నాలలైతయి

మంద సల్లగుంటే మంద గంపలు

కడుపుల నలుసయితే

తొట్టెల మొక్కులు

తడి బట్ట తానాలు

పొర్లుదండాలు

బండారి పట్నాలు

మైసాచ్చి దూపాలు

కోర్కెలు తీర్చే దేవునిపై

కొండంత నమ్మిక

ఏడు ఇడిసి ఏడొచ్చే

దండి అయిన పండుగకు

కొమ్ములు తిరిగిన జెంటేటపోతులు

జల్తిచ్చి కదులుతుంటే..

ఇంటికో బండి అయి

సాగే బాటలు

భక్తి పూలతోటలైతయి

గొల్లగట్టు జాతర..

జాతర మాత్రమే కాదు

తరాలు మన చేతులకందించిన

ఆచారాల కత్తులు కటార్లు

గుండెల నిండా నిండి ఉన్న

నమ్మకాల గుర్తులు

జీవితంతో ముడిబడ్డ

ముల్లె గట్టిన ఆస్తులు

పెద్ద గట్టు జాతరంటే

దుఃఖపు గీతలపై

అలుక్కునే ఆనందాల

అలుకు పిడుస

నింగి పొంగి పోయే

ఓ అద్భుతమైన వేడుక

భూమి మురిసిపోయే

ఓ అపురూప సంబురం


- తుల శ్రీనివాస్

9948525853

నకిరేకల్, నల్లగొండ జిల్లా


Next Story

Most Viewed