కవిత: దిష్టిబొమ్మ విలాపం

by Disha edit |
కవిత: దిష్టిబొమ్మ విలాపం
X

అరే, మీరు ఎందుకు కొట్లాడుకుంటరు

చౌరస్తాలోనో గాంధీ విగ్రహం దగ్గరో

అంబేద్కర్ ప్రతిమ సమీపంలోనూ

సరాసరి బరాబరి సామీప్యం లేని

సమిష్టి నిరసనకు పరాకాష్ట దిష్టిబొమ్మను నేను

నాకేం మంటల్లో

మలమల మాడడం ఇష్టమా

ఏమి చేయ్యాలె

నా చేతులు ఏముంది

ఎవడో ఇంత ఎండు గడ్డి తెస్తాడు

మరొకడు ప్యాంటు అంగి నాకు తొడుగుతాడు

నా ముఖం మీద

ఇంకొకరు పేరు ఒక పేరు రాస్తారు

ఒకరు డౌన్ డౌన్ అంటే

మరొకడు జిందాబాద్ అంటాడు

ఏదే ఏమైతేనేమ్

నాలుగు బజార్ల కాడ

నా బతుకు ఆగం అయిపోతుంది

అటు పోలీసు ఇటు జనం

కలుస్తాను అని ఒకడు

కాలిస్తే తోలు ఒలుస్తాను

వాడు అటు గుంజి

వీడు ఇటు గుంజి

గ్యాస్ నూనె సీసా అగ్గిపెట్టె

నడిమిల విలవిలా నేను

విడవమంటే పాముకు కోపం

కరవమంటే కప్పకు శాపం

రాజ్యానికి మాలీష్

పాలిష్ పోలీసులు ఒక దిక్కు

నినాదాలు నిరసనలు ప్రజలు మరోవైపు

దిష్టి బొమ్మను నేను దిష్టిబొమ్మను

జీవమున్న ప్రాణిని కాదు

కాలితే వరి మంటలా

కోపం సట్టన చల్లారుతుంది

దహనానికి సిద్ధం నిషిద్ధం

అడగకుంటే అమ్మ అయినా

అన్నం పెట్టదు ఆకలి తీరదు

ప్రశ్నించండి ప్రశ్నించండి

కుర్చీ సీటుపై కిటికీ లోంచి దస్తీ వేసి

మిస్ అయిన బస్సును ఆపడం

వస్తాడో రాడో ప్రయాణికుడు

పంటను కాపాడే భ్రమలాంటి

దిష్టిబొమ్మను నేను దిష్టిబొమ్మను

జూకంటి జగన్నాథం

94410 78095



Next Story

Most Viewed