కథా-సంవేదన: తల కన్పించని మనిషి

by Ravi |
కథా-సంవేదన: తల కన్పించని మనిషి
X

ద్దకంగా నిద్ర లేచాడు నారాయణమూర్తి. ఆ రోజు నుంచి ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు. మెల్లగా లేచి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర వున్న అద్దం వైపు చూశాడు. అతని మొహం కన్పించలేదు. మిగతా శరీరం అంతా కన్పించింది. ముందు ఆశ్చర్యం వేసింది. ఆ తరువాత భయం వేసింది.

వెంటనే వంట గదిలోకి వచ్చాడు. అక్కడ అతని భార్య కన్పించింది. అతన్ని చూడగానే 'కాఫీ తాగుతారా?' అని అడిగింది. అంటే ఆమెకు తన మొహం కన్పిస్తుంది. మరి తనకు ఎందుకు కన్పించలేదు. అక్కడి నుంచి బాత్ రూం లోకి వచ్చాడు. వాష్‌బేసిన్ దగ్గర వున్న అద్దంలోకి చూశాడు. అక్కడా అదే పరిస్థితి. ముఖం తప్ప అన్నీ కన్పించాయి.

*

మళ్లీ వంటగదిలోకి వచ్చాడు. కాఫీ తాగుతారా? అని అడిగితే జవాబు చెప్పకుండా వెళ్లి వచ్చిన భర్త వైపు చూసింది అతని భార్య. 'నా ముఖం కన్పిస్తుందా?' భార్యని అడిగాడు నారాయణమూర్తి. ఆ ప్రశ్నకి ఆమె ఆశ్చర్యపోయింది. అదేం ప్రశ్న అంది అతని వైపు చూస్తూ. నిన్నటి నుంచి తన భర్త ఏదో పోగొట్టుకున్నవాడిలా వుండటం ఆమె గమనిస్తూనే ఉంది. జవాబు చెప్పకుండా అక్కడి నుంచి కదిలి ఆఫీసు రూంలోకి వచ్చాడు.

అతని మనస్సు మనస్సులా లేదు. తన ప్రశ్న విని తన భార్య అదేం ప్రశ్న అని ప్రశ్నించింది. అంటే ఆమెకు తన ముఖం కన్పిస్తుందన్నమాట. మరి తన ముఖం తనకి ఎందుకు కన్పించడం లేదు. ఏమీ అర్థం కాలేదు అతనికి. నిన్న కన్పించిన ముఖం ఈ రోజు కన్పించకపోవడానికి కారణం ఏమిటి? నిజంగా తన ముఖం తనకి కన్పించడం లేదా? భ్రమపడుతున్నాడా? ఎంత ఆలోచించినా అర్థం కాలేదు.

*

నారాయణమూర్తి ఆఫీసులోకి రాగానే పర్సనల్ సెక్రటరీ లేచి నిల్చొని వినయంగా నమస్కారం చేశాడు. తన ముఖం అతనికి కన్పిస్తుందా? కన్పించకపోతే అంత వినయంగా ఎలా నమస్కారం చేస్తాడు? మరి తన ముఖం తనకి ఎందుకు కన్పించడం లేదు? తల గోడకేసి కొట్టుకుందామని అన్పించింది. తన తలే తనకు కన్పించకపోతే గోడకేసి ఎలా కొట్టుకుంటాడు? అనుకున్నాడు.

తన భార్యకి కన్పించిన తన తల తన పీఎస్‌కి కన్పించిందా? తన ఆకారాన్ని చూసి లేచి నమస్కరించాడా? అతనికి అర్థం కాలేదు. సందేహ నివృత్తి చేసుకుందామని నారాయణమూర్తి అనుకున్నాడు. పీఎస్ ఏమైనా అనుకోనీ, అతన్ని తన భార్యని అడిగినట్టు అడగాలని నిర్ణయించుకున్నాడు.

*

'నా ముఖం కన్పిస్తుందా?' పీఎస్‌ను చూస్తూ అడిగాడు. అతడికి ఏమీ అర్థం కాలేదు. ఏం జవాబు చెప్పాలో తోచలేదు. తాను సరిగ్గా వినలేదని అనుకొని మౌనంగా ఉండిపోయాడు. తన ప్రశ్నకి పీఎస్ జవాబు చెప్పకపోయే సరికి నారాయణమూర్తికి కోపం ముంచుకొచ్చింది. ఒక్క రోజుకే వీడిలో ఇంత మార్పా? అనుకున్నాడు.

'నా ముఖం కన్పిస్తుందా?' ఈసారి గట్టిగా కోపంగా అడిగాడు నారాయణమూర్తి. పీఎస్ ఉలిక్కిపడ్డాడు. 'కన్పిస్తుందయ్యా! కన్పిస్తుంది' అన్నాడు వెంటనే. నారాయణమూర్తికి ఏమీ పాలుపోలేదు. బెల్ కొట్టాడు. అటెండర్ వచ్చి చేతులు కట్టుకుని నిల్చున్నాడు. రెండు చేతులు జోడించి దండం కూడా పెట్టాడు. అతనికి కూడా తన ముఖం కన్పించినట్లుంది. ఆ ప్రశ్న అతన్ని అడుగాలనిపించలేదు.

*

నారాయణమూర్తి ఆలోచనలో పడ్డాడు. అందరికీ కన్పిస్తున్న తన ముఖం తనకి ఎందుకు కన్పించడం లేదో అతనికి ఎంతకూ అర్థం కాలేదు. ఏం చేయాలో అతనికి పాలుపోలేదు. ఆదుర్దాగా బెడ్ రూంలోకి వచ్చాడు. బెడ్ రూం తలుపు పెట్టేశాడు. మొబైల్ ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. చెన్నయిలో వున్న తన స్నేహితుడు వీరేందర్‌కి ఫోన్ చేశాడు.

వీరేందర్ సైకాలజీ ప్రొఫెసర్. నారాయణమూర్తికి సన్నిహిత మిత్రుడు. వీరేందర్ లైన్ లోకి వచ్చాడు. విషయం అంతా చెప్పాడు వీరేందర్‌కి. ఏడ్చినంత పనిచేశాడు. అసలు విషయం అర్థమైంది వీరేందర్‌కి.

*

'మూర్తీ, !భయపడకు, కుర్చీతోనే నీ ముఖంలో వెలుగు వుండేది. అది పోయింది. కుర్చీ మీద బాగా కాంక్ష వున్న వ్యక్తులకి, అధికార దర్పాలకి బాగా అలవాటుపడిన వ్యక్తులకి ఇలా అవడం సహజమే. పదవీ విరమణ చేసిన తరువాత ఇలా కావడం అత్యంత సహజం. నిన్న నువ్వు పదవీ విరమణ చేశావు కదా! అందుకని అలా అన్పిస్తుంది' చెప్పాడు వీరేందర్. 'ఈ సమస్యకు పరిష్కారం లేదా?' ఆదుర్దాగా అడిగాడు నారాయణమూర్తి. 'ఆందోళన చెందకు. ఇలాంటి పదవి మరొకటి సంపాదించు.

గట్టిగా ప్రయత్నం చేస్తే అది పెద్ద విషయం కాదు. అప్పుడు ఈ సమస్య సమసిపోతుంది. ఒకవేళ అది కాని పక్షంలో నీ అధికార దర్పం కొనసాగే విధంగా ప్రభుత్వం నుంచి ఓ జీఓని తెప్పించుకో. నీ సమస్యకు ఇవి రెండే పరిష్కారాలు' అన్నాడు వీరేందర్. ఆ దిశగా ఇది వరకే మొదలు పెట్టిన చర్యలను మూర్తి మరింత వేగం చేశాడు.


మంగారి రాజేందర్ జింబో

94404 83001

Next Story