హరికథకు అపూర్వ గౌరవం తెచ్చిన 'కోట'

by Disha edit |
హరికథకు అపూర్వ గౌరవం తెచ్చిన కోట
X

చ్చిదానంద శాస్త్రి 'మహారథి కర్ణ' హరికథా గానం ఈ రోజు మన ఊరిలో శ్రీరామనవమి పందిరిలో చెప్పడానికి వస్తున్నారు...వెళదామా.. అనేమాట 30ఏళ్ల క్రితం ప్రతి ఊరిలో పండితపామరుల మాట. ఆయన 'మహారథికర్ణ' హరికథాగానం ఎంతో హృద్యంగా చేస్తుంటే కళ్లనుంచి నీరు స్రవించని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. శల్యుడి సూటిపోటి మాటలతో కర్ణుని హృదయం ముక్కలు.. కుంతీనందనుని తూణీరాల తూట్లు పడిన వైనాన్ని కోటవారు వర్ణించి చెబుతుంటే కరగని శిలలు ఉండవని ప్రతీతి. 70 ఏళ్లకు పైగా 20,000 కు పైగా ప్రదర్శనలు, రేడియోద్వారా వందల హరికథలు చెప్పి ఎంతో మంది శ్రోతలను ముఖ్యంగా గ్రామాలలోని పామరులను పరవశులను చేశారు. తన అద్భుత హరికథా గానంతో తెలుగువారిని, తెలుగు జాతిని పులకింపచేసి ఎంతగానో అలరించారు కోట సచ్చిదానంద శాస్త్రి.

ఇపుడు వారి వయస్సు 89. ఇన్నాళ్లకు పద్మశ్రీ పురస్కారంతో భారత ప్రభుత్వం శోభకృత్ ఉగాది నాడు గౌరవించడం తెలుగువారికి గర్వకారణం. తన పురస్కారం హరికథకు వచ్చిన గుర్తింపుగా, హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసుగారికి దక్కిన గౌరవంగా భావిస్తున్నానని వినమ్రతతో పురస్కార గ్రహీత చెప్పడం ముదావహం. 14వ ఏట నుంచే హరికథలు చెప్పడం ప్రారంభించినా ముసునూరి నారాయణస్వామి వద్ద శిక్షణ అనంతరం రాటు తేలి పండితపామరులను ఆకట్టుకునే విధంగా బాణీని మార్చుకుని తిరుగులేని హరికథాభాగవతార్‌గా ప్రసిద్ధి పొందారు. ఆ తర్వాత ఆయన హరికథ చెప్పని ఊరు, చోటు లేదనడంలో అతిశయోక్తి లేదు. అనేక ప్రదర్శనలిచ్చి పండితుల, నిరక్ష్యరాస్యుల ప్రశంసలను పొందారు. సాటిలేని హరికథకుడిగా కీర్తిగడించారు. సినీ సంగీత బాణిలతో మహాభారత రామాయణ భాగవత పురాణాల లోని ముఖ్యఘట్టాలను కూర్చి హరికథలో శ్రవణానందకరంగా వినిపించడం ద్వారా పామరులను సైతం అలరించారు హరికథా ప్రక్రియకు విశేష ప్రాచుర్యాన్ని కల్పించారు.

హరికథ తెలుగువారికి ఎంతో ప్రీతిపాత్రమైన కళారూపం. ఇదిసంగీతం, సాహిత్యం, నృత్యం, వాచకం, అభినయాల కలబోత. భాగవతార్ పట్టు పీతాంబరాలు ధరించి నడుంకు పట్టు వస్త్రం బిగించి మెడలో పూలహారంతో కాళ్లకు గజ్జలతో చేతిలో చిడతలతో పురాణఘట్టాలను సంగీత నృత్యాలతో మనోహరంగా హరికథాగానం చేయడం ప్రతీతి. అందులో కోటవారు ఆరితేరి అలరించడంతో మేటి. వారి నృత్యం వర్ణించలేం. హరికథ చివరలో శ్రీరామదూతం శిరసా నమామి అంటూ ప్రదర్శన చూడడానికి వచ్చినవారితో ఆలాపన చేయించడం ద్వారా వారిని కూడా భక్తిమార్గంలో పెట్టడం ఆయన ప్రత్యేకత. ఆ రోజుల్లో ఎడ్లబండ్లు కట్టుకుని కుటుంబసమేతంగా శాస్త్రిగారి హరికథకు తరలివచ్చేవారు. హరికథ అంటేనే కోట సచ్చిదానంద శాస్త్రి గుర్తుకు వచ్చేంతగా తెలుగునాట మారుమోగిపోయింది. అంతగా కోటవారు కళాప్రియుల హృదయాలలో చోటుచేసుకున్నారు. హరికథకు ఆయన చేసిన సేవను గుర్తిస్తూ ఆలస్యంగానైనా కేంద్రం గుర్తించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం ఇవ్వడం హర్హ ణీయం. మరుగుపడిపోతున్న కళారూపాలను తిరిగి ప్రాణం పోయడం ప్రభుత్వబాధ్యతగా స్వీకరించాలి. అప్పుడే ఆ కళారూపాలు చిరస్థాయిగా ప్రజల మధ్య నిలుస్తాయి.

యం.వి.రామారావు

80741 29668



Next Story

Most Viewed