అద్దె ఇంట్లో మరణం ఓ సామాజిక సమస్య

by Ravi |
అద్దె ఇంట్లో మరణం ఓ సామాజిక సమస్య
X

ఇటీవల ఓ మిత్రుడి తల్లి మరణించింది. అదీ అద్దె ఇంట్లో. విషయం ఎవరు చెప్పారో కానీ విషయం బయటకు పొక్కిన అరగంటలోపే ఇంటి ఓనర్ నుండి ఫోన్. వెంటనే ఇల్లు ఖాళీ చెయ్యాలని. అంతిమ సంస్కారాలు, కర్మ కాండలు తమ ఇంట్లో చేయడానికి వీల్లేదని. దుఃఖంలో ఉన్న మిత్రుడికి, ఆ కుటుంబానికి షాక్. ఇప్పటికిప్పుడు ఎలా సాధ్యమని. తల్లి పోయిన బాధ కన్నా ఈ అంశం వాళ్ళని చాలా బాధించింది. ప్రస్తావనార్హం కాదు కానీ ఆ మిత్రుడు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వాడు. తమ పూర్వీకులు తరతరాలుగా బోధించిన బోధలు ఇలా ఎదురు తిరుగుతాయని కలలో కూడా ఊహించి ఉండడు. పెద్దల జోక్యంతో కొన్ని పరిహారాల నిర్వహణా ఒప్పందంతో సమస్య అప్పటికి సర్దుబాటు అయింది.

ఇలాంటి దృష్టాంతాలే మరి కొన్ని నా గమనంలోకి వచ్చాయి. అద్దె ఇంట్లో ఉన్న కుటుంబ యజమాని ఒకరు మరణిస్తే ఇంటి ఓనర్ తన ఇంట్లో కొద్ది రోజుల్లో పెళ్లి ఉందనే పేరుతో ఎలాంటి కార్యక్రమాలు జరపడానికి అంగీకరించలేదు. విధి లేని పరిస్థితుల్లో ఆ శవాన్ని స్మశానంలో ఉన్న గదికి తరలించి, అక్కడే బంధువులకు ఆఖరి చూపు కల్పించి, అంతిమ సంస్కారాలు చేయడమే కాక, పెద్ద కర్మ నిర్వహించే వరకు ఆ కుటుంబం అక్కడే నివసించవలసి వచ్చింది. ఆ తర్వాత మాత్రమే ఇంటికి రానిచ్చాడు ఓనర్.

ఇలాగే అద్దె ఇంట్లో ఉన్న కుటుంబంలో పెద్దావిడ చనిపోతే ఆ విషయం చెప్పకుండా ఆరోగ్యం బాగా లేదు.... హాస్పిటల్ కు వెళ్తున్నామని చెప్పి అంబులెన్స్ రప్పించుకుని, శవాన్ని బయటకు తీసుకు పోయి, దారి మధ్యలోనే ఊపిరి పోయిందని చెప్పి సొంత గ్రామానికి తరలించు కున్నాడో అద్దెదారు. ఇక్కడ ఇంటి ఓనర్ కు, అద్దెదారుకు సంతృప్తి కలిగింది. ఉభయతారకమైన పరిష్కారం దొరికింది.

మరో ఘటనలో అద్దె ఇంట్లో ఉరేసుకుని మరణించాడు ఓ అద్దెదారు. శవాన్ని స్వంత ఊరికి తీసుకెళ్ళి మిగిలిన కార్యక్రమాలు చేసినప్పటికీ ఇంటి ఓనర్ కి కొత్త సమస్యలు మొదలయ్యాయి. ఆ ఇంట్లోకి అద్దెకు దిగడానికి ఎవరూ ముందుకు రాలేదు. చేసేదేం లేక ఓ సంవత్సరం పాటు ఇంటిని ఖాళీగా పెట్టుకుని ఆ తర్వాత బ్రాహ్మణుల సలహా మేరకు పెద్ద మొత్తంలో ఖర్చు చేసి శాంతి పూజలు జరిపించి, అన్న సంతర్పణ చేసి దోషం తొలగించుకున్నాడు ఆ ఇంటి యజమాని.

పై సంఘటనలు పరిశీలిస్తే తప్పు ఎవరిది? ఇంటి యజమానిదా? అద్దెకు ఉన్న వారిదా? అనవసరమైన అపోహలను, అనుమానాలను, ఆచరణలను, ఆచారాల పేరిట జనం మీద రుద్దిన బ్రాహ్మణీయ భావజాలానిదా?

ప్రాణి అన్నాక మరణం తప్పదు. అది ఇంటి సొంతదారు కుటుంబ సభ్యుల కైనా, అద్దెదారు కుటుంబ సభ్యుల కైనా తప్పని అనివార్య పరిణామం. కానీ మరణం చుట్టూ ఏర్పరచిన అపోహల వల్ల, ఆచారాల వల్ల మానవత్వాన్ని మరచి వ్యవహరించే సంఘటనలు జరుగుతున్నాయి. జననానికి, మరణానికి మంచి ఘడియలు, చెడ్డ ఘడియలు అని లెక్కించడం, చెడ్డ ఘడియల్లో మరణిస్తే ఇంత కాలం ఇల్లు వదిలేయాలనడం, మరణం జరిగిన ఇంట్లో ఇంత కాలం శుభ కార్యక్రమాలు జరపరాదనడం, శాంతి కోసం ఖర్చుతో కూడిన పూజల్ని సూచించడం, కర్మ కాండలు చేసిన వారు పరుల ఇంట్లోకి ప్రవేశించ రాదనడం.... మొదలైన ఆంక్షల వల్ల ఇంటి సొంతదారులు అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. ఒకప్పటి గ్రామీణ సమాజంలో మరణం, ఆ తర్వాతి కర్మ కాండ సొంత ఇంటిలోనే జరగాలనే నియమం ఆచరణ సాధ్యమై ఉండవచ్చు. కానీ నేటి ఆధునిక, యాంత్రిక, వలస జీవన సమాజంలో ఇది సాధ్యమా? సొంత ఇంటి కల నెరవేరే అంశమేనా? సొంత ఇల్లు ఉన్నా దానిని వదలి వివిధ ప్రాంతాలలో, దేశాలలో బతకాల్సిన పరిస్థితులు అనివార్యమైన సందర్భంలో ఆచారాల పేరిట ఈ తరహా అమానుషాలు సమంజసమా?

ఇక్కడే సంస్కరణలు అవసరం. సనాతనం పేరిట అర్థం లేని, ఆచరణ సాధ్యం కాని ఆచారాలను రుద్దే బదులు వాటిని వదిలించుకోవాలి. అందుకు బ్రాహ్మణ లేదా పూజారీ వర్గం ముందుకు రావాలి. మరణం చుట్టూ ఉన్న ఆచారాలను, దోషాలను, శాంతులను వదిలేయాలి. హిందూ మఠాధిపతులు, హిందూ మత ప్రవచకులు ఇందుకు పూనుకోవాలి. విస్తృతంగా జన బాహుళ్యాన్ని చైతన్య పరచాలి. అలా సంస్కరించు కున్నపుడే ఏ మతమైనా, ఆచారమైనా మనిషిని మనిషిలా నిలబెడుతుంది.

వి.ఆర్. తూములూరి

97052 07945

Next Story