పుస్తక సమీక్ష: పరిమళించిన ప్రభాత సుమాలు

by Disha edit |
పుస్తక సమీక్ష: పరిమళించిన ప్రభాత సుమాలు
X

కవిత్వం ప్రత్యేకంగా ఇలా ఉండాలని నిబంధన ఏదీ కూడా ఉండదు. ఎక్కడ కూడా చెప్పలేదు. కవి హృదయానికి సమాజంలో జరుగుతున్న సంఘటనలే కావచ్చు, ప్రకృతి అందాలను తెలియజేయాలనే తలంపు కావచ్చు, తన మనసులోని భావాలను తెలియజేయాలనే సంకల్పం కావచ్చు. ఇలా కారణం ఏదైనప్పటికీ తన భావజాలాన్ని కవితాత్మకంగా అక్షర రూపంలో వ్యక్తీకరిస్తున్న హైదరాబాద్ వాసి అయిన విస్సాప్రగడ పద్మావతి చేసిన ప్రయత్నం అభినందనీయం. ఒకవైపు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ మరోవైపు సాహిత్యంపై మక్కువతో అలంకార కవితలు, వచన కవితలు చిత్ర కవితలు, ప్రాసాక్షర కవితలతో తన సాహిత్య ప్రయాణాన్ని సాగిస్తున్నారు. అందులో భాగంగా ప్రభాత సుమాలు - కవితా సంపుటి పాఠక లోకానికి అందించారు.

మాతృభాష మకరందం భావితరాలకు ఆనందం కవితలో....

మాతృభాష మకరందం భావితరాలకు ఆనందం, అమ్మ జోల పాట కమ్మనైన లాలి పాట, మాతృమూర్తి ఒడిలో ఓనమాలు దిద్ది, మొదటగా నేర్చే భాష మన తెలుగు భాష. భరతమాత మోమున మెరిసిన తిలకంలా, తేనె మధురిమ సారంలా, కోకిల గాన స్వరంలా, వేణు నాద వినోదములా, పురివిప్పి నాట్యమాడే అందాల మయూరంలా, మధురమైన భాష మన మాతృభాష, తెలుగును చులకన చేసి ఆంగ్లంపై మక్కువ చూపి ఆంగ్ల భాష ప్రాధాన్యత పెంచి తెలుగుభాష ఉనికి దూరమయ్యే ఈ తరుణంలో సాహిత్యంపై అభిమానం, తెలుగు భాషపై మమకారం రెండింటినీ మేళవింపు చేసి దేశభక్తిని చాటి చెప్పింది కవయిత్రి.

ఆశల కోవెల ఓ రైతన్నా ..కవితలో...

అందుకో మా జోహార్లు సస్యాధిపతి చేరువైన వేళ, కారు మబ్బులు కమ్ముకొచ్చిన వేళ, గ్రీష్మ తాపానికి వొడిలిన ఒడలు తొలకరి జల్లులతో, నేల తల్లి తానమాడి పులకరించే, కర్షకులంతా హర్షంతో గోదారి గట్లపై, ఎడ్లకు బొట్లు పెట్టీ, హలం పట్టి, పొలం దున్ని, మట్టి వాసన చవిచూసి విత్తు నాట,అవిశ్రాంత సేద్యంతో అన్నం పెట్టే రైతన్నను మరవద్దు అని తెలియజేస్తూ.... నేల తల్లిని నమ్ముకుని అహర్నిశలు శ్రమిస్తున్న రైతు గురించి తెలియజేసింది కవిత.

నేనొక పుస్తకమైతే... కవితలో...

నేనొక పుస్తకమైతే ప్రతి పుటలో నేనుంటా, ప్రతి అక్షర భావం నేనౌతా, ప్రతి పదానికి పదనిసలు నేర్పుతా. ప్రతి వాక్యాన్ని నర్తింపజేస్తా, ప్రతి పేరాను అర్థవంతంగా మలుస్తా, ప్రతి పేజీలో స్ఫూర్తి భావం నింపుతా, ప్రతి పుటకు భావుకత జోడిస్తా, ప్రతి పాఠకునికి చేరువవుతా, ప్రతీ అభిమానిని అబ్బుర పరుస్తా, ప్రతి హృదయానికి అభిమానినౌతా ... ప్రతి మోసం చేసే మనసుకి గుణపాఠం నేర్పుతా, ప్రతి సున్నిత మనసుకు సాంత్వన నవుతా ప్రతి పాత్రకూ జీవం పోస్తా , ప్రతి మోసగాడికి కనువిప్పు కలిగిస్తా, ప్రతి ప్రేమించే మనసుకు స్వచ్ఛత తెలుపుతానని కవయిత్రి తను పుస్తకమై పాఠకుడికి ఏమి చెప్పాలి అనే ఉద్దేశంతో పుస్తకం ప్రాముఖ్యతను, స్ఫూర్తివంతమైనటువంటి మార్పు కోసం తను చేసే ప్రయత్నాన్ని తెలియజేసినది.

స్నేహ సరాగం, మగువే మహారాణి, శ్రావణ లక్ష్మి, ప్రజా యోధులు కాళోజీ, జ్ఞాపకాలు, కష్టజీవి, ప్రగతి రథచక్రాలు, సమైక్య భారతి, స్వేచ్ఛా పంజరం, వాన జాడ ఎరుగని నెరజాణ, జాతీయ భావంతో పాటు పంచపదులు, సిసింద్రీలు ప్రక్రియలతో ఇలా మొత్తం 64 పలు కవితల్లో కవయిత్రి తన కవితా వస్తువులను ఎంచుకోవడంలో, కవితల్లోని భావాలను వ్యక్తపరచడంలో తనకు తానే ప్రత్యేకం, తెలియజేయాలనుకునే విషయాన్ని సూటిగా చెప్పడం ఇలా పలు అంశాలపై కవయిత్రి విస్సాప్రగడ పద్మావతి సహజంగా ఏర్పడిన భావకవిత్వం తన కవనాలలో కనిపించింది. సాహితీ సమ్మేళనాలలో ఉత్సాహంగా పాల్గొంటున్న కవయిత్రి పద్మావతికి పలు సాహితీ సంస్థలు పురస్కారాలను కూడా అందించాయి. మరిన్ని కవితలు ఇంకా మెరుగైన కవిత్వంతో పరిమళించిన ప్రభాత సుమాలకు తోడుగా తదుపరి కవితా సంపుటి వెలువరించాలని అక్షరాభినందనలు తెలియజేస్తున్నాను.

పుస్తకం పేరు: ప్రభాత సుమాలు

రచయిత: విస్సాప్రగడ పద్మావతి.

పుస్తక ప్రతులు: అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలలో లభ్యం

సమీక్షకులు

డా. చిటికెన కిరణ్ కుమార్

కథా, వ్యాస రచయిత, విమర్శకులు

9490841284



Next Story