ఓటరు ఆచితూచి ఓటు వేయాలి!

by Disha edit |
ఓటరు ఆచితూచి ఓటు వేయాలి!
X

తలకాయలన్నీ ట్యూనింగ్ చేయబడుతున్నాయి. ట్యూనింగ్ అంటే తలలోని మెదడును అటువైపు మలుచుకునుడు. అంటే పదేపదే వల్లించుడు, వల్లే వేయించుడు, రుద్దుడు, ఎక్కిచ్చుడు. అవసరమైన పద్ధతిలో ఆ తలకాయను అటువైపు సంచిల దాసుకునుడు. తన సందుగలకు ఇట్ల తలకాయలన్నీ చేరినంక వాటికి కండిషనింగ్ చేసుడు. ఎట్లనంటే ఈ పార్టీ మంచిది, ఈ పార్టీ చెడ్డది. ఈ పార్టీ ఇది చేసింది, అగో అది చేసింది, అదంతా ఇదే చేసింది. తెచ్చింది మేమే, ఇచ్చేది మేమే, పొద్దు పొడిపిచ్చేది మేమే, మేమే అంటూ ఊదరగొట్టుడు. ఇట్లనే అవతల పార్టీ కూడా అది వాల్లు తెచ్చినం అంటుండ్రు కదా! అది మేమే ఇచ్చినం, మేం ఇస్తనే వచ్చింది. తెచ్చినంక ఏం అయ్యింది. అంత ఒక్కలే కమ్ముకున్నరు ఒక్క ఇంట్లనే నిండినయి మేం సూత ఇది ఇస్తం అది ఇస్తం అని మరికొన్ని తలకాయలను పట్టుకొని ఇంకో పార్టీ ట్యూనింగ్ చేస్తది.

ఓట్ల పండగ దాకా..

ఇంకో పార్టీ వచ్చి మరొక ముచ్చట చెప్పుట అసలు అయిదేండ్ల ఎవరు సంసార్లో కాదు, ఒకలను ఒకలు అనుకున్న ముచ్చట్లు మాట్లాడుకుంటే సరిపోతది. కానీ ఓటర్ల తలకాయలను ఖాళీ ఉంచుతే కదా. అసలు ఎటో ఓ దిక్కు ఆలోచిస్తామనే సమయం మిగల్చక ఊర్లల్ల మనుషులను తమ దిక్కు మలుపుకుంటున్నరు. ఈ కులపోళ్లు, ఆ కులపోళ్లు, ఈ ఊరు, ఆ ఊరు అనుకుంటా బృందాలు బృందాలు చేసి ఓట్ల పండుగ దాకా తలకాయలను ఒక్క దండకు కట్టినట్టు కట్టి ఊరేగించుడు, తింపిచ్చుడు, తినిపిచ్చుడు, తాగిపిచ్చుడు ఒక్కటని కాదు సకలం చేస్తున్నరు. అసలు మనుషులకున్న మతిమరుపు వీల్ల గెలుపుకు మూల మలుపు! ఏ పార్టీ అయినా, వాల్ల గత మేనిఫెస్టోలో పెట్టిన వాల్లు గత ఎన్నికల్లో మాట్లాడిన వాగ్దానాలు అమలు అయ్యాయా అంటే చాలా కావు కొన్ని అయితయి. అవన్నీ పౌరులకు జ్ఞాపకంలో ఉండవు.

కులానికో, మతానికో లొంగి వంగి..

రాజకీయ పార్టీలు అంటే సంపాదన మార్గాలు అనేకం ఉంటాయి. గత కాలమంతా ఆ కమీషన్‌లు, ఈ కమీషన్‌లు, పర్సెంటేజీలు అనే ఒకరి నిజాలు మరొకరు చెప్పుకుంటనే ఉంటారు. అవినీతి ఆరోపణలను ఖండించరు కూడా. ఆ ప్రజాధనం దుర్వినియోగం అయినా పట్టింపు ఎవరికీ ఉండదు. ఎందుకంటే మనిషి మొత్తం ఒక దిక్కు అంటే పార్టీకో, కులానికో, మతానికో లొంగి వంగి నంగి ఉంటాడు. ఆపదకాలలో రాజకీయ నాయకుల సాయం పొందుతాడు లేదా భవిష్యత్‌లో ఉంటుందేమోనని ఆలోచనలో నిండిపోతాడు. పైగా ప్రతి నెలకోసారి సందర్భానుసారం ఆ పౌరుడు ఎక్కడో ఒక దగ్గర కట్టి వేయబడతాడు. ఈ తనకు తానే కట్టేసుకొని తన తలను ఇంకొకరి చేతిలో పెట్టి పై నుంచి వచ్చే ప్రసాదాలకు అనుగుణంగా ఓటు వేయడం జరుగుతుంది. ఈ లోపల ప్రలోభాలు పంపకాలు జరిగిపోతాయి. అంతలోనే ఎన్నికలు అయిపోతయి. ఎన్నికలు ప్రజాస్వామికంగా జరగాలి. ప్రజల స్వతంత్ర ఆలోచనలు సాగనివ్వాలి. ఆచితూచి ఓటరు ఓటు అన్ని ఆలోచించి వెయ్యాలనే చైతన్యం పెంపొందాలి.

-అన్నవరం దేవేందర్

94407 63479

Next Story