జీవితంలో లాఫర్వా తనం ఎక్కువైతుంది!

by Disha edit |
జీవితంలో లాఫర్వా తనం ఎక్కువైతుంది!
X

ప్పుడు వస్తున్న తరంలో జీవితం పట్ల ఆశావాద దృక్పథంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే ఆకాంక్షలు ఎక్కువగానే ఉన్నాయి. కానీ పనిపట్ల జీవన గమనం పట్ల లాఫర్వాతనం కూడా ఎక్కువగా కన్పిస్తాయి. లాఫర్వాతనం అంటే పట్టింపు లేనితనం నాన్ సీరియస్‌తనం అన్నట్టు, చదువు సంధ్యలు, ఉద్యోగాలు, సంపాదన మార్గాలు సాధించుకున్నా కొన్ని చిన్న చిన్న విషయాల పట్ల జాగరూకత లేని నిర్లక్ష్యం కన్పిస్తది.

సీటు బెల్ట్ పెట్టమన్నా పెట్టరు..

కారులో ప్రయాణం చేస్తరు, డ్రైవింగ్ చేస్తరు కానీ సీటు బెల్టు పెట్టడంలో ‘ఎహె పోనియి’ ఏమైతదనే ధోరణి ఈ తరంలో ఎక్కువ మందిలో కన్పిస్తంది. సీటు బెల్టు పెట్టకపోవడం పెనాల్టి వేయదగ్గ నేరమని తెల్సినా ఏం కాదు తియ్యి అని నాలిక మీది కెల్లి తీసివేస్తరు. ఈ పద్ధతి వల్ల ప్రమాదాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. లేదా తీవ్ర గాయాల పాలు అవుతున్నరు. అందుకే కొన్ని కార్ల కంపెనీలే సీటు బెల్టు లేకుంటే ‘సౌండ్స్’ వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కారు ప్రయాణంలో వేగం పెంచుకుంటూ వెళ్ళడం ఓవర్ టేక్ చేయడంలోనూ పద్దతి పాడు లేకుండా నడిపి వాళ్లకూ రోడ్డు మీద ఇతర ప్రయాణికులకు ప్రమాద కారకులు అవుతున్నారు. వేగ నియంత్రణలు ఉన్నా ‘స్పీడ్ గన్’లు ఉన్నా తప్పించుకోనేందుకు ప్రయత్నిస్తారు కానీ ఇవన్నీ మన ప్రాణ రక్షణకే ఏర్పాట్లు చేశారని సోయి ఉండదు. అసలు ఏం కొంపలు మనుగుతాయని వంద కిలోమీటర్ల స్పీడ్‌గా నడుపుతారో అర్థం కాదు. ఇదంతా లాఫర్వాతనం తప్ప మరేం కాదు. జీవితం పట్ల కుటుంబం పట్ల ఒక బాధ్యతగా ఉండటం తగ్గిపోతున్నది.

హెల్మెట్ పెట్టమంటే పెట్టరు

సాధారణంగా ద్విచక్ర ప్రయాణాల్లో ప్రమాదాలు ఎక్కువగా పడ్డంక తలకు తగిలే గాయాల వల్ల ప్రాణాలు కోల్పోతారు లేదా ఎక్కువ నష్టపోతారు. దీనికి హెల్మెట్ రక్షణ ఉంటుంది. ఆ హెల్మెట్ పెట్టుకుంటే ఫైన్ వేస్తాం అంటే తప్ప పెట్టని పరిస్థితి నిజానికి నీ హెల్మెట్ నీకు రక్షణ ఎవరో పోలీసులు ఫైన్ వేస్తానంటే పెట్టుకోవడం ఏమిటి! మన తలకాయ కోసమే కదా మన శిరస్త్రాణం.

నిజానికి హెల్మెట్ పెట్టుకుంటే కింద పడిపోతేనే రక్షణ కాదు. దాని వల్ల ఎండ, చలి, దుమ్ము నుంచి కూడా రక్షణ ఉంటుంది. ఎంత దూరం ప్రయాణించినా పెద్ద అలసట కన్పించదు. ఇంత మంచి హెల్మెట్‌ను కూడా పెట్టుకొమ్మంటే ఇక్కడ పోలీసులు ఉండరు కదా ఎందుకు అనే ఆలోచనలోనే ఉంటరు. సిటిలో తక్కవ స్పీడ్‌లోనే నడిపిస్తం కదా హెల్మెట్ అవసరమా అనే వాదన కూడా లేవ దీస్తారు. ప్రమాదం అనేది చెప్పిరాదు యాదృచ్ఛికంగా జరిగే ఘటన. అందుకు మన తప్పే లేకున్నా నష్టపోతాం.

మందుతాగి నడపడం

ఇయ్యాల రేపు తాగడం ఫ్యాషన్ అయిపోయింది. ఒకింత సోషల్ స్టేటస్‌గా మారిపోయింది. తాగనోన్ని చూసి చాదస్తం మనిషి అనుకునే స్థాయికి కూడా సమాజం చేరింది. తాగడం మొదలైనంక ఒక పెగ్గు, రెండు పెగ్గులు, మూడు పెగ్గులు తాగినంక ఇంటికి చేరాలంటే వాహనం నడపాలె మరెట్లా తప్పదు. మెల్లగా మత్తు ఎక్కే పరాకు పరాకు మొదలైతది అప్పుడు ఏ పని చేసినా నైపుణ్యత కోల్పోతరు. అయినా తాగి నడపడం అనేది కొనసాగుతున్నది. తాగిన తర్వాత ఆక్సిడెంట్‌లు బాగా అయితయి. అందులోనూ విలువైన జీవితం కోల్పోవడం ఖాయం.

జీవన గమనాన్ని ప్రేమించాలి

చిన్న చిన్న తప్పులకే ప్రమాదాలు జరిగి కుటుంబాలు దూరం అయిన సందర్భాలు ఎన్నో చూస్తున్నం. కుటుంబ సభ్యులను కోల్పోయిన కుటుంబం పరిస్థితి దారుణంగా ఉంటదనేది గమనింపులోకి రాదు. ప్రమాదాలు అనేది నడిపేవాడు తగు జాగ్రత్తలు తీసికోవడంతో తగ్గిపోతాయి. ఇట్ల సమాజం అందరూ వ్యవహరించాలి. నడుచుకుంటూ వెళ్ళే వారికి కూడా వెనుక నుంచి వేగంగా వస్తున్న వాహనాల ప్రమాదాలతో మరణాలు జరుగుతున్నాయి. అందుకే వాస్తవికంగా, నిదానంగా, నెమ్మదిగా, తొందర లేకుండా తగు జాగ్రత్తలతో ప్రయాణాలు చేస్తే మంచిది. ఈ తరంలో నేర్చుకోవాల్సిన అంశం ఇది.

అన్నవరం దేవేందర్

94407 63479

Next Story

Most Viewed