అంతరంగం: ఎంత నెత్తురు ప్రవహించిందీ నేల మీద!

by Ravi |
అంతరంగం: ఎంత నెత్తురు ప్రవహించిందీ నేల మీద!
X

తెలంగాణ నేల పోరాటాల కార్యశాల డెబ్బయి ఎనబై ఏండ్లకు పైగా ఏదో సందర్భంలో పోరాటం జరుగుతున్నదే. వేల వేల మంది అమరుల త్యాగ ఫలమే మనం ఇంత మాత్రమైనా గొప్పగా జీవిస్తున్నది. వెట్టిచాకిరీ, బానిసత్వం, ఫ్యూడల్ దాష్టీకం, కుల అహంకారం, అధిపత్య స్వభావాలకు వ్యతిరేకంగా ఎన్ని పోరాటాలు చవిచూసింది ఈ నేల.ఇందులో మళ్ళీ రాజ్యహింస. రాజ్యం భూస్వాములు ఒక్కటై ప్రజలపై దారుణ హింసలు ఈ హింసాత్వానికి ఎంత మంది బలి అయ్యారు.

అసలు తిరుగుబాటు వారిపైనే..

సెప్టెంబర్ 17 జ్ఞాపకం వస్తే హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్‌లో కల్సిన రోజు. అంతకుముందు ఆర్యసమాజం, ఆంధ్ర సమాజం, ఆంధ్రమహాసభ, గ్రంథాలయోద్యమం, కామ్రేడ్స్ అసోసియేషన్. స్టేట్ కాంగ్రెస్, సత్యగ్రహలు, ఖాదీ ఉద్యమాలు తెలంగాణలో పలు చోట్ల జరిగిన ఉద్యమాల చరిత్ర మన కళ్ళముందే మాయమవుతున్నది. నిజాం రాజు లొంగుబాటు అనంతరం ఇండియాలో అంతర్భాగం అయిన 1948 తర్వాత 1951 దాకా సాగిన దాష్టీకం చెప్పనలవి కాదు. నైజాం రజాకర రాజ్యానికి ఆయా సంస్థానాల్లో భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన కమ్యూనిస్ట్‌లను స్వతంత్రం వచ్చిన తర్వాత చేసిన అణిచివేత హత్యాకాండ ఎంత చెప్పనలవి కాదు. పోరాటంలో బైఠాన్‌పల్లి, గాలిపల్లి పర్కాల మరెన్నో గ్రామాల్లో పారిన నెత్తురు లెక్క తీయాల్సిన అవసరం ఉన్నది. గ్రామాల్లో నిజాం దన్నుతో భూస్వాములు, పెత్తందార్లు వేల వేలవేల ఎకరాలు కల్గిన సంస్థానాధీశులు ప్రజలచే వెట్టి చేయించుకున్నారు. వెట్టి అంటే ఊరిలో అన్ని కుల వృత్తుల వాల్లు దొర ఇంటికి 24 గంటల ఉచిత సేవలు వంతుల వారీగా చేయాలి పన్నులు కట్టాలి లేదంటే వీపుల మీద బండలెత్తడం హింసించడం జరుగుతుండేది.

అసలు తిరుగుబాటు స్థానిక భూస్వాముల మీద జరిగింది. వీల్లు నిజాం రాజు శరణు జొచ్చిండ్రు అప్పుడే రైతులు, కూలీలు సాయుధ శిక్షణ చందా బార్డర్‌లో తీసుకున్నరు. దళాలు తయారైనయి తిరుగుబాటు మొదలైంది. భూస్వాముల ఆధీనంలోని వేల ఎకరాల భూమి పంపిణీ చేయబడ్డది. అంతలోనే ఇండియన్ యూనియన్‌లో హైదరాబాద్ విలీనం అయింది. యూనియన్ మిలిటరీ, పోలీసులు కల్సి కమ్యూనిస్టు దళాల మీద వాళ్ళ సంబంధీకుల మీద పడి హింసించారు. మొత్తం ఒక కమ్యూనిస్టు ఉద్యమ వాతావరణం ఆచరణ మొదలైంది. అప్పటికే నిజాం రజాకార్ల సైన్యం అధిపతి ఖాసీం రజ్వి పాకిస్తాన్ వెళ్ళిపోయారు. నిజాం రాజ్‌ప్రముఖ్‌గా ప్రకటించిన తర్వాత ఇంకా యుద్ధం కొనసాగుతుంది.అంటే అప్పటిదాకా 1930 నుంచి 1951 దాకా పోరాటం నడుస్తనే ఉన్నది.

అన్యాయాన్ని ధిక్కరించే వారు ఎక్కువ..

తెలంగాణ నేలకు ఎప్పుడు గాయాల పలవరింతనే ఉద్యమ సమయంలో వెళ్ళిపోయిన భూస్వాములు తిరిగి గ్రామాలకు చేరిన కాలం పీడన, దోపిడీ, అంటరానితనం, అణచివేత కొనసాగుతున్న దశ కొనసాగుతున్న సందర్భంలో 1956లో ఆంధ్ర, తెలంగాణలో చేరి ఆంధ్రప్రదేశ్ అయ్యింది. ఆ తర్వాత తెలంగాణ రాజకీయ నాయకులు ప్రజలు అన్ని రంగాల్లో వివక్షకు గురై రెండవ శ్రేణి పౌరులుగా జీవించిన కాలం 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మళ్లీ పోరాటం అణచివేత కాల్పులు హత్యాకాండ వందల మంది ప్రాణాలు గాలిలో కల్సి ఉద్యమం ఆగిపోయింది. ఇదే అణిచివేతకు తోడు పేదరికం ఆకలి తిండికి లేనితనం వల్ల నక్సలైట్ ఉద్యమం 1980ల్లో వచ్చింది. ఈ పోరాటంలో ఎన్‌కౌంటర్లు మందుపాతరలు హింస నానా భీభత్సం వల్ల వేలాది మంది హతం అయ్యారు. అదొక చరిత్ర ఆ కాలమంతా రక్తం కన్నీరు ఏరులై పారింది. ఆనంతర కాలంలో తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమం 1996 నుంచి 2014 వరకు జరిగిన పోరాటంలో హింస లేదని కాదు గానీ ఆత్మహత్యల పర్వం తీవ్రరూపం దాల్చింది. పల్లె పల్లెన సబ్బండ వర్ణాలు తెలంగాణ ఉద్యమంలో దునికారు. ఈ ఉద్యమం సాధించిన తర్వాత తెలంగాణ సిద్ధించింది.

తెలంగాణ నేల మీద ఎక్కడ చూసినా కన్నీళ్లు, ఏ రక్తం అంటని మట్టి కనపడదు. ఏ ఊరు చూసినా అమరవీరుల స్థూపాలు స్మృతులే కన్పిస్తాయి. తెలంగాణ నేలనే పోరాటా స్వభావాల గాలి ఇది నిరంతరం ప్రశ్నలు వేసే కాలం ప్రశ్నలు పోరాడే స్వభావం అన్యాయంను ధిక్కరించే చేతులు ఎప్పుడు ఉంటాయి.

అన్నవరం దేవేందర్

94407 63479

Advertisement

Next Story

Most Viewed