అంతరంగం: భయం లేని ప్రవృత్తి పెరిగిపోతోంది!

by Disha edit |
అంతరంగం: భయం లేని ప్రవృత్తి పెరిగిపోతోంది!
X

ఇయ్యాల రేపు హత్యలు ఎంత సులువు అయిపోయినయి, కుటుంబ సభ్యులు మరీ చెల్లె, అక్కను ఊపిరి ఆడకుండా చేసి హతమార్చడం. ఎంత ఘోరమైన పని అదీ మరీ 20, 22 ఏళ్ల పిల్ల. ఇట్లాంటివి ఆడపిల్లలు సున్నిత మనస్తత్వం గల వాల్లు వినేందుకే జంకే కాలం నుంచి సులువుగా చంపేదాక వ్యవస్థ కుటుంబ బంధాలు పెరిగిపోయాయి. భార్యభర్తల మధ్య వివాహేతర కారణాలు అన్నదమ్ముల మధ్య ఆస్తుల కారణాలు ఉంటాయి. పగలు ప్రతీకారాలు ఓ యాబై ఏండ్ల తర్వాత ఎదురుకావచ్చు గానీ కోరుట్లలో సొంత చెల్లె, అక్కను తన ప్రేమికునితో కల్సి చంపడాన్ని ఎట్లా చూడాలి. దీని వెనుక ఎంత ధీమా ఉన్నది. ఈ టైపు తత్వాలు ఇంకా ఎంతమంది స్టూడెంట్స్ వద్ద మనసుల్లో నిండుకొని ఉన్నయో కదా!

వాటిపై నియంత్రణ లేకపోవడంతో..

అసలు నేరం చేస్తే శిక్ష పడుతుంది. కటకటాల వెనుకకు జీవితకాలం వెళ్ళక తప్పదనే భయం లేదా? వాళ్ళిద్దరూ ప్రేమించుకొని పెళ్ళి చేసికున్న తర్వాత జీవించేందుకు వాళ్ల ఇంట్లో బంగారం ఎత్తుకపోవడం. సిసి కెమెరాలు, సెల్‌ఫోన్ నెట్‌వర్క్ ద్వారా సులువుగా నేర పరిశోధన చేసి పట్టుకుంటారు కదా! అనే జ్ఞానం లేని ఆ చదువులెందుకు? ఆ బిటెక్‌లు ఎందుకు? దొంగతనం చేయడం చూసిందని తోడబుట్టిన అక్కను నిర్దాక్షణ్యంగా గొంతు నులిమే నేర ప్రవృత్తి ఎట్లా వచ్చింది? చిన్న పిట్ట పిల్ల, పిల్లికూన కుక్కకూనకు కాలుకు ఏదన్న అయితే దగ్గరికి తీసికొని కట్టుకడుతాము. పెరుగన్నం పెట్టి లాలించే వయస్సు కదా! ఆ అమ్మాయికి ఇంత నేర ప్రవృత్తి ఎట్లా ఎక్కింది? మానసిక శాస్త్రవేత్తలు పరిశోధన చేయాల్సిన అంశం. లేదు ఆ అమ్మాయి ప్రేమికుడే అంతగా మనసు మార్చి చావుకు ఎలా ప్రేరణ కల్గిస్తాడు? ఎంత చెడు చేసినా ఎట్లా చేతులు వచ్చాయి?

ఇటీవల అందరి చేతుల్లో సెల్‌ఫోన్ చేరింది. అది అనివార్యం అయింది. ఇందులోని యూట్యూబ్‌లో ఎన్ని ఉండాల్నో అన్ని ఉంటున్నాయి. ఎన్ని ఉండకూడదో అన్ని ఉంటున్నాయి. క్రైమ్ దృశ్యాలు, క్రైమ్ సినిమాలు, పోర్న్ దృశ్యాలు ఇలా ఎన్నో అందరికీ అరచేతిలోనే క్షణంలో కన్పిస్తున్నాయి. ప్రమాదకరమైన పబ్జి లాంటి గేమ్స్ ఇందులోనే అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ చూసి యువతరం పాడైపోతుంది. నియంత్రణ లేదు. ఇవి చూడాలి.. అవి చూడాలి అవి చూడటం వల్ల ప్రమాదమని చెప్పే స్థితిగతులు లేవు.

కుటుంబ సంబంధాలు మృగ్యమయ్యాయి!

పిల్లలను కని లక్షలకు లక్షలు ఖర్చుపెట్టి స్కూల్‌లో వేసి, అక్కన్నుంచి పోటాపోటీగా చదివించి, చదివించి తర్వాత పైసలు సంపాదించే మిషన్‌కు తయారు చేస్తున్నారు. లేవగానే మార్కులు, మెరిట్, టాప్ కాలేజ్, క్యాంపస్ సెలక్షన్, పెద్ద పెద్ద ఉద్యోగం చేసుడే లక్ష్యం తప్పితే కుటుంబం పట్ల అనుబంధం, ప్రేమ పూర్వకంగా అన్ని ఫంక్షన్‌లకు రావడం, పోవడం పూర్తిగా ఈ తరం చదువుకునే వాల్లకు తగ్గిపోయాయి. మానవ సంబంధాలు కాదు కుటుంబ సభ్యుల సంబంధాలు కూడా మృగ్యం అవుతున్నాయి.

ఖాళీ సమయం దొరికితే సెల్,‌ సె‌ల్‌లో సినిమాలు పాటలు ఇతర చూడకూడని దృశ్యాలు అదే పని. చెడుకు దారి తీస్తాయని చెప్పే స్థితిలో లేదు. చెప్పినా వినిపించుకునే పరిస్థితి లేదు. అందుకే ప్రేమలో ఎవన్ని ప్రేమించాలో కూడా తెలవని రీతిలో అందులో దిగిపోవడం హింసాత్మకమైన సంబంధాలు కొనసాగుతున్నాయి. వీటికి తోడు సినిమాల్లో హింస విపరీతంగా దృశ్యమానం అవుతుంది. ఒక్క హీరో ఎంతోమందిని కొట్టడం, చంపడం, తన్నడం అన్నింటిని పగలకొట్టడం కత్తులతో పొడవడం తుపాకులతో కాల్చడం సాధారణం అయిపోయింది. ఇవన్నీ నేరాలు కదా శిక్షలు ఉండాయి కదా? అనే సోయి కూడా లేదు. నేర దృశ్యాలు పెట్టినప్పుడు, శృంగార దృశ్యాలు పెట్టినప్పుడు, మోసం దృశ్యాలు పెట్టినప్పుడు ఆ సినిమాలు చూసే వాల్లపై ఆ ప్రభావం పడదా! అట్లా నేర ప్రవృత్తి పెరుగుతుంది. తర్వాత ఎన్ని నేరాలు చేసిన రాజకీయవాదులను పట్టుకొని సులువుగా బయటకు రావచ్చుననే ఆలోచన కూడా ఉండటం వల్ల సమాజంలో భయం లేని ప్రవృత్తి పెరిగిపోతుంది. ఇదీ రానున్న రోజుల్లో మరింత భయంకరం కూడా కావచ్చు!

అన్నవరం దేవేందర్

94407 63479

Next Story