తెలుగు సాహిత్యంలో నవ్య ప్రయోగం…

by Ravi |
తెలుగు సాహిత్యంలో నవ్య ప్రయోగం…
X

అనితరుడు... సంపాదకులు చెప్పుకున్నట్టు ఒక బృహద్వ్యాస సంకలనం. మువ్వా శ్రీనివాస రావు అనే కవి కవితాంతరంగ విశ్లేషణల సమాహారం. విద్యార్థి దశ నుండే సాహిత్య మమకారి అయినప్పటికీ విద్యార్థి ఉద్యమాలలోనూ, ఆ తర్వాత రాజకీయ నిర్మాణాలలోనూ, విద్యా సంస్థల నిర్వహణలోనూ తలమునకలైనందున మనవడు పుట్టిన తర్వాత 53 ఏళ్ల వయసులో కవితా సేద్యం వైపు అడుగులు వేసి అనతి కాలంలోనే సమాంతర ఛాయలు, సిక్స్త్ ఎలిమెంట్, వైరాయణం, వాక్యాతం... శీర్షికలతో నాలుగు కవితా సంపుటాలను వెలువరించి తెలుగు కవిత్వ లోకపు చూపు తన వైపు తిప్పుకున్న వాడు మువ్వా శ్రీనివాస రావు. ఇప్పుడు తన నాలుగు కవితా సంపుటాలలోని కవిత్వంపైన, తన వ్యక్తిత్వంపైన తెలుగునాట రాయగలిగిన వారిలోని 366 మందితో (బహుశా ఈ సంఖ్య సంవత్సరం లోని 365 రోజులను దాటి లీపు సంవత్సరపు రోజుల సంఖ్య 366ను దృష్టిలో ఉంచుకొని ఎంపిక చేసినట్లుంది) చేయించిన కవితాంతరంగ విశ్లేషణ, విమర్శ, పరామర్శ, సమీక్ష... కొండొకచో అభిమాన ప్రకటనల ఉద్గ్రంథమే ఈ.... అనితరుడు.

అనితరుడు... అందరివాడు

అనితరుడు అంటే ఇతరుడు కాని వాడు, అందరివాడు అని అర్థం. కార్యాచరణ రీత్యా మార్క్సిస్టు పథగామిగా మసలి, తన కవిత్వంలోనూ మార్క్సిస్టు దృక్పథాన్ని నిష్కర్షగా ప్రకటించిన మువ్వా శ్రీనివాసరావు నిజంగానే అందరివాడని ఈ వ్యాస సంకలనానికి రాసిన వారి పేర్లను పరిశీలిస్తే అర్థం అవుతుంది. లెఫ్టిస్టులు, ఎక్స్ట్రిమిస్టులు, ఫెమినిస్టులు, దళితిస్టులు, రైటిస్టులు, ఎవరినీ అంగీకరించని ఒంటరిస్టులు, తామే గొప్ప అనుకుని ఇతరులను గుర్తించ నిరాకరించే ఇగోయిస్టులు... ఇలా ఒకరనేమిటి సమస్త సమూహాల వాళ్ళు ఈ 366 మందిలో ఉండడం విశేషం. బహుశా తెలుగునాట వివిధ దృక్పథాలకు, ధోరణులకు ప్రాతినిధ్యం వహించే కవులు, రచయతలు తమకు భిన్నమైన ధోరణిని అనుసరించిన వారిని అంగీకరించడం ఇప్పటి వరకు జరగని పని. మహాకవులుగా, రచయితలుగా లబ్ద ప్రతిష్టులైన వారి విషయంలో కూడా ఇలా జరగలేదు.

బృహద్ వ్యాస సంకలనం

కానీ మువ్వా శ్రీనివాసరావు విషయంలో జరిగింది. ఇందుకు ఈ బృహద్వ్యాస సంకలనానికి సంపాదకులుగా వ్యవహరించిన ఖాదర్ మొహియుద్దీన్, ప్రసేన్, సీతారాం, పగిడిపల్లి వెంకటేశ్వర్లు, అనిల్ డ్యానీలు కారణమా... లేక మువ్వా శ్రీనివాస రావు కారణమా .... అని పరిశీలిస్తే తప్పకుండా కవి మువ్వా శ్రీనివాసరావు కారణం అని అవగతమవుతుంది. అతనికున్న మానవ సంబంధాలు, అందరినీ కలుపుకొని అసాధ్యాలను సుసాధ్యం చేసే మనస్తత్వం, పట్టుదల, కార్యదక్షత ... ఖమ్మంలో లక్షలాది మందితో శ్రీ శ్రీ,, దాశరథి విగ్రహ ప్రతిష్టలు చేయడం, తన తల్లిదండ్రుల పేరిట, అవత్స సోమసుందర్ గారి పేరిట అవార్డు నెలకొల్పడం, జాషువా సాహిత్య వేదికను నడపడం, పుస్తక ఆవిష్కరణలను వేలాది మంది సమక్షంలో జరపడం.... ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు తనని అనితరుడుగా నిలిపాయి.

నిలిచిపోదగిన ప్రయోగం

తెలుగునాట ఏ కవి లేదా రచయిత రచనల మీద ఇంతటి విస్తృతమైన వ్యాస సంకలనం ఇప్పటి వరకు వెలువడలేదు. ఇతర భాషలలో ఏమైనా వెలువడ్డాయో లేదో తెలియదు. ఒక రకంగా చెప్పాలంటే ఇది తెలుగు సాహిత్య చరిత్రలో నిలిచిపోదగ్గ ప్రయోగం, ఒక పరిశోధనాత్మక గ్రంథం కూడా. ఎం.ఫిల్, పిహెచ్. డి చేసే విద్యార్థులకు, పరిశోధనార్థులకు గైడ్‌గా ఉపకరించగల వ్యాస సంకలనం. 1350 పేజీల ఈ విస్తృత గ్రంధానికి మరో 200 లేదా 300 పేజీలు చేర్చి మువ్వా శ్రీనివాస రావు రాసిన నాలుగు కవితా సంపుటాలను కూడా కలిపి ప్రచురించి ఉంటే పాఠకుడికి మరింత సౌలభ్యంగా ఉండేది. ఒరిజినల్ రచనలు చదివి, ఆపై 366 విశ్లేషణలు చదివితే "అనితరుడు" కవితాంతరంగ విశ్లేషణ మరింతగా అవగతమయ్యేది.

అనితరుడు: మువ్వా శ్రీనివాసరావు

కవితాంతరంగ విశ్లేషణలు @366

పేజీలు: 1350

వెల: రూ.750 లు

ప్రతులకు : 86399 72160


సమీక్షకులు

వి.ఆర్. తూములూరి

97052 07945



Next Story

Most Viewed