కథా-సంవేదన:ఎవరి కోసం

by Disha edit |
కథా-సంవేదన:ఎవరి కోసం
X

తన మీదా, తన మిత్రుల మీదా అన్యాయంగా కేసు నమోదు చేశారనన్న విషయం తెలిసింది ప్రవీణ్‌కి. నాలుగు రోజుల క్రితం కొందరు విద్యార్థులతో కలిసి అతను ఆర్ట్స్ కాలేజి దగ్గర ధర్నాలో పాల్గొన్నాడు. దాని మీదే పోలీసులు కేసు నమోదు చేశారు. ఏం చేయాలా? అని ఆలోచించాడు. అతను హాస్టల్‌లో ఉండటం లేదు. విద్యానగర్‌లో వాళ్ల అక్క ఇంట్లో ఉంటున్నాడు. వాళ్లు చేసింది ధర్నా. పోలీసులు పెట్టింది సీరియస్ నేరమేమీ కాదు. పోలీస్ అధికారులు తమ విధులు నిర్వర్తించకుండా చేశారని కేసు నమోదు చేశారు. స్టేషన్‌కు వెళ్లి ఎఫ్ఐఆర్ కాపీ తీసుకుందామని అనిపించింది ప్రవీణ్‌కు. అప్పుడు పూర్తి వివరాలు తెలుస్తాయి. అలా వెళ్లితే ఎఫ్ఐఆర్ కాపీ సంగతేమో కానీ, తనని అరెస్టు చేసి లాకప్‌లో పెడతారేమోనని ఆ ఆలోచన మానుకున్నాడు.

అతను యూనివర్సిటీ లా కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. దాంతో అతనికి కొంత 'లా' తెలుసు. ఫస్టియర్ చదువుతున్నప్పుడు ఫైనల్ ఇయర్ విద్యార్థులతో సన్నిహితంగా ఉండేవాడు. వాళ్లలో చాలా మంది న్యాయవాదులుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అందులో ఒకరు రాంనగర్ గుండు దగ్గర వున్నాడు. అతడి ఇల్లు కూడా అక్కడే. వెంటనే ప్రవీణ్ ఆయన దగ్గరికి వెళ్లాడు. విషయమంతా చెప్పాడు. యాంటిసిపేటరీ బెయిల్ కోసం దరఖాస్తు చేస్తే ఎలా ఉంటుందని అడిగాడు. 'అవసరం లేదు. మేజిస్ట్రేట్ కోర్టులోనే రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేద్దాం. సెషన్స్ కోర్టుకు వెళ్లి ఇబ్బంది పడటం అనవసరం' అన్నాడు. 'ఈరోజు శుక్రవారం. దరఖాస్తు చేసినా ఫలితం ఉండదు. ఏయే సెక్షన్ల కింద కేసు నమోదు చేశారో ముందు తెలుసుకోవాలి. ఎఫ్ఐఆర్ చూడాలి. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. మేజిస్ట్రేట్ విచారించే నేరాలయితే కోర్టులో సరెండర్ అయి బెయిల్ తీసుకుందాం' అన్నాడు న్యాయవాది.

'కోర్టులో ఎఫ్ఐఆర్ కాపీ మీరు చూసి విషయం తెలుసుకోండి' అన్నాడు ప్రవీణ్. 'అలాగే తెలుసుకుంటాను. ఇంతలో నువ్వు ఇద్దరు ఇద్దరు జామీన్‌దార్‌లని తయారు చేసుకో. వాళ్లు ఉద్యోగస్తులైనా పర్వాలేదు. ఆస్తి ఉన్నవాళ్లు అయినా పర్వాలేదు. ఆస్తి ఏంటే ఆస్తి సర్టిఫికెట్స్ తీసుకోవాలి. ఉద్యోగులైతే శాలరీ సర్టిఫికెట్ తీసుకోవాలి. అవి రెడీ చేసుకో' అన్నాడు ఆ న్యాయవాది. 'సరేనని' చెప్పి బయటకు వచ్చాడు ప్రవీణ్.నేరుగా ఇంటికి వచ్చాడు. అక్కకి విషయమంతా చెప్పాడు. బావకి ఫోన్ చేసి శాలరీ సర్టిఫికేట్ తీసుకోమని చెప్పాడు. స్నేహితులతో కూడా ఫోన్లో మాట్లాడినాడు. అనవసరమైన ధర్నాలు ఎందుకు చేసావని వాళ్ల అక్క అతనితో అంది. అతను ఏమి సమాధానం చెప్పలేదు.

అంతా ఊహించినట్టుగానే జరిగింది. రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో పోలీసులు అరెస్టు చేశారు. మిగతా స్నేహితులను కూడా అరెస్టు చేశారు. అందరినీ స్టేషన్‌కి తీసుకొని వచ్చారు. ఈ సంగతి యూనివర్సిటీ అంతా తెలిసిపోయింది. అన్యాయంగా అరెస్ట్ చేశారని అనుకున్నారు. అందరూ స్టేషన్ ముందు గుమికూడారు. విద్యార్థుల గుంపును చూసి పోలీసులు ఆలోచనలో పడ్డారు. వీళ్లని ఎక్కువసేపు స్టేషన్లో ఉంచుకోవడం మంచిది కాదని అనుకున్నారు. వెంటనే మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిస్తే మంచిదని పై అధికారులు కూడా చెప్పారు. వెంటనే రిమాండ్ రిపోర్ట్ తయారు చేయడం మొదలు పెట్టారు. గుమిగూడిన విద్యార్థులను అక్కడి నుంచి వెళ్లిపొమ్మని, లేకపోతే లాఠీచార్జి చేయాల్సి వస్తుందని చెప్పారు. సముదాయించారు. బెదిరించారు. కొందరు వెళ్లిపోయారు. కొందరు అక్కడే ఉండిపోయారు.

అరెస్టు చేసిన నలుగురిని తీసుకొని రాత్రి పది గంటల ప్రాంతంలో స్టేషన్ నుంచి బయటకు వచ్చారు పోలీసులు. ఆ నలుగురిని జీపులో ఎక్కించుకుని వెస్ట్ మారేడ్‌పల్లి వైపు బయలుదేరారు. అక్కడ జడ్జెస్ క్వార్టర్స్ ఉన్నాయి. ఈ స్టేషన్ పరిధి మేజిస్ట్రేటు అక్కడే ఉంటాడు. ఓ అరగంట తర్వాత పోలీస్ జీపు క్వార్టర్స్ కి చేరుకుంది. అప్పుడు దాదాపు 11 కావస్తోంది. ఓ కానిస్టేబుల్ వెళ్లి కాలింగ్ బెల్ కొట్టాడు. రిమాండ్ ఉన్న విషయాన్ని ముందే మేజిస్ట్రేట్‌కి తెలియజేశారు పోలీసులు. అందుకే అతను సిద్ధంగా ఉన్నట్లు అనిపించింది. వచ్చి తలుపు తీశారు. హెడ్ కానిస్టేబుల్ రిమాండ్ రిపోర్ట్ మేజిస్ట్రేట్‌కి అందజేశాడు. ముద్దాయిలని తీసుకు రమ్మని చెప్పారు ఆయన. ఆ నలుగురిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు పోలీసులు.

వారిని విచారించారు మేజిస్ట్రేట్. 'పోలీసులు చిత్రహింసలకు గురి చేశారా' అని కూడా అడిగాడు. జవాబు చెప్పారు ముద్దాయిలు. తర్వాత రిమాండ్ రిపోర్ట్ మీద ఏదో రాయడానికి సిద్ధమయ్యారు మేజిస్ట్రేట్. అది గమనించి, 'సార్' అన్నాడు ప్రవీణ్. 'ఏమిటి.?' అన్నట్టు చూశారు మేజిస్ట్రేట్. 'మాకు బెయిలివ్వండి సార్' అంటూ ఓ కాగితాన్ని మేజిస్ట్రేట్‌కి చూపించాడు ప్రవీణ్. 'మా న్యాయవాది కూడా వస్తున్నాడు బెయిల్ పిటిషన్ తీసుకొని' అని చెప్పాడు. 'ఈ రాత్రి బెయిలా!' అదోలా చూస్తూ అన్నారు మేజిస్ట్రేట్. 'అవును సార్' అన్నాడు ప్రవీణ్. 'ఇప్పుడేం బెయిలయ్యా, సోమవారం కోర్టులో వేసుకోండి' అన్నారు రిమాండ్ రిపోర్ట్ మీద ఏదో రాయబోతూ.

ప్రవీణ్‌కి ఆవేశం ముంచుకొచ్చింది. 'అవును సార్, బెయిలే అడుగుతున్నాను. సెలవు రోజులలో అర్నాబ్ గోస్వామికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయగా లేనిది, అట్లాగే రాత్రిపూట విద్యా సంస్థల నారాయణకి బెయిలు మంజూరు చేయగా లేనిది మాకు బెయిల్ ఇస్తే తప్పేమిటి ? మేమేమీ హత్య లాంటి ఘోరమైన నేరం చేయలేదు. ధర్నా చేశాం అంతే' అన్నాడు. అతని ఆవేశాన్ని గమనించాడు. ఆలోచనలో పడ్డాడు మేజిస్ట్రేట్. కానీ బెయిల్ పిటిషన్ స్వీకరించలేదు. న్యాయవాది వచ్చిన శబ్దం వినిపించినా ఆగనూ లేదు. సోమవారం వాళ్లని కోర్టులో హాజరు పరచమని ఆదేశాలు జారీ చేసాడు. పోలీసులు వాళ్లని తీసుకొని బయటకు వచ్చారు. 'మీరేమీ ఆర్నబ్ గోస్వాములు కాదు. నారాయణలు కూడా కాదు' అనుకున్నాడు మేజిస్ట్రేట్ మనసులో. పోలీసులు, కోర్టులు ఎవరికోసం ఉన్నాయో మరోసారి అర్థమైంది ప్రవీణ్‌కి అతను మిత్రులకి.


మంగారి రాజేందర్ జింబో

94404 83001

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed