కథా-సంవేదన:బుల్డోజర్

by Disha edit |
కథా-సంవేదన:బుల్డోజర్
X

ఈ మధ్య నా గొంతు బిగబట్టినట్టుగా ఉంటున్నది. ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉంటున్నది. గుండె మీద ఎవరో పెద్ద రాయిని పెట్టినట్టుగా ఉంటున్నది. నా శరీరంలో ఎన్నో షెడ్యూల్స్ ఉన్నాయి. వాటికి అనుబంధాలు ఉన్నాయి. మరెన్నో విభాగాలు ఉన్నాయి. అధికరణలూ ఉన్నాయి. ఇప్పటికి నన్ను వందకు మించి మార్చినారు. అంతేకానీ, నా స్వరూప స్వభావాల్ని మార్చలేదు. గతంలో కూడా నాకు ఊపిరి సలపకుండా చేశారు. అప్పుడు నాలోని ఓ అవయవాన్ని ఉపయోగించి అలా చేశారు. ఇప్పుడు ఏ అవయవంతో పని లేకుండా నాకు ఊపిరి ఆడకుండా చేస్తున్నారు. నా గుండె బరువుగా ఉంది. జ్వరంగా ఉంది. ఈ దాడిని భరించలేకపోతున్నాను.

బాధతో, వేదనతో అప్పుడప్పుడూ కళ్లు తెరిచి చూస్తున్నాను. ఏమీ కనిపించడం లేదు. అంతా చీకటి. అంధకారం. అయితే, కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. 'బాబా' అంటున్నారు కొంతమంది. 'మామా' అంటున్నారు మరికొంతమంది. 'న్యాయం' అంటున్నారు మరి కొంతమంది. ఈ మాటలను బట్టి నాకు అర్థమైంది. వారు ఎవరో కాదు. నా నుంచి వచ్చిన వాళ్లే. నేను చెప్పిన రీతిలో ప్రమాణం చేసిన వాళ్లే.

నేను చెప్పిన విధంగా నడుచుకుంటానని అన్నవాళ్లే ఇప్పుడు భిన్నంగా, రాక్షసంగా, కిరాతకంగా వ్యవహరిస్తున్నారు. నా గొంతును పిసికేస్తున్నారు. గుండె మీద గునపంతో గాయాలు చేస్తున్నారు. నన్ను మార్చకుండానే నన్ను చంపేస్తున్నారు.

నేను ఎవరి తలుపులు తట్టగలను? రక్షించాల్సిన వ్యవస్థలు కళ్ళు మూసుకుంటున్నాయో? వాళ్ల ఆదేశాలు సరిగ్గా పనిచేయడం లేదో? వాటిని ఖాతరు చేయడం లేదో? నాకైతే తెలియదు. ఎంత దుర్గతి?

జీవించే హక్కు నలిగిపోతోంది. ప్రతి రోజు నా గుండెలో గునపాలు దిగుతున్నాయి. వేదనతో నా గుండె సముద్రం అవుతుంది. ఇది అత్యాచారమో, హత్యాచారమో తెలియని పరిస్థితి. బుల్డోజర్ ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి చివరికి రాజధానికి చేరుకుంది. ఇప్పుడు బుల్డోజర్ న్యాయం అంటున్నారు. పక్క దేశాలలో యుద్ద ట్యాంకులు నడుస్తాయి. మనదేశంలో బుల్డోజర్‌లు నడుస్తున్నాయి. బహుశా భవిష్యత్తులో బుల్డోజర్ల మీదే ప్రమాణం చేస్తారేమో!!?


-మంగారి రాజేందర్ జింబో

94404 83001


Next Story

Most Viewed