కథా-సంవేదన:తగు చర్య

by Disha edit |
కథా-సంవేదన:తగు చర్య
X

వాతావరణం బీభత్సంగా ఉంది. ఆ భార్యాభర్త ఉంటున్న పరిసర ప్రాంతాలన్నీ దాడికి గురవుతున్నాయి. అప్పటికే మైనార్టీ వర్గానికి చెందిన కొంతమందిని హత్య చేశారు. భయంతో చాలా మంది అక్కడి నుంచి పారిపోయారు. అలా పారిపోకుండా ఓ ఇద్దరు వ్యక్తులు మిగిలిపోయారు. వారే ఈ భర్త, భార్య. వాళ్లు పారిపోవడానికి వీళ్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. తమ ప్రాణాలను రక్షించుకోవడానికి ఇంటిలోని బేస్‌మెంట్‌లో తలదాచుకున్నారు. అలా రెండు రోజులు గడిచిపోయాయి. ఆ రెండు రాత్రులు భయంకరంగా గడిచాయి. తమ మీద దాడి జరుగుతుందేమోనని ఆ రెండు రోజులు బిక్కబిక్కుమంటూ భయంతో ఉండిపోయారు. కానీ, ఎవరూ రాలేదు. ఎలాంటి దాడీ జరగలేదు.

అలా మరో రెండు రోజులు గడిచాయి. తమ మీద దాడి చేసే వ్యక్తులు వస్తారేమోనని అదే భయంతో భార్యాభర్తలిద్దరూ ఎదురుచూశారు. కానీ, ఎవరూ రాలేదు. మరో రెండు రోజులు గడిచాయి. చావు మీద భయం మెల్లిమెల్లిగా తగ్గిపోవడం మొదలైంది. దాహం విపరీతంగా అవడం మొదలు పెట్టింది. ఆకలి తన విశ్వరూపాన్ని చూపించడం ప్రారంభించింది. మరో నాలుగు రోజులు అలాగే గడిచిపోయాయి. భార్యాభర్తలిద్దరికీ బతుకు మీద ఆశ పూర్తిగా తగ్గిపోయింది. చావంటే భయం లేకుండా పోయింది. అందుకని, తాము దాక్కున్న స్థలం నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నారు. బయటకు వచ్చారు.

ఇంటి ముందు ఎవరూ కనిపించలేదు. చుట్టుపక్కల కూడా ఎవరూ కనిపించలేదు. ఇరుగు పొరుగువాళ్ల దృష్టిని ఆకర్షించాలని భర్త 'మేము బయటకు వచ్చాం. సరెండర్ అవుతున్నాం. ఇక మమ్మల్ని మీరు చంపివేయవచ్చు' అని గట్టిగా అరిచాడు. అతని అరుపులకి, ఆ శబ్దాలకి చుట్టు పక్కలవాళ్లు బయటికి వచ్చారు. వీళ్లిద్దరినీ చూసారు. వాళ్లందరికీ తెలియని డైలమా. వాళ్ల మతం ప్రకారం ఎవరినీ చంపడానికి వీల్లేదు. ప్రాణ హాని చేయకూడదు. మరి ఎలా? వీళ్లని ఏం చెయ్యాలి? చర్చలు,వాదోపవాదాలు జరిగాయి. కొంత సమయం తర్వాత ఓ నిర్ణయానికి వచ్చారు. భార్యాభర్తలిద్దరినీ పక్క వీధిలో ఉన్న వ్యక్తులకు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. అక్కడ వాళ్ల పైన తగు చర్య తీసుకోవడానికి వీలవుతుందని కూడా వాళ్లు అభిప్రాయపడ్డారు.

(ప్రముఖ ఉర్దూ కథా రచయిత 'సాదత్ హసన్ మంటో' రాసిన కథకి తెలుగు అనువాదం ఇది. దేశ విభజన సందర్భంగా అతను చాలా కథలు రాసారు. 'నల్ల సరిహద్దులు' కథల సంపుటిలోనిదే ఈ కథ. మంటో 11 మే 1912న లూథియానాలో జన్మించి బొంబాయిని బాగా ఇష్టపడ్డారు)


మంగారి రాజేందర్ జింబో

94404 83001


Next Story

Most Viewed