వారంట్ రీకాల్

by Disha edit |
వారంట్ రీకాల్
X

భయం భయంగా కోర్ట్ హాల్ దగ్గరికి వచ్చాడు రమణ. అక్కడంతా సందడి సందడిగా ఉంది. నానా గోలగా ఉంది. తీర్పు కోసం ఎదురు చూస్తున్న ముద్దాయిలు, కోర్టు ముందు హాజరు పరచాల్సిన వ్యక్తులతో, పోలీసులతో న్యాయవాదులతో ఎంతో గందరగోళంగా వుంది అక్కడి వాతావరణం. ఆ వాతావరణం గురించి వినడమే. కానీ చూసి వుండక పోవడం వలన రమణకి ఆశ్చర్యంగానూ, సౌకర్యంగానూ అనిపించింది. ఆ కోర్టుని కనుగొనడానికి ఆయనకు అరగంట పట్టింది. క్రిమినల్ కోర్టులు అన్నీ ఒకే దగ్గర ఉండడం న్యాయవాదులకు, న్యాయమూర్తికి సౌకర్యమేమో కానీ, ఎప్పుడో ఒకసారి వచ్చేవారికి మాత్రం కష్టమైన పనే. ఆ కోర్టు సముదాయానికి అతను రావడం ఇదే మొదటిసారి. జిల్లా కోర్టులకు రెండు మూడు సార్లు అటెండ్ అయ్యాడు కానీ, హైదరాబాద్‌ నాంపల్లి క్రిమినల్ కోర్టుకి రావడం మొదటిసారి. అందుకే అంతా అయోమయంగా వుంది. అందుకు అతను ఉన్న పరిస్థితి కూడా మరో కారణం. అతను ఓ పెద్ద పత్రికకి సంపాదకుడు.

ఆ రోజు సోమవారం. అందువలన కూడా చాలా రష్‌గా ఉంది. సాయంత్రం నాలుగున్నర ప్రాంతంలో కోర్టుకు రమ్మని అతని న్యాయవాది చెప్పాడు. అదే సమయానికి కోర్టుకు వచ్చాడు రమణ. కోర్టు హాల్ బయట వేచి వున్నాడు. చాలా మందిలాగే తనను ఎప్పుడు పిలుస్తారా? అని ఎదురు చూస్తూ ఆలోచనలో పడ్డాడు. తను చేసిన తప్పేమిటి? రోజూ ఎన్నో వార్తలు పబ్లిష్ అవుతూ ఉంటాయి. అన్ని వార్తలు తన దృష్టికి రావు. చాలా జాగ్రత్తలు తీసుకొంటూనే వుంటాము. ఎక్కడో ఎవరో ఏదో అంటారు. అందులో వాస్తవాలు ఉన్నా తప్పుడు కేసులు పెడుతూనే వుంటారు. ఎవరికో ఒకరి పరువుకు భంగం కలిగిందని కేసులు దాఖలు చేస్తారు. చాలా వరకు సంపాదకులని ఇబ్బంది పెట్టాలని, సివిల్ కేసులు కాకుండా క్రిమినల్ కేసులు దాఖలు చేస్తారు. లోకల్ ఎమ్మెల్యే మీద వచ్చిన వార్త అది. అందులో వాస్తవం ఉంది. అతను దొంగతనంగా ఇసుక రవాణా చేస్తున్నది వాస్తవమే అయినా కూడా ఆ వార్త అతనికి పరువుకి నష్టం కలిగించిందట. అందుకని కేసు పెట్టించాడు. అతను కోర్టుకు తిరగాల్సి వస్తుందని తెలిసీ తన అనుచరులతో క్రిమినల్ కేసు దాఖలు చేయించాడు.

తనకి కోర్టు నుంచి సమన్స్ రాలేదు. ఆఫీస్ లేని రోజున ఓ పోలీస్ పత్రిక ఆఫీస్‌లో క్లర్క్‌కి సమన్స్ ఇచ్చి వెళ్లాడు. తాను అడిగితేగానీ, శుక్రవారం వరకు ఆ విషయం తన దృష్టికి రాలేదు. సమన్స్ తీసుకొని కోర్టుకు రాలేదని తనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. ఆ విషయం కూడా వార్త రాసిన స్టింగర్ ఫోన్ చేయడంతో శుక్రవారం మధ్యాహ్నం తెలిసింది. అంతేకాదు, శుక్రవారం సాయంత్రం తనని అరెస్టు చేసే అవకాశం ఉందని, శని, ఆదివారాలు కోర్టుకి సెలవులు కాబట్టి, పోలీసులు అరెస్టు చేస్తే సోమవారం దాకా పోలీసుల ఆధీనంలోనే ఉండాల్సి వస్తుందని కూడా అతను హెచ్చరికగా చెప్పాడు. సెలవు రోజులలో బెయిల్ ఇచ్చే అవకాశం చాలా తక్కువ అని కూడా చెప్పాడు. అతను లోకల్ న్యాయవాది కూడా.

అప్పటికే సాయంత్రం అయిదు అయింది. కోర్టుకు వెళ్లే అవకాశం లేదు. ఆ ఎమ్మెల్యే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే. బాగా పరపతి ఉంది. ఏమైనా చేయగలడు పోలీసులని మేనేజ్ చేయగలడు. విషయం తెలిసింది కాబట్టి రెండు రోజులు ఎవరికీ తెలియని ప్రదేశంలో తాను తల దాచుకున్నాడు. న్యాయవాది చెప్పిన విధంగా సోమవారం సాయంత్రం కోర్టుకి వచ్చాడు. కోర్టుకు వచ్చాడన్నమాటేగానీ అతనికి భయం భయంగా ఉంది. కోర్టు వారంటుని రీకాల్ చేయకపోతే ఎలా? మనసులో ఎన్నో ఆలోచనలు. ఇదే విషయం న్యాయవాదితో అంటే, 'భయపడకండి ఇది చాలా సింపుల్ కేస్' అన్నాడు. చిన్న కేసు, సింపుల్ కేసే కావచ్చు కానీ, తనకు మాత్రం అది మాత్రం ఇప్పుడు పెద్ద కేసుగా మారింది. అందులోనూ వారెంట్ జారీ అయింది. తన తప్పు ఏమి లేకుండానే కోర్టు ముందు దోషిగా నిలబడాల్సి వస్తున్నది.

ఓ పది నిమిషాల తర్వాత కోర్టు అటెండర్ బయటకు వచ్చి 'రమణా, రమణా' అని రెండుసార్లు కేక వేసాడు. అనాలోచితంగానే రమణ కోర్టు హాల్‌లోకి అడుగు పెట్టాడు. అతను అలా అడుగు పెట్టాడో లేదో వారంట్ రీ కాల్ అయిందన్న మాట వినిపించింది. అతని మనసు ఆనందంతో ఊగిపోయింది. రెండురోజుల ఒత్తిడి తగ్గిపోయింది. తల మీద నుంచి బరువుని ఎవరో తొలగించినట్టుగా ఫీల్ అయ్యాడు. రెండు చేతులు జోడించి కోర్టుకి దండం పెట్టి బయటకు వచ్చాడు. తర్వాత అతని న్యాయవాదితో మాట్లాడి తిరిగి ఆఫీసుకి వెళ్లిపోయాడు రమణ.

ఇది జరిగిన ఏడు సంవత్సరాల తర్వాత ఒక రచయిత ఇంటిలో చిన్న ఫంక్షన్ జరిగితే రమణ అక్కడికి వెళ్లాడు. ఆ రోజు ఆదివారం. అక్కడికి ఓ న్యాయమూర్తి వచ్చాడు. రమణ అతన్ని గుర్తుపట్టాడు. అతను ఎవరో కాదు. రమణ వారంట్‌ని గతంలో రీకాల్ చేసిన మేజిస్ట్రేట్. రమణ మనసు ఆనందంతో ఊగిపోయింది. వెంటనే అతని దగ్గరికి వెళ్లి పలకరించాడు. న్యాయమూర్తి కూడా రమణని గుర్తుపట్టాడు. తన వారంట్ సంగతి ప్రస్తావించాడు రమణ. అదంతా తనకి గుర్తు్ందన్నాడు న్యాయమూర్తి. పక్కనే ఉన్న తన ఇంటికి ఆయనను తీసుకెళ్లాడు రమణ. ఓ పెద్ద పత్రిక సంపాదకుడు ప్రేమతో పిలిచాడని కాదనకుండా న్యాయమూర్తి అతని వెంట వెళ్లాడు.

ఇంటిలో కాసేపూ ఇద్దరూ చాలా విషయాలు మాట్లాడుకున్నారు. కాఫీలు తాగారు. ఆ వారెంట్ జారీ అయినప్పుడు తాను పడిన వేదనని న్యాయమూర్తికి వివరంగా చెప్పాడు రమణ. ప్రశాంతంగా విన్నాడు ఆ న్యాయమూర్తి. తాను రాసిన సంపాదకీయాల పుస్తకాలని, మరి కొన్ని పుస్తకాలను బహుమతిగా న్యాయమూర్తికి ఇచ్చాడు రమణ. 'నేను కోర్టులో అడుగుపెట్టీ పెట్టకముందే మీరు వారంట్ రీ కాల్ చేయడం నేను మర్చిపోలేను' అన్నాడు. 'ఈరోజు మీరు చూపించిన ఆదరణని, ప్రేమని నేను మర్చిపోలేను' అన్నాడు న్యాయమూర్తి. 'ఇదేం పెద్ద విషయం సార్' అన్నాడు రమణ. 'నేను చేసింది కూడా పెద్ద విషయం ఏమీ కాదు. ఎవరో వార్త రాస్తే దానికి సంపాదకులు బాధ్యత వహించడం సరి కాదని నా అభిప్రాయం. సమన్స్ మీదాకా వచ్చి ఉండకపోవచ్చని నేను అనుకున్నాను. అందుకే మీ వారంట్‌ని వెంటనే రీకాల్ చేశాను' అన్నాడు న్యాయమూర్తి. ఏం మాట్లాడాలో రమణకి తోచలేదు, ప్రేమపూర్వకంగా అతని చేతిని అలాగే పట్టుకున్నాడు.


మంగారి రాజేందర్ జింబో

94404 83001



Next Story

Most Viewed