- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Tribes : ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తెగలు.. జీవన పద్ధతులు!
దిశ, ఫీచర్స్ : తెగలు (tribes) అనే పదం మీరు వినే ఉంటారు. ప్రస్తుతం నాగరిక సమాజానికి దూరంగా అడవుల్లోనో, కొండల్లోనో నివసించే చాలా తక్కువ మంది ప్రజల సమూహాన్నే ఇలా పిలుస్తారు. పైగా వీరి సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు, నమ్మకాలు, వేషధారణ నాగరిక మానవులకు భిన్నంగా ఉంటాయి. భారత దేశంలో అయితే కొన్ని తెగలను గిరిజనులు (ఆదివాసులు) అని కూడా పిలుస్తారు. తరచుగా భూమి, ప్రకృతి, పర్యావరణంతో లోతైన సంబంధాలను కలిగి ఉంటారు. ప్రపంచంలో అలాంటి అరుదైన తెగల్లో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మావోరీ, న్యూజిలాండ్
మావోరీ (Maori) అనే పదం న్యూజిలాండ్‌లోని స్థానికులు, వారి భాషను కూడా సూచిస్తుంది. ఈ తెగకు చెందిన ప్రజలు రెండు విభిన్న పాలినేషియన్ సంస్కృతులను(diverse Polynesian cultures) అనుసరిస్తారు. సహస్రాబ్ది క్రితం న్యూజిలాండ్‌కు వచ్చారని నమ్ముతారు. తలపై పక్షుల ఈకలను ధరిస్తారు. శరీరం మీద ఫేషియల్ టాటూను కలిగి ఉంటారు. జంతు చర్మాన్ని గుడ్డగా చుట్టుకునే వారు కూడా ఇందులో చాలా మందే ఉంటారు. కాగా మావోరి తెగ ప్రజలు పూర్తి చట్టపరమైన హక్కులతో స్థానిక వ్యక్తులుగా ప్రపంచ వ్యాప్తంగా విలక్షణమైన స్థానాన్ని కలిగి ఉన్నారు.
హజ్దా, టాంజానియా
హజ్దా ట్రైబ్స్‌ను ఉత్తర టాంజానియాలో నివసించే ఆధునిక వేటగాళ్లు(modern hunter)గా పిలుస్తారు. ప్రస్తుతం 1300 మంది సభ్యులు కలిగిన జనాభా మాత్రమే ఉంది. ఆఫ్రికాకు చెందిన తెగల్లో చివరిగా మిగిలిన వేటగాళ్ల సమూహాలలో ఒకటిగా వీరు పరిగణించబడ్డారు. వారి పూర్వీకుల భూభాగం ఇయాసి లోయ, దాని సమీపంలోని పర్వత ప్రాంతాలుగా పేర్కొంటారు నిపుణులు. వీరు ఎక్కువగా పక్షుల ఈకలు, అడవుల్లో దొరికే వస్తువులను ఆభరణాలుగా ఉపయోగిస్తారు. అడవుల్లో జంతువులను వేటాడి వాటి మాంసాన్ని కాల్చుకొని తినడం వీరికి మహా ఇష్టం. అయితే నాగరిక మనుషులను వీరు ఆసక్తిగా గమనిస్తారు.
సెంటినెలీస్, అండమాన్
సెంటినలీస్ (Sentinelese).. ప్రపంచంలోనే అత్యంత అరుదైన అజ్ఞాత తెగ. బయటి ప్రపంచం గురించి తెలియదు. కనీసం దుస్తులు కూడా వేసుకోరు. దిగంబరంగా ఉంటారు. బాణాల ద్వారా జంతు వేట కొనసాగిస్తూ జీవిస్తారు. భిన్నమైన జీవనశైలి కారణంగా అండమాన్‌లోని సెంటినలీస్ తెగ ప్రజలు ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నారు. ఇప్పటి వరకు ఆధునిక ప్రపంచంతో కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. పైగా నార్త్ సెంటినెల్ అని పిలువబడే తమకే సొంతంగా భావించే దట్టమైన అడవిలోని ద్వీపంలో(small forested island) వీరు నివసిస్తున్నారు. ఇది దాదాపు మాన్ హాటన్ పరిమాణంలో ఉంది. అయితే అక్కడికి మనుషులు ఎవరూ వెళ్లరు. ఎందుకంటే సెంటినలీస్ తెగ ప్రజలు దాటి చేస్తారు. బయటి మనుషులను శత్రవులుగా చూస్తారు. జంతువులను, పక్షులను వేటాడి కాల్చుకొని తినడం వీరికి ఇష్టం.
కొరోవై ట్రైబ్, పాపువా న్యూ గినయా
కొరోవై ట్రైబ్ (Korowai Tribe).. ఈ మనోహరమైన ఆదిమ తెగ ఇటీవల పాపువా న్యూ గినియా (Papua New Guinea)లో కనుగొనబడింది. అయితే 1970ల వరకు వీరి గురించిన రికార్డులేవీ లేవు. వాస్తవానికి తాము తప్ప మరెవరూ ఉనికిలో లేరనే నమ్మకంతో వీరు ఉంటారని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ తెగ ప్రజలు దిగంబరంగా లేదా ఏదైనా చిన్నపాటి జంతు చర్మం లేదా గుడ్డను ధరించి ఉంటారు. అడవిలో 140 అడుగుల ఎత్తులో ఉండే పెద్ద పెద్ద చెట్లపై వీరు నివాసాలు ఏర్పర్చుకుంటారు. క్రూర మృగాలు, ప్రత్యర్థి గ్రామాల నుంచి తమను తాము రక్షించుకోవడానికి ఇలా చేస్తారు. వేట మాంసం, అటవీ ఉత్పత్తులే వీరి ప్రధాన ఆహారం.
సంబురు ట్రైబ్, కెన్యా
ఉత్తర కెన్యాలో మనోహరమైన భౌగోళిక ప్రాంతంగా పేర్కొనే సంబురు కౌంటీలో, భూమధ్య రేఖకు ఉత్తరాన సంబురు ట్రైబ్స్(Samburu Tribe) నివసిస్తుంటారు. కాగా వీరు తూర్పు ఆఫ్రికాలో నివసించే మాసాయి తెగకు దగ్గరి సంబంధం కలిగి ఉంటారని చెబుతారు. ఎందుకంటే ఈ రెండు తెగలు ఒకే భాష మాట్లాడుతాయి. మాసాయిల మాదిరి సాంబురు తెగ కూడా పాక్షిక సంచార జాతిగా ఉంది. ఈ తెగ ప్రజలు ఇప్పటికీ పురాతన ఆచారాలను అనుసరిస్తారు. పశువులను ముఖ్యంగా గొర్రెలు, ఒంటెలు, మేకలలను పెంచుకుంటారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సంచరిస్తూ ఉంటారు. తమను తాము లోకోప్ లేదా లోకాయిప్ అని పిలుచుకుంటారు.
మాసాయి, కెన్యా, టాంజానియా
ఆఫ్రికాలోని అరుదైన ఒక స్థానిక తెగగా మాసాయి (Maasai) ట్రైబ్స్ గుర్తింపు పొందింది. వీరిలో కెన్యా అండ్ ఉత్తర టాంజానియా (Tanzania) రెండింటిలోనూ స్థావరాలను ఏర్పర్చుకున్న పాక్షిక సంచార జనాభా (semi-nomadic populations) కూడా ఉంది. ఈ తెగ ప్రత్యేకమైన ఆచారాలు, సంప్రదాయాలు, వస్త్రధారణ కలిగి ఉంటారు. కాగా వీరు పొడవాటి కర్రలపై నిల్చుని నడవడాన్ని సరదాగా భావిస్తారు. దీనిని ఒక క్రీడగానూ భావిస్తారు. ఈ ప్రాంతంలోని జాతీయ ఉద్యానవనాలు, నిల్వలతో సన్నిహిత అనుబంధం కారణంగా వారికి అంతర్జాతీయ గుర్తింపు కూడా ఉంది. అటవీ ఉత్పత్తులను ఆహారాలుగా, ఆభరణాలుగా వాడుతారు.
యాంగ్ షువో కార్మోరెంట్స్, చైనా
నైరుతి చైనాలోని గ్వాంగ్జీ ప్రావిన్స్‌లో గల యాంగ్ షువో (Yang Shuo) కౌంటీ జువాంగ్, యావో, డాంగ్, మియావో వంటి తెగలకు నిలయంగా ఉంది. కాగా ఇక్కడ చాలా మంది యాంగ్ షువో హువా అని పిలువబడే మాండరిన్ మాండలికాన్ని మాట్లాడుతారు. ప్రస్తుతం యాంగ్ షువోలోని ట్రైబ్స్ 1,300 సంవత్సరాలక్రితం నాటి అంతరిస్తు్న్న ‘కార్మోరెంట్’ కళను రక్షిస్తు్న్నారని చెబుతారు. కార్మోరెంట్‌లతో చేపలు పట్టడం వీరికి చాలా ఇష్టం. అంటే యాంగ్ షువో ప్రజల ద్వారా చేపలను పట్టుకోవడానికి శిక్షణ పొందిన ఒక రకమైన పక్షిపేరు కార్మోరెంట్. ఇది పొడవాటి ముక్కు ద్వారా చేపలను పట్టి యజమానికి అందిస్తుంది. అంతేకాకుండా యాంగ్ షువోలోని తెగలు పండుగలు, ఆహారం, ఫ్యాషన్‌తో సహా స్థానిక సంస్కృతిని ప్రభావితం చేశాయి. ఈ ప్రాంతంలోని కొన్ని ప్రత్యేక ఆహారాలలో నియాంగ్ వంటకాలు, బీర్ ఫిష్, షాటియన్ షాడోక్స్, కుమ్‌క్వాట్స్, చెస్ట్‌నట్‌లు ఉన్నాయి. యాంగ్షువో ప్రజలు ఫిషింగ్ లాంతర్ ఫెస్టివల్ వంటి స్థానిక పండుగలను కూడా జరుపుకుంటారు.
కజఖ్ ట్రైబ్, మంగోలియా
మంగోలియా (Mongolia)లో నివసిస్తున్న కజఖ్‌లు (Kazakh Tribe) వాస్తవానికి విస్తృత సమాజంలో భాగం. నేటి కజకిస్తాన్‌లోని అటవీ ప్రాంతాల్లోనూ కజఖ్ ట్రైబ్స్ నివసిస్తుంటారు. అంటే మంగోలియా నివాసులందరూ మంగోలియన్ సంతతికి చెందిన వారు కాదు. చారిత్రాత్మకంగా, కజఖ్‌లు గుర్రపు స్వారీ సంప్రదాయం కలిగిన పాక్షిక సంచార తెగలుగా చెప్తారు. గుర్రాలపై వీరు ఉల్ పర్వతాలు, యురేషియాలోని ఉత్తర, మధ్య ఆసియాలోని వివిధ ప్రాంతాల్లో గుర్రాలను పోషించుకుంటూ, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సంచరిస్తూ జీవిస్తారు.
* భారత్‌లో తెగలు/గిరిజనులు
1991 రాయ్ బర్మన్ కమిషన్ లెక్కల ప్రకారం దేశంలో మొత్తం తెగల సంఖ్య 427, వారి జనాభా 6.776 కోట్లు (8.08%). ఇక 2011 జనాభా లెక్కల ప్రకారం.. దేశంలో గిరిజన తెగలు 573. జనాభా 10.43 కోట్లు (8.6%). ఇందులో పురుషులు 5.24 కోట్లు, స్త్రీలు 5.19 కోట్లు. 2011 జనాభా లెక్కల ప్రకారం.. ఉమ్మడి ఏపీలో గిరిజన జనాభా 59,18,073 (5.7%) కాగా, తెలంగాణలో మొత్తం తెగల సంఖ్య 32 కాగా గిరిజన జనాభా 32.87 లక్షలు (9.3%). అధికంగా ఉన్న గిరజన తెగలు లంబాడీలు (20,46,117), కోయ, (4,86,391). ఇక జనాభా, శాతం పరంగా అత్యధిక గిరిజనులు ఉన్న ప్రాంతం ఖమ్మం.
* నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా పలు అధ్యయనాల నుంచి సేకరించబడింది.
Read More...
మొహమాటం మోతాదు మించితే అంతే ఇక..!!