ఫార్వర్డ్ చేసిన మెసేజ్ ఎవరిది? ఒరిజినల్ సెండర్‌ను గుర్తించేలా వాట్సాప్‌లో కొత్త ఫీచర్!

by Javid Pasha |

ఫార్వర్డ్ చేసిన మెసేజ్‌లకు సంబంధించి, సెండర్‌ పేరు, నంబర్ ఆ మెసేజ్‌ను మొదట ఎవరు క్రియేట్ చేసి పంపారో ఆ వ్యక్తి పేరు కూడా తెలిసే అవకాశం ఉంది.

ఫార్వర్డ్ చేసిన మెసేజ్ ఎవరిది? ఒరిజినల్ సెండర్‌ను గుర్తించేలా వాట్సాప్‌లో కొత్త ఫీచర్!
X

దిశ, ఫీచర్స్ : ఎవరైనా మనకు వాట్సాప్‌‌లో మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే దానిని సెండ్ చేసిన వ్యక్తి పేరు మాత్రమే మనకు తెలుస్తుంది. ఎందుకంటే మెసేజ్ చాట్‌లో ఆ వ్యక్తి పేరు, నంబర్‌తోనే వస్తుంది. మెసేజ్ పైన ‘Forwarded’ లేబుల్ కనిపిస్తుంది. దీని అర్థం.. ఈ మెసేజ్‌ను ఆ వ్యక్తి తనంతట తాను రాయలేదు. వేరొకరి నుంచి తీసుకొని ఫార్వర్డ్ చేశారు. అంటే.. దానిని మొదట సెండ్ చేసిన అసలు వ్యక్తి(original sender)ఎవరో మనకు తెలియదు. ముఖ్యంగా చైన్ ఫార్వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరు పంపారో తెలిసే అవకాశం లేదు. అయితే ఇక నుంచి ఇలాంటి పరిస్థితికి చెక్ పెట్టేందుకు వాట్సాప్ సిద్ధం అవుతోంది. ఫార్వర్డ్ మెసేజ్‌ల విధానాన్ని మార్చే కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. ఆ వివరాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

వాట్సాప్ (beta testing) టెస్టింగ్ ఫీచర్ ప్రకారం.. ఫార్వర్డ్ చేసిన మెసేజ్‌ల(ముఖ్యంగా వాట్సాప్ బిజినెస్ యూజర్ల నుంచి వచ్చినవి)కు సంబంధించి, సెండర్‌ పేరు, నంబర్‌తోపాటు సదరు మెసేజ్‌ను మొదట ఎవరు క్రియేట్ చేసి పంపారో ఆ వ్యక్తి పేరు కూడా తెలిసే అవకాశం ఉంది. దీంతో చైన్ ఫార్వర్డింగ్‌ల విషయంలోనూ మెసేజ్‌ను క్రియేట్ చేసి పంపిన అసలు వ్యక్తి పేరు, ఫోన్‌నంబర్ కూడా తెలిసిపోతుంది. ప్రస్తుతం ఫార్వర్డ్ మెసేజ్‌లపై కేవలం “Forwarded” లేబుల్ మాత్రమే కనిపిస్తుండగా.. ఈ సరికొత్త మార్పుతో మెసేజ్ క్రియేట్ చేసిన అసలు వ్యక్తి(మూలం) వివరాలు సైతం తెలుస్తాయి. ప్రధానంగా స్పామ్ మెసేజ్‌లను, తప్పుడు సమాచారాన్ని తగ్గించడం కోసం, పారదర్శకత పెంచడం కోసం ఈ కొత్త ఫీచర్‌ను ప్రవేశ పెట్టేందుకు మెటా యాజమాన్యం ప్రాసెస్ స్టార్ట్ చేసింది.

ప్రయోజనాలు

టెస్టింగ్ దశలో ఉన్న వాట్సాప్ కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు ఏ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుని, నమ్మదగిన సోర్స్ నుంచి వచ్చినట్లు ధృవీకరించుకునే వీలుంటుంది. బిజినెస్ చాట్స్‌లో ఇది మరింత ఉపయోగపడుతుంది. ఇప్పటికే కొంతమంది యూజర్లు ఈ మార్పును గమనించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా ఈ ఫీచర్(beta testing) అందుబాటులోకి వస్తే, వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియాలో వైరల్ అయ్యే తప్పుడు సమాచారాన్ని నియంత్రించడంలో సహాయపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

ప్రైవసీ ఆందోళనలు

వాట్సాప్ కొత్తగా ప్రవేశ పెట్టనున్న బీటా టెస్టింగ్ ఫీచర్‌పై అనుమానాలు, విమర్శలు సైతం వ్యక్తం అవుతున్నాయి. ఫార్వర్డ్ చేసేటప్పుడు అసలు సెండర్ వివరాలు బయట పడటంవల్ల వ్యక్తిగత సమాచారం ఎక్కువమందికి చేరవచ్చునని యూజర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెడ్డిట్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో ఇది ఇప్పటికే చర్చనీయాంశంగా మారింది. చాలామంది “privacy loss”గా పేర్కొంటున్నారు. అయితే వాట్సాప్ ఇంకీ ఫీచర్‌ను రోల్ అవుట్ చేయలేదు. ఇంకా టెస్టింగ్ స్టేజ్‌లోనే ఉంది కామట్టి అమలులోకి వస్తే ఏం జరుగుతుంది? యూజర్లు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరమైన అంశంగా మారింది. ఈ మార్పు భద్రత, పారదర్శకతవైపు కోసం ఉద్దేశించినది అయినప్పటికీ, ప్రైవసీ బ్యాలెన్స్ ముఖ్యం అంటున్నారు చాలామంది.

Next Story