మాస్టోడాన్.. మరో ట్విట్టర్! వారం రోజుల్లోనే 176 వేల యూజర్స్ సొంతం

by Disha Web Desk 12 |
మాస్టోడాన్.. మరో ట్విట్టర్! వారం రోజుల్లోనే 176 వేల యూజర్స్ సొంతం
X

దిశ, ఫీచర్స్ : ట్విట్టర్‌ పిట్టను ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఎంతోమంది వినియోగదారులు మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌కు ప్రత్యామ్నాయాలుగా ఉన్న.. కూ, రెడిట్, టంబ్లర్‌‌కు లాగిన్ అవుతున్నారు. అయితే ప్రత్యేకించి 'మాస్టోడాన్' ఎక్కువమంది దృష్టిని ఆకర్షించగా, ఇది కేవలం వారం రోజుల్లోనే 176వేల మంది కొత్త యూజర్స్‌ను పొందింది. ఓపెన్ సోర్స్, డీసెంట్రలైజ్డ్ నెట్‌వర్క్‌గా పేర్కొంటున్న 'మాస్టోడాన్'.. తమ యాజమాన్యంలో ఉన్న పేరెంట్ సర్వర్‌కు బదులుగా సొంత సర్వర్‌లను సృష్టించడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.ముఖ్యంగా డేటా నియంత్రణ, డేటా ఓనర్‌షిప్ యూజర్స్ చేతిలో ఉండగా, కంటెంట్ నియంత్రణ, ప్రవర్తనా నియమావళి, సర్వీస్ రూల్స్, ప్రైవసీ టర్మ్స్ మొదలైన విధివిధానాలు కంపెనీ చేతిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ 'మాస్టోడాన్' వివరాలతో పాటు.. ఇది ఎలా పని చేస్తుంది? ట్విట్టర్‌తో ఎందుకు పోలుస్తున్నారు? తెలుసుకుందాం.

అందరూ ఊహించినట్లుగానే ట్విట్టర్‌ను హస్తగతం చేసుకున్న ఎలన్ మస్క్.. అందరి ఆమోదం పొందిన సమగ్ర ప్రజావేదిక అవసరమని ప్రకటించాడు. అంతేకాదు ఫ్రీ ఆఫ్ స్పీచ్ భావనలతో పాటు అతని నిర్ణయాలపై ప్రజలు సందేహాస్పదంగా ఉండటంతో ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయ వేదికల వైపు వెళ్తున్నారు. అందులో 'మాస్టోడాన్' ఒకటి కాగా ట్విట్టర్ మాదిరిగానే ఇది కూడా ఒక ఓపెన్ సోర్స్ మైక్రోబ్లాగింగ్ సోషల్ నెట్‌వర్క్. జర్మన్ డెవలపర్ యూజెన్ రోచ్‌కో ద్వారా అక్టోబర్ 2016లో ప్రారంభమైన ఈ ప్లాట్‌ఫామ్ 2017లో వైరల్‌గా మారింది. ఎవరైనా సరే ఇక్కడ తమ ప్రొఫైల్స్ రూపొందించుకుని, సందేశాలను పోస్ట్ చేయడం సహా ఫోటోలు లేదా వీడియోలను షేర్ చేసుకోవచ్చు. అలానే ఇతర వ్యక్తుల అకౌంట్స్ ఫాలో కావచ్చు. ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను వెబ్ బ్రౌజర్‌ లేదా స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్‌లో ఉపయోగించవచ్చు.

ఇక ట్విట్టర్‌లో మనం చేసే పోస్ట్‌లను ట్వీట్స్ అన్నట్లుగానే ఇందులో పోస్ట్‌ను 'టూట్'గా పిలుస్తారు. రీట్వీట్స్‌ను 'బూస్ట్‌'గా పిలుస్తుండగా.. 'టూట్' పరిమితి 500 అక్షరాలుగా నిర్ణయించారు. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే.. టైమ్‌లైన్ వ్యూ, సున్నితమైన కంటెంట్‌ను బ్లాక్ చేయడం, కంటెంట్ హెచ్చరికలు వంటి మోడరేషన్ ఫీచర్స్‌కు మద్దతుతో సహా ట్విట్టర్‌లో ఉన్న మిగతా ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి. వాస్తవానికి 2019లో కంటెంట్ మోడరేషన్ పక్షపాతంపై ట్విట్టర్‌ను విమర్శించిన భారతీయ వినియోగదారులు ఎంతోమంది 'మాస్టోడాన్‌' అకౌంట్స్ ఓపెన్ చేయగా.. మళ్లీ ఇప్పుడు ఎలన్ మస్క్ దెబ్బతో అటువైపు వలస పోతున్నారు.

ఎలా పని చేస్తుంది?

'మాస్టోడాన్' సాఫ్ట్‌వేర్ ఓపెన్ సోర్స్ కాగా ఇది వరల్డ్ వైడ్ వెబ్ కన్సార్టియం (వెబ్ కోసం ప్రమాణాలను నిర్వహించే అదే సంస్థ) ద్వారా అభివృద్ధి చేసిన యాక్టివిటీ పబ్ (ActivityPub) అనే ఓపెన్ సోర్స్ సోషల్ నెట్‌వర్కింగ్ ప్రోటోకాల్‌పై ఆధారపడింది. వ్యక్తులు లేదా కంపెనీలు వ్యక్తిగత 'మాస్టోడాన్' సర్వర్‌లపై పూర్తి నియంత్రణను కలిగి ఉంటారు. అయితే సాంప్రదాయ వెబ్‌సైట్ లాగానే యూజర్స్ 'మాస్టోడాన్‌'లో సైన్ అప్ చేస్తారు. సందేశాలను పోస్ట్ చేస్తారు. చిత్రాలను అప్‌లోడ్ చేస్తారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. అదేవిధంగా 'ఇన్‌స్టాన్సెస్' అని పిలిచే పెద్ద సంఖ్యలో ఉన్న కమ్యూనిటీల ద్వారా సెల్ఫ్ హోస్ట్ చేసుకోవచ్చు. ఈ మేరకు 'మాస్టోడాన్' సోషల్ నెట్‌వర్క్‌లో చేరిన వ్యక్తి వివిధ నోడ్స్(కమ్యూనిటీ)లోని వినియోగదారులతో పరస్పరం సంభాషించుకునే అవకాశముంటుంది. ఉదాహరణకు రెడిట్ చూసుకుంటే.. అందులో సబ్ రెడిట్స్ ఉన్నట్లే ఇక్కడ కమ్యూనిటీలు లేదా నోడ్స్ ఉంటాయి.

అవి ఒక్కొక్కటి పర్టిక్యులర్ టాపిక్‌( LGBTQ+, కళ, సంగీతం, ప్రాంతం)గా అంకితం చేయబడ్డాయి. అంతేకాదు మీకు వ్యాపారం లేదా సంస్థ ఉన్నట్లయితే.. 'మాస్టోడాన్' సోషల్ నెట్‌వర్క్ ఆధారంగా మీ సొంత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను హోస్ట్ చేయవచ్చు. ఇది మీ కమ్యూనిటీని డీసెంట్రలైజేషన్ పద్ధతిన నిర్వహించడంలో సహాయం చేస్తుంది. ఇది ఏ ఒక్క కంపెనీ పై ఆధారపడదు. ట్విట్టర్ మాదిరి ఒకే సంస్థతో నియంత్రించబడదు. ఇక పబ్లిక్ మెసేజ్‌లు టైమ్‌లైన్ అని పిలిచే గ్లోబల్ ఫీడ్‌లో ప్రదర్శితమైతే, ప్రైవేట్ సందేశాలు వినియోగదారుల ఫాలోవర్స్ టైమ్‌లైన్‌లలో మాత్రమే భాగస్వామ్యం చేయబడతాయి. వినియోగదారులు తమ ఖాతాలను పూర్తిగా ప్రైవేట్‌గానూ పెట్టుకునే అవకాశముంది.

ఎలా చేరాలి?

సాధారణంగా మాస్టోడాన్ ఉపయోగించడానికి ఉచితమే అయినా.. సైన్అప్ కోసం ఓపెన్, ఇన్విటేషన్, అప్రూవల్ అనే మూడు రకాల మోడ్స్‌ ఉన్నాయి.

ఓపెన్ సైన్ అప్..

వినియోగదారుడి పేరు, ఈ-మెయిల్ అడ్రస్, పాస్‌వర్డ్‌తో రిజిస్ట్రేషన్‌ని పూర్తి చేసి ఎకౌంట్ ఓపెన్ చేయొచ్చు.

ఇన్విటేషన్..

కొన్ని సర్వర్స్‌లో రిజిస్ట్రేషన్ ఫామ్‌‌ అనుమతించడదు. అందుకు బదులుగా ఇన్విటేషన్ లింక్స్ ద్వారానే సైన్‌అప్ చేయాల్సి ఉంటుంది.

అప్రూవల్..

మరికొన్ని సర్వర్స్ విషయానికి వస్తే రిజిస్ట్రేషన్ ఫామ్‌ను ఫిల్ చేసేందుకు యాక్సెస్ అందిస్తూనే.. మీరు ఆ వెబ్‌సైట్‌లో ఎందుకు చేరాలనుకుంటున్నారో తెలిపేందుకు మరో ఎంట్రీ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీరు ఫామ్‌ సమర్పించిన తర్వాత దాన్ని ఉపయోగించడం ప్రారంభించే ముందు మీ అకౌంట్‌‌ను మోడరేటర్ తప్పనిసరిగా ఆమోదించాలి.

యూజర్ నేమ్..

ఇక యూజర్ నేమ్ విషయానికొస్తే 'మాస్టోడాన్' వినియోగదారు పేర్లు వాస్తవానికి రెండు భాగాలను కలిగి ఉంటాయి. సర్వర్ అడ్రస్, వినియోగదారుడి పేరును కలిగి ఉంటుంది.

లోకల్ యూజర్ నేమ్ : లెనిన్

వెబ్‌సైట్ డొమైన్ : example.com

ఒకవేళ మాస్టోడాన్‌లో మీరు అదే సర్వర్‌లోని వ్యక్తులతో కమ్యూనికేట్ అయ్యేందుకు డొమైన్ లేకుండానే చాట్ చేయొచ్చు. కానీ ఇతర సర్వర్‌లోని యూజర్స్‌తో కమ్యూనికేట్ కావాలంటే డొమైన్‌ నేమ్ కూడా చేర్చాలి. ఉదాహరణకు I'm @[email protected] on Mastodon లేదా I'm https://example.com/@Lenin on Mastodon!

టూట్..

మాస్టోడాన్ వినియోగదారులు టూట్ విషయంలో 'పబ్లిక్', 'ప్రైవేట్', 'డైరెక్ట్' అనే మూడు ఆప్షన్స్ ఎంచుకునే వీలుంటుంది. పబ్లిక్ టూట్స్‌లో అందరకీ షేర్ చేసే అవకాశం ఉంటే, ప్రైవేట్‌లో కేవలం మన ఫాలోవర్స్‌కు మాత్రమే టూట్ సెండ్ అవుతుంది. ఇక డైరెక్ట్ టూట్‌ విషయానికి వస్తే.. మీరు టూట్‌లో పేర్కొన్న యూజర్స్‌కు మాత్రమే డైరెక్ట్ టూట్ చేయొచ్చు. ప్రపంచ వ్యాప్తంగా బిలియన్ల కొద్దీ ఆండ్రాయిడ్ వినియోగదారులకు అధికారికంగా ఇటీవలే ఇది అందుబాటులోకి వచ్చిన 'మాస్టోడాన్' యాప్.. ప్లే స్టోర్‌లో ఉచితం కాగా ఆండ్రాయిడ్ 6.0 అంతకంటే ఎక్కువ వెర్షన్‌లో రన్ అవుతుంది.

Next Story