గర్భనిరోధక మాత్రలతో క్యాన్సర్ వస్తుందనడం మూఢనమ్మకమే!!

by Disha Web |
గర్భనిరోధక మాత్రలతో క్యాన్సర్ వస్తుందనడం మూఢనమ్మకమే!!
X

దిశ, ఫీచర్స్ : మనం సైన్స్, టెక్నాలజీ, మెడిసిన్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆధునిక ప్రపంచంలో జీవిస్తున్నాం. కానీ దురదృష్టవశాత్తు బేసిక్ సెక్స్ ఎడ్యుకేషన్ లేని కారణంగా మనదేశంలో పునరుత్పత్తి గురించి ఇప్పటికీ అనేక అపోహలు ఉన్నాయి. ఇలాంటి విషయాల్లో మహిళలు ఇంకా నిషేధాలకు గురవుతున్నారు. బరువుగా లేదా సన్నగా ఉంటే పిల్లలను కనలేరు? పీరియడ్స్ టైమ్‌లో గర్భం దాల్చలేరు? గర్భనిరోధక మాత్రలతో క్యాన్సర్ వస్తుంది? అనే మూఢనమ్మకాలతో స్త్రీలను ఇబ్బందులు పెడుతున్నారు. స్వేచ్ఛగా గర్భం దాల్చనివ్వరు.. శరీరం సహకరించట్లేదని చెప్పినా గర్భస్రావానికి అనుమతించరు.. ప్రకృతి ధర్మాలను అర్థం చేసుకోరు.. సైంటిఫిక్‌గా ప్రూవ్ అయిందని చెప్పినా వినిపించుకోరు.. అలాంటి వాటిలో కొన్ని అపోహల గురించి తెలుసుకుందాం.

ఆధునిక కాలంలోనూ ఆ నమ్మకాలా?

సైన్స్, టెక్నాలజీ, వైద్యం, ఆరోగ్యం, మెడిసిన్ రంగాలు వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ఆధునిక కాలంలో మనం జీవిస్తున్నాం. అదే సమయంలో మన చుట్టూ ఉండే సమాజంలో కనీస ప్రాథమిక లైంగిక పరిజ్ఞానం లేని ఎంతో మందిని చూస్తుంటాం. ఎందుకంటే చాలామంది మానవ పునరుత్పత్తి వ్యవస్థ, లేదా సంతానం, వ్యక్తిగత జీవితం వంటి అంశాల్లో ఇప్పటికీ పాతకాలపు పద్ధతులే వాస్తవమని భ్రమ పడుతుంటారు. ఇప్పటికీ ఎవరో ఒకరు చెప్పింది విని నమ్మేస్తుంటారు తప్ప అది వాస్తవమా కాదా? అని ఆలోచించే వారు తక్కువ. ఒక విధంగా చెప్పాలంటే మహిళల రీప్రొడెక్టివ్ విషయంలో సమాజంలో చాలామందిలో అపోహలున్నాయి. అవి వారి ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తున్నాయి. రీప్రొడక్టివిటీకి సంబంధించిన అవగాహన రాహిత్యం, అపోహలు, సంప్రదాయాలు, పురాణ కథలు చాలామందిని భ్రమల్లో ఉంచుతున్నాయి. అవి ఏ విధంగా నేటి మహిళలను సైతం ఇబ్బందులకు గురిచేస్తున్నాయో తెలుసుకునేందుకు ప్రసూతి వైద్యులు, గైనకాలజిస్టులు, ఫెర్టిలిటీ స్పెషలిస్టులు కలిసి నిర్వహించిన ఒక అధ్యయనంలో అనేక విషయాలు వెల్లడయ్యాయి. ప్రధానంగా మహిళలు ఆరోగ్యం, ఫిట్‌నెస్, సంతానం వంటి అంశాలపై అనేక సందేహాలు, అనుమానాలు కలిగి ఉంటున్నారు. వాస్తవాలకంటే కట్టుకథలు, భ్రమలనే నమ్ముతున్నారు.

అధిక బరువు రీప్రొడక్టివిటీకి ఆటంకమా?

మహిళలు లావుగా, అధిక బరువు కలిగి ఉండటం వలన పిల్లలు కలగరనే అపోహ చాలామందిలో ఉంటుంది. కానీ నిజం కాదంటున్నారు నిపుణులు. ఎంతో మంది లావుగల లేదా అధికబరువున్న వారు కూడా పిల్లాపాపలతో హ్యాపీగా జీవిస్తున్నారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే అధికబరువు, తక్కువ బరువు లేదా లావుగా, సన్నగా ఉండటం అనేది సంతానం విషయంలో ఎటువంటి ప్రభావాన్ని కలిగించదు. కొన్ని అరుదైన సందర్భాల్లో అది ఇతర అనారోగ్యాలకు ఏమైనా దారి తీయవచ్చునేమో కానీ రీప్రొడక్టివిటీకి అధికబరువుకు సంబంధం లేదు.

ధూమపానం, మద్యపానం ఎఫెక్ట్?

కానీ పలు అధ్యయనాల ప్రకారం ధూమపానం, మద్యపానం ఈరోజుల్లో సాధారణ చర్యలుగా మారాయి. ఈ అలవాట్లు సంతానంపై ప్రభావం చూపుతున్నాయి. మహిళల్లోను, పురుషుల్లోను సంతానోత్పత్తి సమస్యకు దారి తీస్తున్నాయి. అంటే ఆరోగ్యదాయకం కాని జీవన విధానం, చెడు అలవాట్ల వల్ల సాధారణ సంతాన అర్హతను కోల్పోతున్నారు. మద్యం, పొగాకు ఉత్పత్తుల వంటి దురలవాట్లు ఫెర్టిలిటీ సమయంలో మహిళల్లో రిలీజ్ అయ్యే అండాశయాలపై దుష్ర్పభావాలు చూపుతున్నాయి. అండాల ఉత్పత్తి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఈ కారణంగా పలువురిలో రీప్రొడక్టివిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కానీ మహిళల ప్రవర్తన, శారీక ఆకృతిని బట్టి మాత్రం కాదు.

కవలలు పుట్టడానికి కారణం అదేనా?

చాలామంది మహిళల్లో లేదా పెద్దల్లో ఇప్పటికీ కవల పిల్లలు ఎందుకు పుడతారనే అవగాహన ఉండదు. సహజంగా ట్విన్స్ పుట్టరని ఐవీఎఫ్ ద్వారా గానీ, అదృష్టంవల్ల గానీ మాత్రమే పుడతారని అనుకుంటుంటారు. కానీ ఇది వాస్తవం కాదు. సాధారణ లైంగిక జీవితం వల్లనే కవలలు పుడతారు.

పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్

మహిళల్లో సహజంగా ఉండే ప్రకృతి ధర్మమే రుతుస్రావం. ఇప్పటికీ పలువురు దీనిని అశుభ సూచకంగా, అపరిశుభ్రతకు మారుపేరుగా, అంటరాని చర్యగా చూస్తుంటారు. అందుకే ఆ సమయంలో మహిళలు ఇంట్లో వంట చేయకూడదని, దేవుడి గదిలోకి వెళ్లకూడదని, ఇంట్లో వస్తువులను తాకరాదని కొందరు హెచ్చరికలు జారీ చేస్తుంటారు. కానీ ఇది అపోహ మాత్రమే. పీరియడ్స్ అనేవి స్త్రీలకు అవసరమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి కామన్ హెల్త్ ప్రాసెస్. ఇది మహిళ శరీరాన్ని గర్భధారణకోసం సిద్ధం చేసే ప్రక్రియ కూడా. పీరియడ్‌ను అపవిత్ర చర్యగా భావించాల్సిన అవసరం లేదు. ఇది మహిళల రీప్రొడక్టివ్ సిస్టమ్‌కు సంబంధించిన సాధారణ ప్రక్రియ మాత్రమే. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లోను, పట్టణాల్లోను పీరియడ్స్ టైమ్‌లో మహిళలపై వివిధ నిషేధిత నిబంధనలు కొనసాగుతున్నాయి. కానీ సైన్స్ ఇలాంటి మూఢనమ్మకాలను తిప్పికొడుతుంది. పీరియడ్ అనేది అపవిత్రం లేదా అశుభమైనది కానే కాదని సైన్స్ తేల్చి చెప్పింది. ఎప్పటిలాగే పీరియడ్ సమయంలో కూడా మహిళలు అన్ని పనులు చేయవచ్చు. ఆలయాలను సందర్శించవచ్చు అని సైంటిస్టులు చెప్తున్నారు.

ఆ సమయంలో గర్భం రాదా?

పీరియడ్స్‌లో గర్భం దాల్చడం అసాధ్యమని కొందరు అవగాహన రాహిత్యంతో వాదిస్తుంటారు. కానీ పీరియడ్ సమయంలో స్త్రీ గర్భం దాల్చగలదు. ఒక మహిళ లేదా అమ్మాయిలో పీరియడ్స్ సమయంలోనే అండాలు విడుదలవుతుంటాయి. ఈ కారణంగా కూడా బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. నెలసరి క్రమంలో సంతానోత్పత్తికి సంబంధించిన అండాలు విడుదల అవడం మహిళల్లో సహజమైన ప్రక్రియగా ఉంటుంది.

గర్భనిరోధక మాత్రలతో క్యాన్సర్?

మరో అపోహ ఏమిటంటే గర్భనిరోధక మాత్రలు తీసుకోవడంవల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని అనుకుంటుంటారు. కానీ ఇది వాస్తవం కాదు. అది సైంటిఫిక్ మెథడ్. గర్భాన్ని నిరోధించాలనుకున్నప్పుడు మహిళలు వాడవచ్చు. ప్రపంచవ్యాప్తంగా 200 మిలియన్ల మంది మహిళలు నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధక మాత్రలను ఉపయోగిస్తున్నారని అధ్యయనాలు చెప్తున్నాయి. ఇవి సురక్షితమైనవే కానీ క్యాన్సర్‌ కారకాలు కావని చెప్పడానికి ఎటువంటి సైంటిఫిక్ ఎవిడెన్సులు, అధ్యయనాలు లేవు. పైగా ఈ మాత్రలతో అండాశయ, గర్భాశయ క్యాన్సర్లు దూరం అవుతాయి. అదే విధంగా మహిళలు యోని లోపలి భాగాన్ని శుభ్రం చేసుకుంటేనే శుభ్రంగా ఉన్నట్టు అని కొందరు అపోహ పడుతుంటారు. కానీ యోని అనేది స్వీయ పరిశుభ్రత లక్షణం గల అవయవం. కాబట్టి డౌచింగ్ అవసరం లేదు. ఇది ఇన్ఫెక్షన్ల ప్రభావాన్ని పెంచుతుంది.


Next Story