మనుషుల మాదిరే కలలు కంటున్న సాలీళ్లు..

by Disha Web Desk 6 |
మనుషుల మాదిరే కలలు కంటున్న సాలీళ్లు..
X

దిశ, ఫీచర్స్ : నిద్రిస్తున్నపుడు మనుషులే కాకుండా కుక్కలు, పక్షులు సహా మరిన్ని జంతువులు కూడా 'రాపిడ్ ఐ మూవ్‌మెంట్(REM)' చేస్తాయి. అయితే కొత్త అధ్యయనం ప్రకారం, సాలెపురుగులు కూడా నిద్రలో కంటి కదలికలను వేగంగా మారుస్తాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. కలలు కనేందుకు సంబంధించిన ఈ స్లీపింగ్ స్టేజ్.. ఆయా జీవుల నిద్రపై శాస్త్రవేత్తల అవగాహనను మెరుగుపరచనుంది.

జర్మనీ, కాన్‌స్టాంజ్ యూనివర్సిటీకి చెందిన బిహేవియరల్ ఎకాలజిస్ట్ డానియెలా సి. రోస్లర్, తన సహచరులతో కలిసి రాత్రిపూట ఇన్‌ఫ్రారెడ్ కెమెరాలతో బేబీ జంపింగ్ స్పైడర్స్(ఎవర్చా ఆర్కువాటా) వీడియోలను రికార్డ్ చేశాడు. ఈ సందర్భంగా అవి హ్యూమన్ స్లీపింగ్ సైకిల్ వంటి లక్షణాలను ప్రదర్శించాయని కనుగొన్నారు. క్రమానుగతంగా సాలె పురుగులు 'రెటీనా ట్యూబుల్స్'గా పిలువబడే వాటి కంటి భాగాలను తిప్పడం, వంకరగా మార్చడాన్ని పరిశీలించారు. ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ లేదా REM నిద్రను అనుభవిస్తున్నాయని సూచించేందుకు ఇదే నిదర్శనం. ప్రతీ 15-20 నిమిషాలకు సంభవించే REM స్లీపింగ్ పీరియడ్ ఒక్కోటి దాదాపు 90 సెకన్ల పాటు ఉంటుంది.

అయితే శరీరం వృద్ధి చెందే దశలోని బేబీ స్పైడర్స్ శరీర భాగాలు పారదర్శకంగా కనిపించడం వల్లే ఈ కదలికలను గుర్తించడం సాధ్యపడింది. కాగా ఈ పరిశోధన.. మానవులు, ఇతర వెన్నుపూస జీవజాతులు అనుభవించే REM నిద్ర లాంటి స్థితిని జంపింగ్ స్పైడర్స్ కూడా అనుభవించవచ్చని సూచిస్తోంది.

'కళ్ల కదలిక ద్వారా మాత్రమే REM నిద్రను గుర్తిస్తాం. అయితే కీటకాలు, ఆర్థ్రోపోడ్స్‌కు కదిలే కళ్లు లేనందున ఇది జంతు రాజ్యంలో ఎంత విస్తృతంగా ఉందో గుర్తించడం పరిశోధకులకు కష్టం. REM స్థితిలో ఉంటున్నాయంటే అవి కూడా కలలు కంటున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కానీ శాస్త్రీయంగా నిరూపించాలంటే మరింత సమయం పట్టొచ్చని అభిప్రాయపడ్డారు. అయితే సాలీడు నిద్రపోయేటప్పుడు, మేల్కొనే సమయంలో కంటి కార్యకలాపాలను గమనిస్తే.. సాలెపురుగులు పగటిపూట ఏదో ఒక కార్యాచరణ గురించి కలలు కంటున్నాయని సూచించవచ్చు. ఉదాహరణకు : ఈగను చూసినప్పుడు సాలీడు కంటి కదలికలు, నిద్రలో దాని కంటి కదలికలతో సరిపోలితే.. సాలీడు ఈగను చూడాలని కలలు కంటున్నదని అర్థం. కలల గురించి మాట్లాడకుండా REM నిద్ర గురించి మాట్లాడటం కష్టం' అని డాక్టర్ రోస్లర్ చెప్పారు.


Next Story

Most Viewed