అంతరిక్షంలో అద్భుతం.. రెండు ఐస్ ప్లానెట్స్ ఢీకొనడాన్ని గమనించిన సైంటిస్టులు

by Anjali |
అంతరిక్షంలో అద్భుతం.. రెండు ఐస్ ప్లానెట్స్ ఢీకొనడాన్ని గమనించిన సైంటిస్టులు
X

దిశ, ఫీచర్స్: రెండు వాహనాలు ఢీ కొంటే యాక్సిడెంట్ అవుతుంది. దీనివల్ల జరిగే పరిణామాలేమిటో మనకు తెలిసిందే. కానీ అంతరిక్షంలో రెండు వేర్వేరు గ్రహాలు ఢీకొంటే ఏం జరుగుతుందనేది మాత్రం ఎవరికీ తెలియదు. కానీ ఇటీవల సైంటిస్టులు ఇది గమనించారు. పరిశోధనలో భాగంగా జేమ్స్ వెబ్ టెలిస్కోప్‌ ద్వారా అంతరిక్షాన్ని చూస్తున్నప్పుడు సూర్యుడి లాంటి ఒక కొత్త నక్షత్రాన్ని గుర్తించారు. దానికి ‘ASASSN-21qj’ అని పేరు పెట్టారు. ఆ తర్వాత కొద్ది రోజులకు దాని చుట్టూ ఉన్న రెండు మంచు దిగ్గజాలు(ice giants) ఢీకొనడం కూడా తాము గమనించామని, ఆ సందర్భంలో వేడి, కాంతి, దుమ్ము, ధూళి వంటివి ఒక్కసారిగా వలయంలా అలముకున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ‘నిజాయితీగా చెప్పాలంటే.. ఈ పరిశీలన నాకు పూర్తి ఆశ్చర్యాన్ని కలిగించింది’ అని లైడెన్ యూనివర్సిటీకి చెందిన ప్రధాన అంతరిక్ష పరిశోధకుడు డాక్టర్ మాథ్యూ కెన్‌వర్తీ అన్నాడు.

మొదటిసారి అంతరిక్షంలో సూర్యడివంటి ఒక కొత్త నక్షత్రానికి సంబంధించిన ప్రకాశవంతమైన కాంతి వక్రతను గమనించిన ఖగోళ శాస్త్రవేత్తలు, మరింత విశ్లేషించేందుకు ఇతర టెలిస్కోప్‌ల నెట్‌వర్క్‌తో చూడటం ప్రారంభించారు. అయితే ఆప్టికల్ క్షీణతకు వెయ్యి రోజుల ముందు పరారుణ కాంతిలో ఈ నక్షత్రం ప్రకాశవంతంగా ఉందని గుర్తించారు. దీని కాంతి మసకబారడం ప్రారంభించడానికి మూడు సంవత్సరాల ముందు, పరారుణ తరంగదైర్ఘ్యాల వద్ద నక్షత్ర వ్యవస్థ బ్రైట్‌నెస్‌లో ఎలా రెట్టింపు అయిందో ఎనలైజ్ చేశారు. అదే సందర్భంలో అక్కడ ఇన్‌ఫ్రారెడ్ గ్లోను ఉత్పత్తి చేసే రెండు భారీ మంచు గ్రహాలు ఢీకొనడాన్ని గుర్తించిన పరిశోధకులు ఆ ఘటన తమను ఆశ్యర్యానికి గురిచేసిందని చెప్తున్నారు.

ఈ ఐస్ జెయింట్ ప్లానెట్స్‌ హైడ్రోజన్, హీలియం, ఆక్సిజన్, కార్బన్, నైట్రోజన్, సల్ఫర్ వంటి భారీ మూలకాలతో కూడి ఉన్నట్లు కనుగొన్నారు. కాగా సాటర్న్ లేదా బృహస్పతి వంటి గ్యాస్ జెయింట్ గ్రహం మాదిరి కాకుండా, కొత్తగా ఢీకొన్న గ్రహాల్లో వాయువు పరిమాణం కంటే కూడా రాతి, మంచుతో కూడిన కోర్లు అధికంగా ఉన్నాయి. వాస్తవానికి సౌర వ్యవస్థలో రెండు మంచు దిగ్గజాలు ఉన్నాయి. ఒకటి యురేనస్, రెండవది నెప్ట్యూన్. కానీ కొత్తగా ఢీకొన్న ఈ రెండు గ్రహాలను గమనించడం ఇదే మొదటిసారి. వాటిపై మరిన్ని పరిశోధనలు అవసరమని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు.



Next Story