గూగుల్ సెర్చ్‌లో' గృహ హింస‌..' కొత్త స్ట‌డీలో ఆస‌క్తిక‌ర విష‌యం!

by Disha Web Desk 20 |
గూగుల్ సెర్చ్‌లో గృహ హింస‌.. కొత్త స్ట‌డీలో ఆస‌క్తిక‌ర విష‌యం!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః నాలుగు గోడ‌ల మ‌ధ్య జ‌రిగే చాలా విష‌యాలు బ‌య‌ట ప్ర‌పంచానికి తెలియ‌వు. అందుకే, స్త్రీల‌పై జ‌రిగే లైంగిక వేధింపులు, గృహ హింస వంటి చాలా నేరాలు, మ‌రెన్నో మ‌నో వేద‌న‌లు ఆ నాలుగు గోడ‌ల మ‌ధ్య‌నే స‌మాధి అవుతుంటాయి. ఇలా పోలీసు స్టేష‌న్‌లో, లేదంటే ఇత‌రత్రా సామాజిక సంఘాల్లో వీటిపై అతి త‌క్కువ స‌మాచారం ఉన్న‌ప్పుడు స‌మాజంలో పెద్ద ఎత్తున జ‌రుగుతున్న గృహ హింస‌ను ఎలా ప‌సిగ‌ట్టాలి? భాధితుల‌ను గుర్తించేదెలా..? ఈ అంశంలో ఇంట‌ర్నెట్ సెర్చ్ కీల‌కంగా మారుతుందంటున్నారు ప‌రిశోధ‌కులు. గృహ హింస‌ను ట్రాక్ చేయడానికి, ముఖ్యంగా సంక్షోభ సమయంలో Google Search సమర్థవంతమైన సాధనంగా పనిచేస్తుంద‌ని ఒక అధ్యయనం తెలిపింది. కొన్ని 'సెర్చింగ్‌ కీవోర్డ్స్‌'లోని కీలక పదాలు అటువంటి సంఘటనలను అంచనా వేయగలవని అధ్యయనం సూచించింది. ఇలాంటి సంఘటనలను సమయానికి పరిష్కరించడానికి అధికారులకు ఇవి సహాయపడ‌వ‌చ్చ‌ని అధ్య‌య‌నం పేర్కొంది.

2020లో విజృంభించిన కరోనా వైరస్ (COVID-19) వ్యాప్తి కారణంగా ప్ర‌పంచంలో చాలా దేశాలు లాక్‌డౌన్‌లు విధించాయి. ఈ సమయంలో, గృహ హింస రేటు పెరిగిందని చెబుతూ చాలా నివేదికలు వెలువడ్డాయి. అలాగ‌ని, మహమ్మారికి ముందు మహిళలు, బాలికలపై అన్ని రకాల హింసలు లేక‌పోలేదు. మహమ్మారి సమయంలో ఇటువంటి సంఘటనలు తీవ్రమయ్యాయని డేటా చెబుతోంది. ఇప్పుడు, యూరోపియన్ జర్నల్ ఆఫ్ పాపులేషన్‌లో తాజాగా ప్రచురించిన అధ్యయనం ప్ర‌కారం, కోవిడ్ వ్యాప్తి కాలం వంటి సంక్షోభ సమయాల్లో సెర్చ్ ఇంజిన్ ద్వారా స‌హాయం చేయ‌వ‌చ్చు. ఇలా ట్రాక్ చేయవ‌చ్చ‌నే విష‌యంలో నమ్మదగిన డేటా మూలాలు ఒక‌ప్పుడు లేవ‌ని అధ్యయనం పేర్కొంది.

దీనికి సంబంధించి, తొమ్మిది గృహ హింస సంబంధిత కీలక పదాలను ఉప‌యోగించి గూగుల్ సెర్చ్‌ల‌ మధ్య సంబంధాలను ప‌రిశోధ‌కులు విశ్లేషించారు. ఇందులో భాగంగా, ఇటాలియన్ గృహ హింస హెల్ప్‌లైన్ 1522కి, లోంబార్డీలోని ఎమర్జెన్సీ నంబర్ 112కి వచ్చిన కాల్స్‌ను విశ్లేషించారు. వీటి నుండి కొనుగొన్న కీలకపదాలను ప‌రిశీలిస్తే, 1522 (ఇటలీలో గృహ హింస హెల్ప్‌లైన్ నంబర్), వేధింపులు, ఇల్లు & దుర్వినియోగం, గృహ & అత్యాచారం, స్త్రీ హత్య, రేప్, గృహ హింస, లింగ-ఆధారిత హింస, లైంగిక హింస వంటి ప‌దాలు క‌నిపించాయి.


Next Story

Most Viewed