పిండానికి సర్జరీ.. పుట్టబోయే బిడ్డకు వెన్నెముక సమస్య

by Disha Web |
పిండానికి సర్జరీ.. పుట్టబోయే బిడ్డకు వెన్నెముక సమస్య
X

దిశ, ఫీచర్: ప్రతీ తల్లి పుట్టబోయే బిడ్డ క్షేమంగా, పూర్తి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటుంది. అదే డెలివరీ కాక ముందే శిశువు అనారోగ్యంతో ఉన్నాడని తెలిస్తే.. ఏం చేస్తుంది? వీలైతే అబార్షన్ లేదంటే యధావిధిగా పుట్టిన బిడ్డను మనస్ఫూర్తిగా స్వీకరించడమే. కానీ ఈ తల్లి పిండానికే సర్జరీ చేయించింది. పూర్తి ఆరోగ్యంతో బిడ్డను కనబోతోంది. ఇదేంటి అనుకుంటున్నారా? నిజమే.. కడుపులో ఉన్న శిశువుకే శస్త్రచికిత్స చేసిన వైద్యులు హెల్తీ చైల్డ్‌గా మార్చేశారు.

డిజిటల్ కంటెంట్ క్రియేటర్ జైడెన్ అష్లియా గర్భం దాల్చిన నాలుగున్నర నెలలకు(మార్చిలో) ప్రినాటల్ అనాటమీ స్కాన్ చేయించుకుంది. ఇందులో పుట్టబోయే శిశువు 'స్పినా బిఫిడా' అనే సమస్యతో బాధపడుతుందని డాక్టర్లు గుర్తించారు. బిడ్డ పుట్టాక వెన్నెముక సమస్యలతో పాటు పక్షవాతం వచ్చే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. దీంతో అష్లియా కన్నీటి పర్యంతమైంది. కానీ బిడ్డకు ఎలాగైనా పూర్తి ఆరోగ్యంతో జన్మనివ్వాలనుకున్న ఆమె.. అమెరికాలోని ఒర్లాండోలో విన్నీ పాల్మెర్ హాస్పిటల్‌లో స్పెషలిస్ట్‌‌లను కలిసింది. దీంతో వారు బిడ్డను బయటకు తీసి వైద్యం చేసి తిరిగి లోపల పెట్టాలని(పిండానికి సర్జరీ చేసే విధానం) సూచించారు. కానీ ఇలా చేయడం వల్ల పుట్టబోయే శిశువుకు బ్రెయిన్ డెడ్ అయ్యే అవకాశం ఉందని కూడా చెప్పారు. అయితే బిడ్డ బాగుంటుందనే నమ్మకంతో ఒప్పుకోగా.. మే 11న పిండంలో శిశువు వెన్నుముక ఆపరేషన్ చేసి తిరిగి కడుపులో సెట్ చేశారు వైద్యులు. ఆ తర్వాత ఈ సర్జరీతో శిశువుకు ఎలాంటి సమస్యలు రావని కూడా తేల్చేశారు. దీంతో సంతోషపడిపోయిన అష్లియా.. ఈ విషయాన్ని టిక్ టాక్‌లో పంచుకుంది. ప్రస్తుతం తనకు ఏడు నెలలు కాగా.. జులైలో హెల్తీ చైల్డ్‌కు జన్మనివ్వబోతున్నానని వివరించింది.


Next Story