Pet dogs : కుక్కలు కూడా మనుషుల్లా కలలు కంటాయ్.. ఆ జ్ఞానం కూడా ఎక్కువే!

by Javid Pasha |
Pet dogs : కుక్కలు కూడా మనుషుల్లా కలలు కంటాయ్.. ఆ జ్ఞానం కూడా ఎక్కువే!
X

దిశ, ఫీచర్స్ : కుక్కలంటే కేవలం పెంపుడు జంతువులు మాత్రమే కాదు, నమ్మకానికి, విశ్వాసానికి మారు పేరు అంటుంటారు. ప్రస్తుతం చాలామంది జీవితంలో పెట్ డాగ్స్‌ ఒక భాగమైపోతున్నాయి. కుక్కలు ఒక వ్యక్తిని నమ్మాయంటే లైఫ్‌ లాంగ్ ఆ వ్యక్తితోనే ఉంటాయి. పైగా పెంపుడు కుక్కలు మనుషులకు రక్షణగానూ ఉంటాయి. అయినప్పటికీ అవి వాసన ఎందుకు చూస్తాయి?, తోక ఎందుకు ఊపుతాయి?, కొన్ని సందర్భాల్లో భిన్నంగా ఎందుకు ప్రతిస్పందిస్తాయి?.. అనే సందేహాలు చాలా మందిలో వ్యక్తం అవుతుంటాయి. సమాధానమేంటో ఇప్పుడు చూద్దాం.

సెన్స్ ఆఫ్ స్మెల్ 40 రెట్లు ఎక్కువ

వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. కుక్కలు మనుషులకంటే 40 రెట్లు అధికంగా వాసన జ్ఞానాన్ని కలిగి ఉంటాయట. వీటి ముక్కు అనేక లక్షల సువాసన గ్రాహకాలను కలిగి ఉంటుంది. అందుకే మనుషులు గుర్తించలేని వస్తువులు, పదార్థాలు, మాదక ద్రవ్యాలు, డెడ్ బాడీలు, బెడ్ బగ్స్, హానికారక రసాయనాలను, మనుషులను కుక్కలు వెంటనే పసిగడతాయి. మరో విషయం ఏంటంటే.. ఏ రెండు కుక్కల ముక్కులు సేమ్ టు సేమ్ ఉండవు. భిన్నమైన పోలికలు కలిగి ఉంటాయి. అయినా వాసన పసిగట్టడంలో మాత్రం కుక్కలన్నీ గొప్ప జ్ఞానాన్ని కలిగి ఉంటాయి.

శబ్దాల వినికిడిలో ప్రత్యేకత

కుక్కల ముక్కు మాత్రమే కాదు, చెవులు కూడా శబ్దాలను వినడంలో, గుర్తుంచుకోవడంలో మనుషులకంటే ఎక్కువ నైపుణ్యం కలిగి ఉంటాయి. మనం వినలేని అనేక సూక్ష్మ శబ్దాలను, భిన్నమైన శబ్దాలను కూడా కుక్కలు వినగలుగుతాయి. అందుకే అవి ఎక్కువగా తలలు వంచుకొని విహరిస్తుంటాయి. వాసనతోపాటు శబ్దాలను కూడా గ్రహించి గుర్తుంచుకుంటాయి. ప్రమాదకరమైన వాసనలు, శబ్దాలు గుర్తిస్తే మనుషులను అలర్ట్ చేస్తాయి.

మనుషుల్లా కలలు కంటాయ్

కుక్కలు కూడా నిద్రలో మనుషుల మాదిరి కలలు కంటాయని నిపుణులు చెప్తున్నారు. అవి గాఢమైన నిద్రలో అటూ ఇటూ కదిలినా, మెలి తిరిగినా ఏదైనా కలలో ఉండవచ్చు. అలాగే చిన్న చిన్న కుక్క పిల్లలు పెద్ద వాటికంటే ఎక్కువగా కలలు కంటాయట. నిపుణుల ప్రకారం.. బయట ఆడుకోవడం, మరో కుక్కతో కలిసి వాటి తోకను వెంబడించడం వంటి కలలు ఎక్కువగా కంటాయట. అయితే కుక్కల మెదడు విషయానికి వస్తే అవి రెండేండ్ల పిల్లవాడితో సమానంగా ఉంటాయట. ఒక కుక్క 150 పదాలను కౌంట్ చేయగలవని, అర్థం చేసుకోగలవని నిపుణులు చెప్తున్నారు. అయితే తెలివితేటలు కూడా కుక్కల జాతిని బట్టి మారుతుంటాయట. బోర్డర్ కొలీస్ అనేది అత్యంత తెలివైన కుక్కజాతి.

తోకలు ఎందుకు ఊపుతాయంటే..

కుక్కలు చాలా వరకు సంతోషంగా, ఉత్సాహంగా ఉంటేనే తోక ఊపుతాయి. నిపుణుల ప్రకారం.. అవి హ్యాపీగా ఉన్నప్పుడు కుడి వైపునకు, భయపడినప్పుడు ఎడమ వైపునకు తోకను తిప్పుతాయి. ఏవైనా కుక్కలు తమ తోకను తక్కువగా ఊపుతున్నాయంటే అవి అభద్రతా భావంతో ఉన్నట్లు లెక్క. ఇక కుక్క పిల్లలు పుట్టిన వెంటనే వాటికి చెవులు వినబడవు, కళ్లు కనబడవు.. రెండు వారాల తర్వాత మాత్రమే వినడం, చూడటం చేస్తాయి.

Advertisement

Next Story

Most Viewed