పిల్లలపై అరవడం.. ప్రమాదమే?!

by Disha Web Desk 6 |
పిల్లలపై అరవడం.. ప్రమాదమే?!
X

దిశ, ఫీచర్స్: పిల్లలను పెంచడం అనేక సవాళ్లతో ముడిపడి ఉంటుంది. ఈ విషయంలో ప్రతి కుటుంబం భిన్నమైన అనుభవాలు కలిగి ఉంటుంది. పిల్లలను సరైన క్రమంలో పెట్టేందుకు అరవడం, చేయి చేసుకోవడం లేదా నెమ్మదిగా అర్థమయ్యేట్లు చెప్పడం.. ఇలా అనేక రకాల దిద్దుబాటు చర్యలను ఫాలో అవుతుంటారు. ఈ క్రమంలో తాము పిల్లల పట్ల రియాక్ట్ అయ్యే తీరు వారిపై కొన్నిసార్లు పాజిటివ్‌గా ఎఫెక్ట్ చూపిస్తే.. మరికొన్ని సార్లు ప్రతికూల ప్రభావం చూపుతుందని గుర్తుంచుకోవాలంటున్నారు నిపుణులు. వీటిలో పిల్లలపై అరవడం నెగెటివ్ ఎఫెక్ట్స్‌లో ఒకటని, ఆ పద్ధతి మానుకోవాలని సూచిస్తున్నారు. చైల్డ్ డెవలప్‌మెంట్ జర్నల్‌లో 2014లో జరిపిన ఒక అధ్యయనం.. అరవడం అనేది పిల్లల్లో శారీరక దండనకు సమానమైన ఫలితాలను ఏర్పరుస్తుందని నిరూపించింది. ప్రవర్తనా సమస్యల పెరుగుదలతో పాటు ఆందోళన, ఒత్తిడి మరియు నిరాశ స్థాయిలను పెంచుతుందని నిర్ధారించింది.

మన పిల్లలకు మనమే మొదటి సూపర్‌హీరోలు, రోల్ మోడల్స్ అనేది తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సిన విషయాల్లో ముఖ్యమైనది. చాలా చిన్న వయస్సు నుంచే.. పిల్లలు పేరెంట్స్‌ను అనుకరించడం మొదలుపెడుతారు. వారి చర్యలు, లక్షణాలను బాగా అబ్జర్వ్ చేస్తుంటారు. అందుకే వారి రక్షణ కోసం అరవడం వేరు, దిద్దుబాటు చర్యల కోసం అరవడం వేరు అని చెప్తున్నారు నిపుణులు. మీ పిల్లవాడు రద్దీగా ఉండే వీధి వైపు దూసుకుపోతుంటే.. అది సున్నితంగా మాట్లాడి సమస్యను పరిష్కరించే సమయం కాదు. ఆ సందర్భంలో వారి రక్షణ కోసం కేకలు వేయడం 100% సముచితంగా ఉంటుంది. కానీ ఇంట్లో వారు చేసిన చిన్నచిన్న తప్పులకు క్రమం తప్పకుండా కేకలు వేస్తున్నట్లయితే.. పిల్లలు మిమ్మల్ని తీవ్రంగా పరిగణిస్తారని అంటున్నారు నిపుణులు. పిల్లలపై అరవడం ఎందుకు మానేయాలో నాలుగు ముఖ్యకారణాలు కూడా సూచిస్తున్నారు.

1. బిహేవియరల్ ప్రాబ్లమ్స్ తీవ్రతరం

పిల్లలను తిట్టడం లేదా వారిపై అరవడాన్ని దిద్దుబాటు చర్యగా పరిగణిస్తుంటారు. హింస, దూకుడుగా వ్యవహరించకుండా పిల్లలను సరిదిద్దుతున్నామని అనుకుంటారు. కానీ ఒకప్పుడు పిల్లలుగా ఉన్న ఇప్పటి పేరెంట్స్.. చిన్నతనంలో స్వీయ నియంత్రణ, భావోద్వేగ నియంత్రణ లేదా సమర్థవంతమైన సంభాషణను రూపొందించే పేరెంట్స్ లేక ఇబ్బంది పడలేదా? అని ప్రశ్నిస్తున్నారు నిపుణులు. ఈ విధానం మీలో ఒక ప్రతికూలతను ఏర్పరిచినప్పుడు.. పిల్లల్లో ఏర్పరచదా అని అడుగుతున్నారు. దిద్దుబాటు చర్యగా అరవడం చేస్తే పిల్లల్లో బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యే చాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు.

2. డిప్రెషన్‌కు దారితీస్తుంది

మానవులు సహజంగానే రక్షణ రూపంగా కేకలు వేస్తారు. కానీ దిద్దుబాటు రూపంగా ఉపయోగించినప్పుడు, అరుపులు రిలేషనల్ టెన్షన్‌ను సృష్టిస్తాయి. పిల్లల మెదడును ఒత్తిడి హార్మోన్లతో నింపుతాయి.

3. మెదడు అభివృద్ధిని మారుస్తుంది

కేకలు వేయడం అనేది పిల్లల సామాజిక, భావోద్వేగ మరియు మెదడు అభివృద్ధిని మారుస్తుంది, దెబ్బతీస్తుంది. లాజిక్ & రీజనింగ్(ఇతర విషయాలతోపాటు) అభివృద్ధికి బాధ్యత వహిస్తున్న ప్రీ-ఫ్రంటల్ కార్టెక్స్ మరియు అమిగ్డాలా ఎదుగుదలను నిరోధిస్తుంది.

4. శారీరక ఆరోగ్యంపై ప్రభావం

ఇటీవలి అధ్యయనంలో చిన్ననాటి ప్రతికూల అనుభవాలు.. వర్బల్ అబ్యూజ్, యుక్తవయస్సులో ఆర్థరైటిస్, బ్యాడ్ హెడేక్, వెన్ను నొప్పి, మెడ నొప్పి మరియు ఇతర దీర్ఘకాలిక శారీరక పరిస్థితులకు మధ్య సంబంధం ఉంటుందని తాజా అధ్యయనం కనుగొంది.


Next Story