మైండ్ గేమ్ రిలేషన్‌షిప్.. ఎదుటి వ్యక్తిలో ఈ ప్రవర్తన కనిపిస్తే బీ అలర్ట్!

by Javid Pasha |
మైండ్ గేమ్ రిలేషన్‌షిప్.. ఎదుటి వ్యక్తిలో ఈ ప్రవర్తన కనిపిస్తే బీ అలర్ట్!
X

దిశ, ఫీచర్స్ : ‘మైండ్ గేమ్’ ఆడుతున్నారు అనే మాటలు మనం తరచూ వింటుంటాం. మోసం, అబద్దం, అపనమ్మకం, నిరుత్సాహ పరిచే దూకుడు ప్రవర్తన వంటివి ఈ కోవకే చెందుతాయి. ఒక వ్యక్తి మనతో మంచిగా మాట్లాడుతూనే.. నమ్మకంగా ఉంటూనే మనసులో మాత్రం మనల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు. దీనినే నిపుణులు ‘మైండ్ గేమ్’గా పేర్కొంటున్నారు. ఇది మానవ సంబంధాలను బలహీన పరుస్తుంది.

రిలేషన్‌షిప్‌లో గానీ, ఫ్రెండ్‌షిప్‌లో గానీ ఎదుటి వ్యక్తి మైండ్ గేమ్ బిహేవియర్‌ వల్ల మీలో గందరగోళం, మానసిక ఒత్తిడి వంటివి పెరుగుతాయి. నిర్లక్ష్యం చేస్తే నిరాశ, డిప్రెషన్ వంటి తీవ్రమైన రుగ్మతలుగా మారవచ్చు. అయితే ముందుగానే అలాంటి ప్రవర్తనను లేదా లక్షణాలను గుర్తిస్తే సదరు వ్యక్తులతో జాగ్రత్తగా ఉండవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. అదెలాగో చూద్దాం.

నిరాశ పర్చడమే పనిగా..

అది భార్యా భర్తల బంధం కావచ్చు, స్నేహితుల మధ్య బాండింగ్ కావచ్చు. ఎదుటి వ్యక్తి ప్రతి విషయంలోనూ మిమ్మల్ని నిరుత్సాహ పరిచేలా వ్యవహరించడం, ప్రత్యక్షంగా, పరోక్షంగా నిరుత్సాహ పరచడం చేస్తున్నారంటే మైండ్ గేమ్ ఆడుతున్నట్లు అనుమానించవచ్చు. అది తగిన సందర్భమైనా కాకపోయినా మిమ్మల్ని అవమానించేలా బిహేవ్ చేయడమే అవతలి వ్యక్తి పని. నలుగురిలో మీరు గిల్ట్ ఫీల్ అయ్యే పనులను, యాక్టివిటీస్‌ను ప్రోత్సహిస్తారు. మీరు వేసుకునే డ్రెస్ మొదలు తీసుకునే నిర్ణయం దాకా మైండ్ గేమ్ ఆడే వ్యక్తివల్ల ఎల్లప్పుడూ ఇబ్బంది పడుతుంటారు. ఒకటి రెండు సందర్భాల్లో ఇది గమనించి అలర్ట్‌గా ఉండటం మంచిది.

క్లారిటీ ఉండదు, రహస్యాలు దాస్తారు

ఒక వ్యక్తి మీతో మైండ్ గేమ్ స్టార్ట్ చేసినప్పుడు ఏ విషయంలోనూ క్లారిటీ ఇవ్వరు. మీరు ఎంత మంచి స్నేహితులైనా, లేదా భార్యా భర్తలైనా సరే ఇద్దరిలో ఒక వ్యక్తి ప్రవర్తన ఇలా ఉందంటే మైండ్ గేమ్ స్టార్ట్ చేసి ఉండవచ్చు. మనసులో ఏదో పెట్టుకొని మరోలా వ్యవహరించే వ్యక్తి మీకు నచ్చిన విషయాల్లో సపోర్ట్ చేయరు. బాధలు, భావోద్వేగాలు, భవిష్యత్ ప్రణాళికలు ఏవీ మీతో పంచుకోరు. ఈ విషయాల్లో వారి సంభాషణ కూడా అస్పష్టంగా ఉంటుంది. అలాగే వారు ఎక్కడికి వెళ్తున్నది, ఏం చేస్తున్నది, ఎవరిని కలుస్తున్నది చెప్పరు. చాలా వరకు రహస్యాలు దాస్తుంటారు.

అంతు చిక్కని పజిల్ వంటిది..

మైండ్ గేమ్ ప్రవర్తన చాలా వరకు అంతు చిక్కని పజిల్ మాదిరి ఉంటుంది. మనసులో ఏదో పెట్టుకొని, బయటకు మరోలా వ్యవహరించే వారు ఒక్కోసారి మీపై అమితమైన ప్రేమ కనబరుస్తుంటారు. మరు క్షణమే మారిపోతుంటారు. మాటల్లో భరోసా కనిపిస్తుంది. చేతల్లో నిరుత్సాహం, వెన్నుపోటు అనుభవాలు ఎదురవుతుంటాయి. అంతేకాకుండా అవతవలి వ్యక్తి ఎప్పుడు ఎలా ఉంటారో అర్థం కాని గందరగోళంలో మీరు పడుతున్నారంటే.. మీతో మైండ్ గేమ్ స్టార్ చేసి ఉండవచ్చు.

తప్పుచేసినా సారీ చెప్పరు

మీపై ప్రేమ ఉన్న వ్యక్తులు ఏదైనా చేయరాని పొరపాటు చేసినప్పుడు ఫీల్ అవుతారు. సారీ చెప్తుంటారు. కానీ మనసులో చెడు ఉద్దేశం పెట్టుకొని పైకి మంచిగా వ్యవహరించే వ్యక్తులు అలా చేయకపోవచ్చు. తాను చేసింది తప్పు అని తెలిసినా.. సారీ చెప్పరు. పైగా సమర్థించుకునే ప్రయత్నం చేస్తారు. తనపైకి వచ్చే నిందలను మీపైకి నెట్టేస్తుంటారు. అబద్ధాలను కూడా అందంగా, నమ్మకంగా చెప్తారు. అనేక సందర్భాల్లో మిమ్మల్ని అయోమయంలో పడేస్తారు. చివరికి వారు చేసిన తప్పులకు కూడా మీరే సారీ చెప్పేలా తెలివిగా వ్యవహరిస్తారు. సో.. ఇలాంటి బిహేవియర్ కనిపించినప్పుడు మీరు అలర్ట్ అయి, అవతలి వ్యక్తితో జాగ్రత్తగా ఉండటం మంచిది.

Advertisement

Next Story

Most Viewed