- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అన్‌నోన్ సోల్జర్ ఆఫ్ ఇండిపెండెన్స్..
దిశ, ఫీచర్స్ : 75వ భారత స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఆసేతు హిమాచలం వజ్రోత్సవ వేడుకలు జరుపుకుంటుండగా.. ఇప్పటికే ఇంటింటా త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది..Latest Telugu News

దిశ, ఫీచర్స్ : 75వ భారత స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఆసేతు హిమాచలం వజ్రోత్సవ వేడుకలు జరుపుకుంటుండగా.. ఇప్పటికే ఇంటింటా త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. ఈ సందర్భంగా దేశానికి స్వేచ్ఛా, స్వతంత్రాలను అందించిన పోరాట యోధులను స్మరించుకోవడం మన బాధ్యత. అలాంటి వారిలో ఒకరే 'మౌలానా హస్రత్ మోహాని'. కలమే ఆయుధంగా బ్రిటిష్ సామ్రాజ్యంపై పోరాటానికి దిగిన ఈ నిర్భయ స్వాతంత్య్ర సైనికుడు తన రచనలతోనే జనాల్లో విప్లవాగ్ని రగిల్చారు. 'ఇంక్విలాబ్ జిందాబాద్' నినాదంతో తిరుగుబాటు జెండా ఎగరేశారు. కానీ తన స్ఫూర్తిదాయక పోరాటం చరిత్రపుటల్లో కనుమరుగై, కాలగర్భంలో కలిసిపోయింది. ప్రస్తుత వజ్రోత్సవ వేడుకల సందర్భంగా ఆ మహానుభావుడి కలం బలంపై స్పెషల్ స్టోరీ.
ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లా, కస్బా మోహన్‌లో 1875 జనవరి 1న జన్మించిన 'మౌలానా హస్రత్ మోహానీ' అసలు పేరు సయ్యద్ ఫజల్-ఉల్-హసన్. ఆయన తన గజల్స్(తఖల్లుస్)ను కవిత్వంలో కూడా ఉపయోగించేవాడు. మోహన్‌లో పుట్టిన తనకు మోహానీ హస్రత్‌తో అనుబంధం ఏర్పడగా.. ఆ తర్వాత హస్రత్ మొహానిగా ప్రసిద్ధి చెందాడు. ప్రాథమిక విద్య తర్వాత అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలో అడ్మిషన్ పొందిన మోహానీ.. కాలేజీ రోజుల్లోనే విప్లవోద్యమాల్లోకి అడుగుపెట్టాడు. ఈ కారణంగా 1903లో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. దీంతో ఆయనను కాలేజీ నుంచి బహిష్కరించినా సరే.. ఫ్రీడమ్ ఫైట్ నుంచి తన దృష్టిమరల్చడంలో సక్సెస్ కాలేకపోయారు.
కలం శక్తి :
గ్రాడ్యుయేషన్ తర్వాత 1903లో అలీఘర్‌లోనే 'ఉర్దూ- ఏ-మౌలా' పేరుతో పత్రికను ప్రారంభించారు. ఇది బ్రిటిష్ పాలనలో అణచివేత, తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా పనిచేసింది. తద్వారా స్వాతంత్య్ర పోరాటం గురించి ప్రజలకు అవగాహన కల్పించింది. ఆయన కలం శక్తిని అర్థం చేసుకున్న బ్రిటిష్ ప్రభుత్వం.. 1907లో మళ్లీ ఆయనను జైలుకు పంపించింది. దీంతో పత్రిక మూతపడింది. అంతేకాదు కాంగ్రెస్ క్రియాశీలక సభ్యుల్లో ఒకరైన మౌలానా.. 1907 వరకు అదే పార్టీలో కొనసాగారు. కానీ బాలగంగాధర్ తిలక్ పార్టీని వీడిన వెంటనే ఆయన కూడా కాంగ్రెస్‌ను వీడారు. తిలక్ సన్నిహితుల్లో తను కూడా ఒకరిగా ఉన్నారు.
ఇంక్విలాబ్ జిందాబాద్
స్వాతంత్య్ర పోరాటంలో అతివాదులతో కలిసి పనిచేసిన మౌలానా తెగువను ప్రదర్శించాడు. ఇదే క్రమంలో కమ్యూనిస్ట్ పార్టీ సహ వ్యవస్థాపక సభ్యుడిగా ఉండి 1925లో మరోసారి జైలు పాలయ్యాడు. అయినా సరే బ్రిటిష్ ప్రభుత్వం మౌలానా గుండె ధైర్యాన్ని విచ్ఛిన్నం చేయలేకపోయింది. దీంతో అంతకు మించిన ఆవేశం, ఆలోచనతో ముందుకు సాగిన మోహానీ.. ప్రజల హృదయాల్లో స్వాతంత్ర్య జ్యోతిని వెలిగించగలిగారు. అయితే చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం 1921లోనే ఆయన 'ఇంక్విలాబ్ జిందాబాద్' నినాదాన్ని రచించినట్లు తెలుస్తుండగా.. ఈ నినాదాన్ని విప్లవ ప్రసంగాలు, రచనల్లో వినియోగించిన 'భగత్ సింగ్' చిరస్థాయిగా నిలిపాడు.
అత్యున్నతమైన కవి
మౌలానా హస్రత్ మోహానీ గొప్ప కవి, కాలమిస్టుగా గుర్తింపు పొందారు. నేటికీ ఆయన రచించిన గజల్స్, కవిత్వాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. శ్రీకృష్ణుని మీద కూడా ఎన్నో కవితలు రాసిన ఆయన.. గొప్ప వర్ణనలు చేశారు. బాలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ 'నిఖా'లో పాపులర్ గజల్ సింగర్ గులామ్ అలీ.. 'చుప్కే చుప్కే రాత్ దిన్ దిల్ బహానే హై యాద్ హై..' అంటూ ఆయన రచించిన గజల్స్‌ను ఆలపించారు. ఇక మౌలానా పోయెట్రీ కలెక్షన్ 'కులియాత్-ఎ-హస్రత్' పేరుతో ఫేమస్ కాగా.. ప్రేమ, సామాజిక, రాజకీయ, న్యాయ, స్వేచ్ఛా భావం కనిపించే ఆయన కవిత్వం ద్వారా ఉర్దూ గజల్‌కు సరికొత్త హోదా కల్పించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
మాతృభూమి కోసం అమరుడైన మౌలానా
చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం 1921లో అహ్మదాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ సదస్సులో హస్రత్ మోహానీ సంపూర్ణ స్వరాజ్యాన్ని ప్రతిపాదించారు. ఈ క్రమంలో స్వదేశీ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. భారత్‌కు స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత ప్రభుత్వ సౌకర్యాలను అనుభవించేందుకు నిరాకరించారు. ఈ మేరకు సొంత ఖర్చులతోనే పార్లమెంట్‌కు వెళ్లిన ఆయన.. మే 13, 1951న లక్నోలో తుదిశ్వాస విడిచే వరకు దేశం కోసమే పరితపించారు.
వెరైటీగా దేశభక్తిని చాటుకున్న అమ్మాయి.. చూస్తే షాకవ్వాల్సిందే?






