Technology : జాబ్ మార్కెట్‌పై ఏఐ ప్రభావం? ప్రమాదం పొంచి ఉందా?

by Javid Pasha |

ఏఐ ఏజెంట్లు మానవులతో కలిసి పని చేసే హైబ్రిడ్ మోడల్ భవిష్యత్తులో ఐటీ పని తీరును మార్చేస్తుందని సాంకేతిక నిపుణులు అంటున్నారు.

Technology : జాబ్ మార్కెట్‌పై ఏఐ ప్రభావం? ప్రమాదం పొంచి ఉందా?
X

దిశ, ఫీచర్స్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాకతో ప్రపంచమే మారిపోతోంది. అనేక రంగాల్లో సేవలు సులభతరం అవుతున్నాయి. అయితే అదే సందర్భంలో ఇది మానవ వనరులకు ముప్పు కలిగిస్తుందని, అనేక మంది ఉద్యోగాలు కోల్పోతారనే ఆందోళనలు సైతం వ్యక్తం అవుతున్నాయి. ఇందుకు సంబంధించిన వార్తులు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే పలువురు సాంకేతిక నిపుణులు ఇందుకు భిన్నంగానూ స్పందిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఐటీ ఉద్యోగులకు ముప్పుగా మారుతుందనే భయం అవసరం లేదని, నిజానికి ఇదో మంచి పరిణామమని పేర్కొంటున్నారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ కూడా రీసెంట్‌గా ఈ విధమైన వ్యాఖ్యలు చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఐటీరంగంపై ఏఐ ప్రభావం గురించి నెటిజన్లలో ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది.

ముప్పు కాదు.. అవకాశం!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఐటీ ఉద్యోగులకు ఏమాత్రం ముప్పు కాదని, ప్రపంచ జాబ్ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం పడదని కూడా పలువురు నిపుణులు అంటున్నారు. పైగా ఇది భవిష్యత్తులో ఎదుగుదలకు, ఉద్యోగాల సృష్టికి అభివృద్ధికి సహాయపడుతుందని చెబుతున్నారు. టీసీఎస్ చైర్మన్ చంద్రశేఖరన్ ఏఐని “ఇంటెలిజెన్స్ ఆఫ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్”గా అభివర్ణించిన విషయాన్ని పలువురు గుర్తు చేసుకుంటున్నారు. ఇది ఐటీ సర్వీసెస్ రంగానికి ఇప్పటి వరకు లభించిన అతి పెద్ద అవకాశమని భావిస్తున్నారు. సాంప్రదాయ ఐటీ సేవలు తగ్గుతాయనే భయాన్ని వదులుకోవాలని, నిజానికి AI వల్ల కొత్త రకాల సేవలు, ప్రాజెక్టులు, ఉద్యోగాలు క్రియేట్ అవుతాయని నిపుణులు అంటున్నారు.

విస్తరించనున్న మార్కెట్

గ్లోబల్ ఎంటర్‌ప్రైజెస్ (Global Enterprise IT Market) ఐటీ మార్కెట్ ప్రస్తుతం 1.6 ట్రిలియన్ డాలర్ల వద్ద ఉంటే, తదుపరి 5-10 సంవత్సరాల్లో 3 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. లెగసీ సిస్టమ్స్‌ను ఆధునీకరించడం(modernize), సావరిన్ AI, ఫ్యాక్టరీలు, సప్లై చైన్, హెల్త్‌కేర్ వంటి రంగాల్లో ఏఐ అమలు వంటివి భారీ డిమాండ్‌ను సృష్టిస్తాయని చెబుతున్నారు. అంతేకాకుండా ఏఐ ఏజెంట్లు మానవులతో కలిసి పని చేసే హైబ్రిడ్ మోడల్ భవిష్యత్ ఐటీ పని తీరును మార్చేస్తుందని సాంకేతిక పరిశోధకులు సైతం నమ్ముతున్నారు. మొత్తానికి ఏఐని సరైన విధంగా ఉపయోగించుకోగలిగితే.. ఇది ఐటీ కంపెనీలను మరింత శక్తివంతం చేసి, భారత్ సహా, ప్రపంచ ఐటీ ఇండస్ట్రీని ఉన్నతశిఖరాలకు చేర్చుతుదనడంలో సందేహం లేదంటున్నారు నిపుణులు.

Next Story