కాంతి కాలుష్యం వల్ల నక్షత్రాలు కనుమరుగవుతాయా ?

by Disha Web Desk 10 |
కాంతి కాలుష్యం వల్ల నక్షత్రాలు కనుమరుగవుతాయా ?
X

దిశ, ఫీచర్స్ : వెన్నెలరేయిలో డాబాపైకి వెళ్లి మీరెప్పుడైనా తలపైకెత్తి చూశారా? నీలాకాశంలో మిణుకు మిణుకు మంటూ మెరిసే నక్షత్రాలను చూసినప్పుడు కలిగే ఆనందాన్ని ఆస్వాదించారా? ఆ సమయంలో కలిగే అనుభూతే వేరు కదూ ! కానీ ఆధునికత అతిపోకడలో, మానవ నిర్లక్ష్యమో కానీ గత దశాబ్దకాలంలో నక్షత్రాల సంఖ్య గణనీయంగా తగ్గిందని పరిశోధనలు చెప్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకూ పెరుగుతున్న కాంతి కాలుష్యమే ఇందుకు కారణమని పేర్కొంటున్నాయి.

సిటీలో నివసిస్తున్న మీరు రాత్రిపూట నిర్మలమైన ఆకాశాన్ని, మెరిసే నక్షత్రాలను చూడగలరా?.. చాలామంది కాదనే చెప్తారు. ఎందుకంటే వెలుగు జిలుగులను విరజిమ్మే హై ఫోకస్ లైట్ల వెలుతురులో ఆకాశంలోని అందమైన నక్షత్రాలు కనబడవు. విద్యుత్‌ను కనుక్కోవడం మానవాభివృద్ధిలో గొప్ప విప్లవమే.. కానీ అదే సందర్భంలో అవసరమున్నా లేకున్నా, సమయం సందర్భం లేకుండా విద్యుత్ వెలుతురుల మధ్య జీవించడానికి మనం ఎప్పుడైతే అలవాటు పడ్డామో.. అప్పుడే కాంతి కాలుష్యానికి కూడా మార్గం ఏర్పడింది. పర్యావరణంలో పగటివేళ సూర్యకాంతికి.. రాత్రి వేళ చల్లని వెన్నెల కాంతికి మానవులు క్రమంగా దూరమవుతున్నారు. ఈ కారణంగా పర్యావరణ సమస్యలేగాక, పలు ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ప్రపంచం ముందున్న పర్యావరణ సమస్యలు, సవాళ్లలో కాంతికాలుష్యం కూడా ఒకటిగా నిలిచిందని చెప్పొచ్చు. కృత్రిమ లైటింగ్ కారణంగా ఆకాశంలోని నక్షత్రాలు రాత్రిపూట కనబడకుండా పోతున్నాయని గత పన్నెండుళ్లుగా ఖగోళ, భౌగోళిక అంశాలపై అధ్యయనం నిర్వహించిన సైంటిస్టులు వెల్లడించారు. పరిశోధకుల అధ్యయనం ప్రకారం.. మానవులు తమ అవసరాలకు, ఆకాశంలోకి విడుదల చేసే కాంతి పరిమాణం ప్రతీ సంవత్సరం 10 శాతం పెరుగుతోంది. పోట్స్‌డామ్‌లోని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ శాస్త్రవేత్త డాక్టర్ క్రిస్టోఫర్ కైబా నివేదిక ''కాంతి కాలుష్యంవల్ల నక్షత్రాలు కనుమరుగవుతున్నాయి. ఇది భవిష్యత్తులో ప్రమాదకరం. కాంతికాలుష్యం అనేక సమస్యలకు దారి తీయవచ్చు'' అని పేర్కొన్నట్లు బీబీసీ ఒక సందర్భంలో ఉటంకించింది.

ఎల్ఈడీ లైటింగ్స్ ప్రభావం

యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఏడాదిక్రితం నిర్వహించిన ఓ అధ్యయనంలో ప్రపంచవ్యాప్తంగా ఎల్ఈడీ లైటింగ్ విప్లవం అనేది కాంతి కాలుష్య సమస్యను మరింత తీవ్రతరం చేసిందని వెల్లడైంది. హైమాస్ లైట్లు, అలంకారాలకోసం వినియోగించే రకరకాల, రంగు రంగుల లైటింగ్స్, పెద్ద పెద్ద హోర్డింగులు, స్ట్రీట్ లైట్స్, బహుళ అంతస్తుల భవనాలపై మెరిసే హై ఫోకస్ లైట్లు కాంతి కాలుష్యంలో కీలకంగా ఉంటున్నాయి. వీటికాంతి ఆకాశంలోకి ఫోకస్ అయి, అక్కడి నక్షత్రాలు కనబడకుండా చేస్తోంది.

పొంచివున్న ముప్పు

కాంతి కాలుష్యమనేది మానవాళికి సమస్యలను తెచ్చిపెడుతోందని పరిశోధకులు చెప్తున్నారు. ఆకాశంలోని నక్షత్రాలను, చంద్రున్ని ఇది పెద్దగా ప్రభావితం చేయకపోవచ్చు కానీ, వాటిని మనుషులు చూసి ఆనందించే పరిస్థితిని అడ్డుకుంటోంది. కృత్రిమలైట్ల కాంతిపుంజాల నడుమ నక్షత్రాలు, చంద్రుడు మానవులకు కనిపించకుండా పోతాయని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా కాంతి కాలుష్యంవల్ల నిద్రలేమి వంటి సమ్యలు తలెత్తి, దీని కారణంగా ఇతర అనారోగ్యాలకు తీరితీసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఒక అధ్యయనం ప్రకారం కాంతి కాలుష్యం మనుషులతోపాటు జంతువులు, కీటకాలపై కూడా ప్రభావం చూపుతోంది. కృత్రిమ కాంతి ఎక్కువగా ఉంటున్న చోట వివిధ కీటకాలు క్షీణిస్తున్నాయి. మానవాళికి కృత్రిమ కాంతి అనేది నేడొక అవసరంగా మారింది. అదే సందర్భంలో అది కాలుష్యానికి దారి తీయకుండా నిలువరించే చర్యలను అనుసరించే పరిస్థితులు కూడా ఉంటేనే.. కాంతి కాలుష్యం నుంచి మానవాళికి రక్షణ లభిస్తుందని నిపుణులు చెప్తున్నారు.

ఇవి కూడా చదవండి : Lightning Strikes ను ఆపిన సైంటిస్టులు.. లేజర్ లైటింగ్‌తో సాధ్యం

Next Story

Most Viewed