భారత్‌లో తొలి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్

by Disha Web Desk 7 |
భారత్‌లో తొలి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్
X

దిశ, ఫీచర్స్ : పుణెలో KPIT-CSIR అభివృద్ధి చేసిన హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్సును కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఇటీవలే ఆవిష్కరించారు. ఈ బస్సులు ఉద్గారాలను ఉత్పత్తి చేసినప్పటికీ భవిష్యత్‌లో వీటి వల్ల ఉపయోగముంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆ ప్రత్యేకతలు, ప్రయోజనాల వివరాలేంటో తెలుసుకోండి.

బస్సులో ఉండే హైడ్రోజన్ ఇంధన కణాలు.. హైడ్రోజన్, ఆక్సిజన్ అణువులను జోడించడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తాయి. ఇందులోని ఇంధన కణాలు ఎలక్ట్రిక్ వాహనాల్లో కనిపించే సంప్రదాయ బ్యాటరీల మాదిరిగానే పనిచేస్తాయి కానీ ఎప్పటికీ డిశ్చార్జ్ కావు. దీంతో రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. హైడ్రోజన్ సరఫరా ఉన్నంత వరకు అవి విద్యుత్ ఉత్పత్తి చేస్తూనే ఉంటాయి. ఫ్యూయల్ సెల్‌లోనూ సాంప్రదాయక కణాల మాదిరి ఎలక్ట్రోలైట్ చుట్టూ యానోడ్(నెగెటివ్ ఎలక్ట్రోడ్), కాథోడ్(పాజిటివ్ ఎలక్ట్రోడ్) ఉంటాయి.

సాధారణ వాహనాల వలె ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్స్(FCEV) టెయిల్ పైప్ ఉద్గారాలను ఉత్పత్తి చేయవు. నీటి ఆవిరి సహా వేడిగాలిని మాత్రమే విడుదల చేస్తాయి. సాధారణ వాహనాల కంటే ఇవి మరింత సమర్థవంతమైనవి కావడం మరొక విశేషం. అంతేకాదు బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ బస్సును చార్జ్ చేసేందుకు గంటలు పట్టే అవకాశముండగా.. హైడ్రోజన్‌ను ఫ్యూయల్ సెల్ వాహనంలో మాత్రం నిమిషాల వ్యవధిలోనే ఇంధనాన్ని రీఫిల్ చేయవచ్చు.

వాస్తవానికి బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలు టెయిల్‌పైప్ ఉద్గారాలను మాత్రమే ఉత్పత్తి చేయవు. ఇక బస్సుల విషయానికొస్తే.. హైడ్రోజన్‌ గ్యాస్ ఆధారంగా నడుస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా శిలాజ ఇంధనాల నుంచే హైడ్రోజన్ ఉత్పత్తి అవుతుంది కాబట్టి, వీటి వినియోగంతో పెద్ద సంఖ్యలో ఉద్గారాలు వెలువడతాయి. కానీ ప్రస్తుతం మనం పునరుత్పాదక విద్యుత్ వనరుల వైపు పయనిస్తున్నట్లుగా భవిష్యత్‌లో హైడ్రోజన్‌ను ఉత్పత్తిచేసే పునరుత్పాదక పద్ధతుల వైపు కూడా వెళ్లే అవకాశం ఉంది. అందువల్ల ఈ వాహనాలు ప్రస్తుతం ఉద్గారాలకు దోహదపడినప్పటికీ.. వాటికి అవసరమైన ఇంధనాన్ని సౌర, పవన శక్తి వంటి పునరుత్పాదక పద్ధతులను ఉపయోగించి ఉత్పత్తి చేయొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.



Next Story

Most Viewed