Auto Tips : వేసవిలో కారు టైర్లు పేలకుండా ఉండాలంటే ఏం చేయాలి?: ఇవే చిట్కాలు..!

by Kavya |
Auto Tips : వేసవిలో కారు టైర్లు పేలకుండా ఉండాలంటే ఏం చేయాలి?: ఇవే చిట్కాలు..!
X

దిశ, వెబ్‌డెస్క్‌: వేసవి కాలం వచ్చిందంటే చాలు, మనతో పాటు మన వాహనాల టైర్లకు కూడా పరీక్షా కాలమే. ఎండ వేడిమి పెరిగే కొద్దీ టైర్లలోని గాలి ఒత్తిడి కూడా మారిపోతూ ఉంటుంది. భగభగ మండే సూర్యుడి వేడి, పెరిగిపోతున్న ఉష్ణోగ్రత మీ కారు టైర్లకు ప్రమాదం తెచ్చిపెట్టగలవు. టైర్లలో ఒత్తిడి పెరగడం లేదా తగ్గడాన్ని మీరు తేలిగ్గా తీసుకుంటే, టైర్లు పాడయ్యే ప్రమాదం ఉంది. అంతేకాదు, ప్రమాదాలు జరిగే ఛాన్స్‌లు కూడా ఎక్కువవుతాయి. మరి ఈ భగభగలాడే ఎండలో మీ టైర్లు పేలకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం!


వేసవిలో ఒత్తిడి ఎందుకు పెరుగుతుంది.?

పగటిపూట ఉష్ణోగ్రత పెరిగినప్పుడు గాలి కూడా వేడెక్కుతుంది. టైర్ల లోపల ఉన్న గాలి వేడెక్కి వ్యాకోచిస్తుంది. దీనివల్ల టైర్లలో ఒత్తిడి పెరుగుతుంది. ఆ తర్వాత టైర్లు పాడయ్యే లేదా ఒక్కోసారి పేలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. వేసవిలో ప్రతి 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పెరిగితే, టైర్లలో ఒత్తిడి దాదాపు 1-2 PSI వరకు పెరుగుతుంది. మీ టైర్లలో సాధారణంగా 25 PSI ఒత్తిడి ఉంటే, బలమైన ఎండలో అది 30 PSI లేదా అంతకంటే ఎక్కువ చేరే అవకాశం ఉంది.

వేసవిలో మీ టైర్ల ఒత్తిడిని చెక్ చేసుకోండి..

వేసవిలో మీ కారు టైర్ల ఒత్తిడిని తరచూ చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. మీరు లాంగ్ డ్రైవ్‌కు వెళ్తున్నట్లయితే, మధ్యమధ్యలో టైర్ల ప్రెషర్‌ను తప్పకుండా పరిశీలించండి. ప్రయాణం మొదలు పెట్టే ముందు ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది.

టైర్ల సంరక్షణ అతి ముఖ్యం..

వేసవిలో మీ కారుపై ఎక్కువ బరువు వేయకండి. అలా చేస్తే టైర్లపై అదనపు ఒత్తిడి పడుతుంది. టైర్ల అలైన్‌మెంట్, బ్యాలెన్సింగ్‌ను ఎప్పటికప్పుడు చేయించాలి. ఒకవేళ మీ టైర్లు ఐదు సంవత్సరాల కంటే పాతవైతే వాటిని వాడటం ప్రమాదకరం. అందుకే వాటిని వెంటనే మార్చేయండి.

నైట్రోజన్ గ్యాస్ వాడండి..

వేసవిలో మీ టైర్లలో గాలి నింపేటప్పుడు నైట్రోజన్ గ్యాస్ నింపడానికి ప్రయత్నించండి. నైట్రోజన్ ఒక చల్లని వాయువు. ఇది ఎక్కువ ఉష్ణోగ్రతలో కూడా టైర్ల వేడిని బ్యాలెన్స్ చేయడానికి సహాయపడుతుంది. అంతేకాదు, గాలి త్వరగా బయటకు పోకుండా కూడా నివారిస్తుంది. దీనివల్ల టైర్లు పేలే ప్రమాదం తగ్గుతుంది.

స్పీడ్‌కు బ్రేక్ వేయండి..

వేసవి సెలవుల్లో చాలామంది ట్రిప్‌లకు వెళ్లడానికి ఇష్టపడతారు. అలాంటప్పుడు హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలపై వేగంగా డ్రైవ్ చేస్తే సమయం ఆదా అవుతుందని అనుకుంటారు. కానీ అతి వేగం టైర్లను త్వరగా వేడెక్కేలా చేస్తుంది. దీనివల్ల అవి పేలే అవకాశాలు పెరుగుతాయి. ఇది పెద్ద ప్రమాదానికి కూడా దారితీయవచ్చు. అందుకే మీ కారును ఒక మోస్తరు వేగంతో నడపడం మంచిది.

కాస్త విశ్రాంతినివ్వండి..

మీరు లాంగ్ డ్రైవ్‌లో ఉన్నప్పుడు ప్రతి 100-150 కిలోమీటర్లకు ఒకసారి మీ కారును ఆపండి. మీ కారుకు కూడా కాస్త రెస్ట్ ఇవ్వడం చాలా ముఖ్యం. దీనివల్ల టైర్లు, ఇంజన్ చల్లబడటానికి సమయం దొరుకుతుంది. రెండింటి ఉష్ణోగ్రతను తగ్గించవచ్చు. కాబట్టి, వేసవిలో మీ టైర్ల పట్ల శ్రద్ధ వహించి సురక్షితమైన ప్రయాణాన్ని ఆస్వాదించండి.



Next Story

Most Viewed