సీపీఆర్‌తో ప్రాణదానం.. పెద్దలు, పిల్లలు, శిశువులకు విభిన్న పద్ధతులు

by Disha Web Desk 13 |
సీపీఆర్‌తో ప్రాణదానం.. పెద్దలు, పిల్లలు, శిశువులకు విభిన్న పద్ధతులు
X

దిశ, ఫీచర్స్: నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో ప్రకారం.. గత పదేళ్లలో గుండెపోటుతో మరణాలు 54 శాతం పెరిగాయి. ఇటీవల మన రాష్ట్రంలోనూ కార్డియాక్ అరెస్టు కేసులు పెరిగాయి. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఎంతో మంది కార్డియాక్ అరెస్ట్‌తో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చూశాం. జిమ్ చేస్తున్నప్పుడు, ఏదో పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు, పెళ్లి బరాత్‌లో డ్యాన్స్ చేస్తున్నప్పుడు.. గుండెపోటు వచ్చి ప్రాణాలు విడుస్తున్న వారిని కూడా చూస్తున్నాం.


అయితే ఓ వ్యక్తికి గుండెపోటు వచ్చినప్పుడు దగ్గర ఉన్న వారు వెంటనే స్పందించి కార్డియోపల్మనరీ రీససిటేషన్(CPR) చేస్తే ప్రమాద సమయంలో ప్రాణాలు కాపాడవచ్చని డాక్టర్లు చెప్తున్నారు. ఇలా చేయడం వల్ల అకస్మాత్తుగా అకస్మాత్తుగా ఆగిపోయిన గుండెకు, రక్త నాళాలకు బ్లడ్ పంప్ అయి కోలుకునే అవకాశం ఉందంటున్నారు.


ఈ మధ్య ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ సీపీఆర్ చేసి యువకుడికి ప్రాణదానం చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, సాధారణ జనం సదరు వ్యక్తిపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రాణదాతగా కొనియాడారు.


ఈ క్రమంలో మనం కూడా ఆపదలో ఉన్న ప్రాణానికి ఆయువుపోయాలంటే సీపీఆర్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నిజానికి సీపీఆర్ అనేది గుండెకు రక్తాన్ని పంపింగ్ చేయడంతోపాటు అదే సమయంలో ఊపిరితిత్తులు ఫ్రెష్ ఆక్సిజన్ తీసుకునేలా చేస్తుంది. కార్డియాక్ అరెస్టు అయిన బాధితులు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.

కార్డియాక్ అరెస్ట్‌కు ముందు..

కార్డియాక్ అరెస్ట్‌కు ముందు వ్యక్తి గుండె వేగంగా కొట్టుకుంటుంది. మామూలు పరిస్థితిలో గుండె 50 నుంచి 80 సార్లు కొట్టుకుంటుంది. కానీ కార్డియాక్ అరెస్ట్ సమయంలో మాత్రం 200 కంటే ఎక్కువ సార్లు కొట్టుకుంటుంది. విపరీత వేగంతో గుండె కొట్టుకోవడంవల్ల దాని పనితీరు దెబ్బతిని ఒక్కసారిగా ఆగిపోతుంది. ఇలాంటి సమయంలో సీపీఆర్ చేసి తిరిగి గుండె కొట్టుకునేలా చేయవచ్చు.


అయితే పిల్లలు, పెద్దలను బట్టి వేర్వేరు పద్ధతిలో సీపీఆర్ చేయాల్సి ఉంటుంది. కార్డియాక్ అరెస్ట్‌కు గురైన వ్యక్తులను గట్టిగా అరుస్తూ పిలిచి లేపే ప్రయత్నం చేయాలి. అంబులెన్స్‌కు సమాచారం అందించాలి. శ్వాస ఆడుతుందో లేదో చెక్ చేయాలి. సదరు వ్యక్తిని వెల్లకిలా పడుకోబెట్టాలి. అప్పుడు సీపీఆర్ చేయాలి.

పెద్దలకు సీపీఆర్..

వ్యక్తి ఛాతిపై చేతులను ఉంచాలి. ఛాతికి మధ్యలో ఒక చేతి మడమను ఉంచాలి. తర్వాత అదే చేతిపై మరో చేతిని ఉంచి బరువు పెట్టాలి. రెండు చేతులతో ఛాతిని బలంగా ప్రెస్ చేయాలి. సెకనుకు రెండుసార్లు కనీసం 20 సెకన్ల పాటు ప్రెస్ చేస్తూ ఉండాలి. తర్వాత నోటి ద్వారా శ్వాసను అందించడానికి ప్రయత్నించాలి. నోటి గదవను పైకి లేపి నేరుగా నోటి ద్వారా శ్వాస అందించాలి. శ్వాస ఆడేవరకు, గుండెకొట్టుకునే వరకు ఇదే ప్రక్రియను చేస్తూ ఉండాలి.

పిల్లలకు సీపీఆర్..

పిల్లలకు చేసే సీపీఆర్ కూడా పెద్దలకు చేసే మాదిరిగానే ఉంటుంది. 8 ఏళ్ల పిల్లలు అయితే రెండు చేతులతో, చిన్న పిల్లలైతే ఒక చేతితో ఛాతిపై ప్రెస్ చేయాలి. మరీ బలంగా ఛాతీని ప్రెస్ చేయకూడదు. ఇక అలా ప్రెస్ చేస్తూనే మధ్యలో రెస్క్యూ బ్రీత్ అందించాలి. చెస్ట్‌పై 30 సార్లు నొక్కి ఆ తర్వాత రెండు సార్లు నోటి ద్వారా శ్వాస అందించాలి. గుండె కొట్టుకునే వరకు ఇలా కంటిన్యూ చేయాలి.

శిశువులకు ఎలా చేయాలి..?


శిశువులు చాలా సున్నితంగా ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా చేయాలి. శ్వాస ఆగిపోయినప్పుడు రెండు వేళ్లను ఛాతిపై ఉంచి సీపీఆర్ చేయాలి. మరీ గట్టిగా బలమంతా ఉపయోగించి ప్రెస్ చేయకూడదు. ఒక సెకనుకు రెండు సార్లు ఛాతిని ప్రెస్ చేయాలి. నోటి ద్వారా శ్వాస అందించాలి. శ్వాస ఆడే వరకు, గుండె కొట్టుకునే వరకు ఇలా చేస్తూ ఉండాలి.

ఇవి గుర్తుంచుకోండి..

సీపీఆర్ చేసే విషయంలో అవగాహన లేని కారణంగా కొందరు కన్ఫ్యూజ్ అవుతుంటారు. గుండె పైభాగంలో ఉండే స్టెర్నమ్ అనే ఎముక వద్ద ప్రెస్ చేయాలని గుర్తుంచుకోండి. వ్యక్తిని బట్టి ఛాతిపై ఒత్తిడి అందించాలి తప్ప పిల్లలు, పెద్దలు, శిశువులకు ఒకేలా చేయకూడదు. పెద్దవారికి ఒకలా, పిల్లలకు మరోలా ప్రెస్ చేయాలి. సీపీఆర్ చేయడంలో ట్రైనింగ్ తీసుకున్నవారు లేదా పూర్తిగా అవగాహన ఉన్నవారు చేస్తే మరీ మంచిది.

Next Story

Most Viewed