డోంట్ షేర్: పిల్లల ఫోటోలను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయొద్దు

by Disha Web Desk 10 |
డోంట్ షేర్:  పిల్లల ఫోటోలను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయొద్దు
X

దిశ, ఫీచర్స్: సాధారణంగా పిల్లల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసి మురిసిపోతుంటారు పేరెంట్స్. చిన్నారుల ముద్దుముద్దు మాటలు, బుడిబుడి అడుగులకు ఫిదా అయిపోయిన నెటిజన్స్ సదరు ఎకౌంట్‌ను ఫాలో అయ్యే అవకాశాలు కూడా ఎక్కువే. తద్వారా ఆల్టర్నేట్‌గా సంపాదనా వస్తుంది. అయితే ఇలా చేయడం పిల్లల ప్రైవసీని దెబ్బతీసినట్లే అంటున్న ఫ్రెంచ్ గవర్నమెంట్ నిషేధం విధించింది. మరో అడుగు ముందుకు వేసి చట్టం కూడా చేసింది. భద్రత, గోప్యత చట్టాలలో భాగంగా ఫ్రెంచ్ నేషనల్ అసెంబ్లీ (French national assembly) పిల్లల ఫోటోలను షేర్ చేసే తల్లిదండ్రులకు ఫైన్ వేసే చట్టాన్ని ఆమోదించింది. పిల్లల గౌరవం లేదా నైతికతను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తే పేరెంట్స్ తమ పిల్లల ‘ఇమేజ్ రైట్స్’ కోల్పోతారని హెచ్చరించింది. అయితే బిల్లు ఇంకా సెనేట్, ప్రెసిడెంట్ ఆమోదం పొందనప్పటికీ చాలా మంది చైల్డ్ సైకాలజిస్టులు, సోషల్ మీడియా నిపుణులు మాత్రం ఈ నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు. బిల్లు ప్రవేశ పెట్టడానికి ప్రధాన కారకుడైన ఫ్రాన్స్ ఎంపీ బ్రూనో మాట్లాడుతూ.. గోప్యతను కాపాడటం తల్లిదండ్రుల బాధ్యతలలో ఒకటిగా గుర్తించి, వారిని శక్తివంతం చేయడమే తమ లక్ష్యమని తెలిపాడు.

సోషల్ రెస్పాన్స్‌ బులిటీ

ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో పిల్లల ఇమేజెస్ పంచుకోవడం చాలా ఎక్కువైంది. కొంతమంది పేరెంట్స్ తమ పిల్లలతో ప్రతీ యాక్టివిటీని షేర్ చేస్తుంటారు. అయితే ప్రస్తుతం ఫ్రెంచ్ గవర్నమెంట్ దీనిని బ్యాన్ చేయడంతో.. పేరెంట్స్ దీన్ని తమ హక్కుగా వాదిస్తున్నారు. కానీ సామాజిక కోణంలో ఆలోచించినప్పుడు అది కరెక్ట్ కాదని ఫ్రెంచ్ గవర్నమెంట్ చెప్తోంది. నిషేధిత ఆలోచన సరైందని, ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని సూచిస్తోంది. ‘ఒక పేరెంట్‌గా నేను ఇది కష్టమైనదని అర్థం చేసుకోగలను, ప్రత్యేకించి మనం పిల్లలకోసం ప్రతిదీ చేస్తాం. వనకు తెలియకుండానే వారిపై ఓనర్‌షిప్ భావాన్ని పెంపొందించుకుంటాం. అంతేకాకుండా రెస్పెక్ట్ ఫుల్ పేరెంటింగ్ (respectful parenting) అనేది ఒక గౌరవప్రదమైన అంతర్గత భావన. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని డైజెస్ట్ చేసుకోవడం కష్టమే. కానీ అదికూడా మంచిదే. తర్వాత అలవాటు అయిపోతుంది’’ అని కూడా పలువురు పేరెంట్స్ స్పందిస్తున్నారు.

పెద్దయ్యాక ఆ ఫొటోలు చూస్తే..

తమ పిల్లల కోసం ఇన్‌స్టాగ్రామ్ పేజీని ఓపెన్ చేసి, పుట్టినప్పటి నుంచి వారి ఫోటోలను పోస్ట్ చేసి, వారు పెద్దయ్యాక వారికి ఇవ్వాలని ప్లాన్ చేసే చాలా మంది తల్లిదండ్రులను మనం చూస్తుంటాం. ఇది గ్రేట్ ఐడియా అయినప్పటికీ పిల్లల ప్రైవేట్ మూవ్‌మెంట్స్ ఫోటోలను పోస్ట్ చేయడం కరెక్ట్ కాదనేది నిపుణులు చెప్తున్న మాట. ‘‘చిన్నప్పుడు పేరెంట్స్ తీసిన నగ్న ఫోటోలవల్ల మనలో చాలా మంది ఇబ్బంది పడలేదా? వాటిలో కొన్ని ఫ్రేమ్ కూడా చేస్తుంటారు. కొన్నింటిని మన స్నేహితులకు చూపుతుంటారు. కొన్ని సందర్భాల్లో పిల్లలు పెద్దయ్యాక సోషల్ మీడియాలో వారు తమ నగ్న ఫోటోలను చూసినప్పుడు ఎలా ఫీలవుతారో ఒకసారి ఊహించుకోండి. వారు తమ ప్రైవేట్ మూవ్‌మెంట్స్, బాడీ‌షేప్స్ ఇంటర్నెట్‌లో కనిపించడాన్ని ఇబ్బందిగా భావిస్తారు. ఇది చాలు కదా అర్థం చేసుకోవడానికి’’ అని కొందరు నిపుణులు అభిప్రాయడుతున్నారు. ఫ్రెంచ్ గవర్నమెంట్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు.

ప్రైవేట్ అకౌంటే అనుకుంటే..

తాము తమ ప్రైవేట్ సోషల్ మీడియా లేదా ఆన్‌లైన్ ఖాతాలో మాత్రమే ఫొటోలను పోస్ట్ చేస్తున్నారని వాదించవచ్చు. ప్రైవేట్ లేదా పబ్లిక్ ఖాతాను కలిగి ఉండటం పెద్దగా పట్టించుకోవాల్సిన విషయం కాదని అనిపించవచ్చు. కానీ ఏ ఖాతా అయినా హ్యాక్ కాదని గ్యారెంటీ ఏమిటి? బరాక్ ఒబామా నుంచి కిమ్ కర్దాషియాన్ వరకు చాలా మంది సెలబ్రిటీలు హ్యాకింగ్‌కు గురయ్యారు. పెడోఫైల్ హ్యాకర్ ఖాతాలను హ్యాక్ చేసి, పిల్లల ప్రైవేట్ చిత్రాలన్నింటినీ దొంగిలించడానికి ఎంత సమయం పడుతుంది? అంతేకాకుండా, మీకు తెలిసిన వ్యక్తుల గురించి మీకు నిజంగా తెలుసా? దురదృష్టవశాత్తూ తెలిసిన వ్యక్తులే దుర్మార్గపు ఆలోచనను కలిగి ఉండవచ్చు.

పిల్లలపై లైంగిక వేధింపులు

పెడోఫైల్స్(paedophiles)తమ టార్గెట్‌ను చేరుకోవడానికి నేడు ఆన్‌లైన్‌, సోషల్ మీడియా వెరీ కంఫర్టబుల్ ప్లాట్ ఫామ్. 2021లో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో పోక్సో చట్టం కింద 33,348 లైంగిక వేధింపుల కేసులను నమోదు చేసింది. ఇందులో 33036 మంది బాలికలు, 312 మంది బాలురు ఉన్నారు. పిల్లలపై భయంకరంగా పెరుగుతున్న లైంగిక నేరాల సంఖ్యను పరిగణనలోకి తీసుకున్నప్పుడు మనం సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. పేరెంట్స్ తమ పిల్లల ఫొటోలను తీసుకోవడంలో తప్పులేదు. అందులో ఆనందం ఉంటుంది. అందమైన ఫొటోలు భద్రపర్చుకోండి. కానీ సోషల్ మీడియాలో షేర్ చేసే విషయంలో మాత్రం జాగ్రత్త అంటున్నారు నిపుణులు. పిల్లలపై పెరుగుతున్న లైంగిక నేరాల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే, మనం సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. పేరెంట్స్‌గా పిల్లలకు శారీరక సంరక్షణ, భద్రత మన బాధ్యత కాబట్టి. పిల్లలు తమకేం కావాలో గుర్తించే వయస్సులో లేనప్పుడు వారి గురించి ఆలోచించాలి.


Next Story