చీమలు చిన్నవే కదా అనుకోకండి.. డైనోసార్లకంటే గట్టివి!

by Javid Pasha |
చీమలు చిన్నవే కదా అనుకోకండి..  డైనోసార్లకంటే గట్టివి!
X

దిశ, ఫీచర్స్ : చీమలు.. పేరు వినగానే చిన్నపాటి జీవులు కదా అనుకుంటాం. కానీ వాటి చరిత్ర తెలిస్తే మాత్రం వామ్మో చీమలా! అని ఆశ్యర్య పోవాల్సిందే. ఎందుకంటే ఈ భూమిపై డైనోసార్లు కూడా అంతరించాయి. కానీ చిన్నపాటి చీమలు మాత్రం ఇప్పటికీ మనుగడసాగిస్తున్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులను సైతం తట్టుకుంటూ నిలబడగలుగుతున్నాయి. హాంకాంగ్ యూనివర్సిటీ, అలాగే జర్మన్ వుర్జ్‌బర్గ్‌లో గల జూలియస్ మాక్సిమిలియన్ యూనివర్సిటీలకు చెందిన శాస్త్రవేత్తలు ఇటీవల చీమల చరిత్ర తెలుసుకునే అధ్యయనాలు నిర్వహించారు.

చీమల చరిత్ర

రీసెంట్‌గా అమెరికాలోని వయోమింగ్ రాష్ట్రంలో ఓ చీమల శిలాజాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు దానిని విశ్లేషించిన తర్వాత సుమారు 47 మిలియన్ సంవత్సరాల కిందట భూమిపై భారీ చీమలు కూడా ఉండేవని నిర్ధారణకు వచ్చారు. అలాగే మయన్మార్‌లోనూ 99 మిలియన్ సంవత్సరాల కిందట జీవించిన హెల్ యాంట్ పేరుగల చీమల నమూనాను కనుగొన్నారు. దీనిని చీమలకు సుమారు 130 మిలియన్ సంవత్సరాల చరిత్ర ఉందని పరిశోధకులు భావిస్తున్నారు.

చీమ జాతులు ఎన్ని?

ప్రపచంలో సుమారు 12 వేల నుంచి 15 వేలకు పైగా చీమ జాతులు ఉన్నట్లు పరిశోధకులు చెప్తున్నారు. ఒకప్పుడు అడవి పక్షులు, క్షీరదాలకంటే కూడా బరువుగల అరుదైన చీమలు కూడా భూమిపై నివసించాయని, వీటి బరువు మానవుల బయోమాస్‌లో 20 శాతం ఉండేదని అనుమానిస్తున్నారు. కాగా చీమలు మొదట కందిరీగల నుంచి ఉద్భవించాయని పలు పరిశోధనల్లో తేలింది. తర్వాత వాటి పరిమాణం మారుతూ వచ్చింది. ఇక 0.07-2 అంగుళాల మధ్యలో ఉండే చీమలు అంటార్కిటికా, ఐస్‌ల్యాండ్, గ్రీన్ ల్యాండ్ మినహా ప్రపంచలో అన్నిచోట్లా కనిపిస్తాయి.

౩౦ ఏండ్లు జీవిస్తున్న రాణి చీమ

చీమలలో మగ కారిమక్ చీమల జీవితకాలం మూడేండ్లలోపు ఉంటుంది. కాగా చీమల్లో కూడా తేనెటీగల మాదిరిగానే రాణి చీమలు కూడా ఉంటాయి. ఒక రాణి చీమ సుమారు 30 ఏండ్లపాటు జీవిస్తుందట. ఇవి ఫలదీకరణం తర్వాత ఇవి కాలక్రమేణా మిలియన్ల కొద్దీ గుడ్లు పెడుతుంటాయి. ఇక మారికోపా హార్వెస్టర్‌ చీమ చాలా శక్తివంతమైందట. 12 తేనెటీగలు కలిసి కఠినంగా కుట్టగలిగేంత సామర్థ్యం ఈ ఒక్క మారికోపాలోనే ఉంటుందట. పైగా దీనిని ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన చీమగా నిపుణులు పేర్కొంటున్నారు. మరో ఆశ్యర్యకరమైన విషయం ఏంటంటే.. చీమల్లో రెండు పొట్టలు ఉంటాయి. ఒకటి తన ఆహారం తీసుకోవడానికి, రెండవది ఇతర చీమలను పోషించడానికి ఉపయోగిస్తాయి. ఇవి తమ శరీర బరువుకంటే 50 రెట్లు ఎక్కువ బరువును మోయగలవు.



Next Story

Most Viewed